ఈ గుడ్లు తినగలరా..?

ABN , First Publish Date - 2021-07-22T05:10:08+05:30 IST

జిల్లాలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పర్యవేణలో 3621 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 1.75 లక్షల మంది ఆరేళ్లలోపు పసి పిల్లలు, 45 వేల మంది గర్భిణీలు, బాలింతలకు వివిధ సేవలు అందిస్తున్నారు.

ఈ గుడ్లు తినగలరా..?
వీరపునాయునిపల్లె మండలంలో బాలింతకు పంపిణీ చేసిన పాడైపోయిన గుడ్లు

అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు

తినలేక పడేస్తున్న వైనం

సరఫరాలో నిర్లక్ష్యమే కారణం

జిల్లాలో నెలకు 25 లక్షలకుపైగా గుడ్లు పంపిణీ 


వీరపునాయునిపల్లె మండలం అడవి చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఓ బాలింతకు నెలకు సరిపడా 25 కోడిగుడ్లు అంగన్వాడీ నిర్వాహకులు పంపిణీ చేశారు. అనుమానం వచ్చి ఓ గుడ్డును పగలగొడితే చెడిపోయింది.. సగానికిపైగా ఇదే పరిస్థితి. ఇదేమిటని అంగన్వాడీ నిర్వాహకులను ప్రశ్నిస్తే సరైన సమాధానం లేదు. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందనే ఆరోపణలు ఉన్నాయి. సరఫరా.. పంపిణీలో నిర్లక్ష్యమే కారణం అని తెలుస్తోంది. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పర్యవేణలో 3621 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 1.75 లక్షల మంది ఆరేళ్లలోపు పసి పిల్లలు, 45 వేల మంది గర్భిణీలు, బాలింతలకు వివిధ సేవలు అందిస్తున్నారు. పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణ, పోషకాలు కలిగిన ఆహారం అందించాలన్నది ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా కోడిగుడ్లతో పాటు బియ్యం, కందిపప్పు, వంట నూనె, పాలు సరఫరా చేస్తున్నారు. మూడు నెలల నుంచి గర్భిణీలు అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుంటే ఆ రోజు నుంచి ప్రసవం తరువాత ఆరు నెలల వరకు ఈ ప్రయోజనాలు అందుతాయి. ఏడు నెలల నుంచి మూడేళ్ల పసి పిల్లలకు బాలామృతం, గుడ్లు, పాలు అందిస్తారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయితే అధికారుల పర్యవేక్షణ లోపమో.. కాంట్రాక్టర్ల అలసత్వం వల్లనో కుళ్లిపోయిన గుడ్లు సరఫరా అవుతున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. 


నెలకు 25 లక్షల గుడ్లు సరఫరా

జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో 1.75 లక్షల మంది ఆరేళ్లలోపు పిల్లలు ఉంటే.. వారిలో 3-6 ఏళ్ల పిల్లలు 95 వేల మంది ఉన్నారు. 45 వేల మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారని స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారులు తెలిపారు. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలకు ఒక్కొక్కరికి నెలకు 25 గుడ్లు పంపిణీ చేస్తున్నారు. ఈ లెక్కన ప్రతి నెలా సగటున 25 లక్షల నుంచి 30 లక్షల గుడ్లు సరఫరా చేస్తున్నామని అధికారులు వివరించారు. ఏ రోజుకు ఆ రోజు ‘ఎగ్‌ నెక్‌ రేట్‌’ ప్రకారం ధర చెల్లిస్తున్నారు. సగటున ఒక్కో గుడ్డు రూ.4.65 ప్రకారం నెలకు రూ.1.15 కోట్లు నుంచి రూ.1.40 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కేవలం గుడ్ల రూపంలో ఏడాదికి చేసే ఖర్చు సరాసరి రూ.15 కోట్లు పైమాటే. రవాణా చార్జీలు అదనం. 


ఆ పాపం ఎవరిది..?: 

కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. దీంతో టేక్‌ హోం రిసీవ్‌ (టీహెచఆర్‌)లో భాగంగా ఇళ్లకే నెలలో రెండు పర్యాయాలు పంపిణీ చేస్తున్నారు. తొలి 15 రోజులకు 13, రెండో దఫా 12 గుడ్లు పంపిణీ చేయాలి. ఏపీ డెయిరీ సంస్థ సరఫరాలో జాప్యమో.. లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో అంగన్వాడీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనో పలు గ్రామాల్లో నెలకు సరిపడా 25 గుడ్లు ఒకేసారి ఇస్తున్నారు. దీంతో అవి చెడిపోయి పారవేయాల్సి వస్తోంది. కోళ్ల ఫారాల నుంచి కేంద్రాలకు సరఫరా చేయాల్సిన కాంట్రాక్ట్‌ సంస్థ జాప్యం వల్ల కూడా పాడైపోతున్నాయని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.  పాడైపోయిన గుడ్లను తింటే గ్యాసి్ట్రక్‌, పేగుల సంబంధిత జబ్బులు, ఇన్ఫెక్షన వచ్చే ప్రమాదం ఉందని రిమ్స్‌ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ రామారావు తెలిపారు. 


ఐసీడీఎస్‌ ద్వారా అందే నెలకు సాయం

సరుకులు గర్భిణీలు బాలింతలు 7 నెలల మూడేళ్లు 3 నుంచి ఆరేళ్లు

(3-9 నెలలు) (7 నెలల వరకు)

కోడిగుడ్లు 25 25 -- 25

బియ్యం (కిలోలు) 3 3 2.5 (బాలామృతం) 2

కందిపప్పు 1 1 -- అర కిలో

వంట నూనె (లీటర్లు) 1 1 -- 125 గ్రాములు

పాలు (లీటర్లు) 5 5 2.5 2.5


పాడైన గుడ్లు పంపిణీ చేస్తే చర్యలు తప్పవు 

- పద్యజ, పీడీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, కడప

అంగన్వాడీ కేంద్రాలకు 15 రోజులకు ఒకసారి గుడ్లు సరఫరా చేస్తున్నాం. వచ్చిన రోజు లేదా ఆ మరుసటి రోజు పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు పంపిణీ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అంతేకాదు.. కాంట్రాక్ట్‌ సంస్థ చెడిపోయిన గుడ్లు పంపిణీ చేసినా.. చిన్న సైజు గుడ్లు ఇచ్చినా అక్కడే వాపసు చేయమని చెప్పాం. ఎక్కడైనా చెడిపోయిన గుడ్లు పంపిణీ చేసినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తప్పవు.

Updated Date - 2021-07-22T05:10:08+05:30 IST