వలసల విధానానికి కీలక మార్పులు చేస్తున్న కెనడా

ABN , First Publish Date - 2022-09-03T02:35:08+05:30 IST

కెనడాలో ప్రస్తుతం అమలవుతున్న వలసల విధానానికి కీలక మార్పులు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో పలు మార్పులను తాజాగా ప్రకటించింది.

వలసల విధానానికి కీలక మార్పులు చేస్తున్న కెనడా

ఎన్నారై డెస్క్: కెనడాలో(Canada) ప్రస్తుతం అమలవుతున్న వలసల విధానానికి కీలక మార్పులు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో పలు మార్పులను తాజాగా ప్రకటించింది. వీసాల జారీలో జాప్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రస్తుతమున్న నిబంధనలకు ఐదు ముఖ్యమైన మార్పులు చేసింది. ఈ ఏడాది మొత్తం 4.31 లక్షల మంది విదేశీయులకు కెనడాలో శాశ్వత నివాసం(Permanent Residency) కల్పించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆగస్టు 22 నాటికి దాదాపు 3 లక్షల మంది కెనడాకు చేరుకున్నారు. గత రెండేళ్లల్లో కెనడా ప్రభుత్వం ముందనుకున్న లక్ష్యానికి మించి విదేశీయులకు దేశంలోకి శాశ్వత ప్రాతిపదికన ఆహ్వానించింది. 


కెనడాలో ఇప్పటికే ఉంటూ శాశ్వత, తాత్కాలిక నివాసార్హతల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి కొన్ని పరిమితులకు లోబడి మెడికల్ టెస్టుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. వీటికి సంబంధించి సవివరమైన మార్గదర్శకాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. 


కరోనా కారణంగా దూరమైన కుటుంబసభ్యులను మళ్లీ ఒకదగ్గరికి చేర్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వర్చువల్ ఇంటర్వ్యూల సంఖ్యను పెంచేందుకు నిర్ణయించింది. 2021 నుంచే ప్రభుత్వం టెలిఫోన్, వీడియో ఇంటర్వ్యూల ద్వారా వీసా దరఖాస్తుదారులను స్పాన్సర్లను దగ్గరికి చేర్చింది. ఫలితంగా 2021లో 69 వేల మంది కెనడాలో ఉంటున్న తమ జీవితభాగస్వాములను,  తల్లిదండ్రులను కలుసుకోగలిగారు.


శాశ్వత నివాసార్హత కోసం కోరుకుంటున్న వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా డిజిటైజేషన్ ప్రక్రియను సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభించనుంది. వంద శాతం డిజిటలీకరణే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.


తమ అప్లికేషన్ పరిశీలన ఏ దశలో ఉందో వీసా దరఖాస్తుదారులు సులువుగా తెలుసుకునేందుకు.. ప్రభుత్వం స్టేటస్ ట్రాకర్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టింది. శాశ్వత నివాసార్హత కోసం ప్రయత్నిస్తున్న వీసా దరఖాస్తుదారులు, వారి స్పాన్సర్లు, వారి ప్రతినిధులకు ఈ వ్యవస్థ అత్యంత అనుకూలంగా కానుంది. 


పౌరసత్వ జారీ ప్రక్రియను కూడా పూర్తిస్థాయిలో డిజిటలీకరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆన్‌లైన్‌లో అభ్యర్థులు తమ దరఖాస్తు దాఖలు చేసేందుకు వీలుగా ఓ సదుపాయాన్ని గతేడాది ప్రవేశపెట్టింది. 



Updated Date - 2022-09-03T02:35:08+05:30 IST