జగన్‌ చేసిన అభివృద్ధి ఏంటో చూపిస్తారా?

ABN , First Publish Date - 2022-09-27T07:32:45+05:30 IST

కుప్పంలో జగన్‌ చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే మీరు చూపిస్తారా అంటూ టీడీపీ నేతలు సవాల్‌ విసిరారు.

జగన్‌ చేసిన అభివృద్ధి ఏంటో చూపిస్తారా?
సన్మానం అందుకున్న గౌనివారి శ్రీనివాసులు తదితరులు

చంద్రబాబు పాలనలో జరిగిన పనులను చూపించడానికి మేము సిద్ధం 

వైసీపీకి టీడీపీ నేతల సవాల్‌ 

ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని వెల్లడి 


కుప్పం, సెప్టెంబరు 26: ‘కుప్పంలో సభ పెట్టి ఇక్కడి అభివృద్ధికి ఏదో చేసేశామని సీఎం జగన్‌ అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు కుప్పానికి ఏమీ చేయలేదన్నారు. టీడీపీ హయాంలో గ్రామగ్రామాన జరిగిన అభివృద్ధి పనులు చూపడానికి మేము సిద్ధం. మరి.. ఈ మూడేళ్లలో జగన్‌ చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే మీరు చూపిస్తారా’ అంటూ వైసీపీకి టీడీపీ నేతలు సవాల్‌ విసిరారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం మండల తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పి.ఎ్‌స.మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ.. గతంలో టీడీపీ చేసిన అభివృద్ధికి రంగులు వేసుకోడం తప్ప కుప్పం నియోజకవర్గంలో జగన్‌ చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు ఏమీ చేయలేదంటూ అబద్ధాలతో నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టలేరన్నారు. చంద్రబాబు కుప్పంలో చేసిన అభివృద్ధిపై గ్రామాల్లో సభలు నిర్వహించి, ప్రజలకు తెలియజెప్పి, ప్రజాక్షేత్రంలోనే ఎవరేమిటో తేల్చుకుంటామన్నారు. తప్పుడు కేసులు పెట్టి, జైళ్లకు పంపితే భయపడిపోతామని అనుకోవద్దని, ఇప్పుడు కార్యకర్తలు, ప్రజలు వైసీపీని ఇంటికి పంపడానికి మరింత కసితో రగిలిపోతున్నారన్నారు. దాడులు చేసినవారిని కాకుండా బాధితులను జైళ్లలో వేయడం రాజారెడ్డి రాజ్యాంగంలో తప్ప మరెక్కడా ఉండదన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి వెళ్లి చెబుతావనాఆ్నరు. అధికార పార్టీ నేతల గురించి టీడీపీ కార్యకర్తలు, నాయకులు పల్లెత్తుమాట అనాల్సిన పనిలేదని, ప్రజల వద్దకు వెళ్లి టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రచారం చేస్తే చాలన్నారు. అలాగని వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు వెరవాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలో చంద్రబాబు రాకముందు బురద నీళ్లు తాగేవారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒంటి స్తంభం నీటి ట్యాంకులు కట్టి, తాగునీటి సదుపాయం కల్పించిందని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం స్థాయి వ్యక్తి కుల ప్రస్తావన తేవడం అవివేకమన్నారు. 113 కార్పొరేషన్లు పెట్టారు కానీ, బీసీలకు ఒక్క రూపాయి రుణం ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. చంద్రబాబు లోకలా నాన్‌ లోకలా అన్నది సమస్య కాదన్నారు. ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా లేదా అన్నదే ముఖ్యమన్నారు. అభివృద్ధి బాగా జరిగినప్పుడు ఎవరికి ఎటువంటి అభ్యంతరమూ ఉండనక్కరలేదన్నారు. ఆ మాటకొస్తే కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం ప్రకటించిన ఎమ్మెల్సీ భరత్‌ ఎక్కడి వారని ప్రశ్నించారు. కులాలమధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మానుకోవాలని, అబద్ధాలు చెప్పడం మాని చేతనైతే అభివృద్ధి చేసి చూపించాలని హితవు పలికారు. అంతకుముందు జైలునుంచి బెయిలుపై విడుదలైన గౌనివారి శ్రీనివాసులు, ముఖేశ్‌ (అప్పు), మునెప్ప, ఎం.సుబ్రమణ్యంను కార్యకర్తలు, నాయకులు సన్మానించారు. సమావేశం అనంతరం ఆర్టీసీ బస్టాండు కూడలిలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. కుప్పం రూరల్‌ మండల టీడీపీ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, మాజీ ఎంపీపీ సాంబశివం, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ సత్యేంద్రశేఖర్‌, తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడు మణి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-27T07:32:45+05:30 IST