పెళ్లి పేరుతో NRI నుంచి రూ.1.3కోట్లు లాగేసిన వితంతువు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-27T16:50:53+05:30 IST

కెనడాలో ఉండే ఓ ఎన్నారై వధువు కోసం మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా వెతుకుతున్న సమయంలో అతడికి ఓ వింతతువుతో పరిచయం ఏర్పడింది.

పెళ్లి పేరుతో NRI నుంచి రూ.1.3కోట్లు లాగేసిన వితంతువు.. అసలేం జరిగిందంటే..

చెన్నై: కెనడాలో ఉండే ఓ ఎన్నారై వధువు కోసం మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా వెతుకుతున్న సమయంలో అతడికి ఓ వింతతువుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా భారీ నష్టాన్ని మిగిల్చింది. ఏకంగా రూ.1.3కోట్లు పోగొట్టుకున్నాడు. అంతేకాదండోయ్ ఆమె కోసం కెనడా నుంచి ఇండియాకు వచ్చి మరో రూ.3.6లక్షలు లాస్ అయ్యాడు. ఈ విషయమై ఎన్నారై పోలీసులను ఆశ్రయించడంతో మహిళకు సహకరించిన కీలకమైన వ్యక్తిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు చెందిన పచైయప్పన్ కెనడాలో స్థిరపడ్డారు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యతో విడాకులు కావడంతో రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా వధువును వెతికే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడికి ఓ మహిళ ఫొటో నచ్చడంతో దాని కింద ఉన్న ఓ కాంటాక్ట్ నెంబర్‌కు కాల్ చేశాడు. 


అవతల ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడాడు. ఫొటోలో ఉన్న మహిళ పేరు రాజేశ్వరి అని, ఆమె భర్త చనిపోవడంతో రెండో పెళ్లి కోసం తానే వెబ్‌సైట్‌లో ఆమె ఫొటో అప్‌లోడ్ చేసినట్లు చెప్పాడు. ఆ ఫోన్ మాట్లాడిన వ్యక్తి తన పేరు సెంథిల్ ప్రకాశ్ అని, రాజేశ్వరికి బంధువునంటూ పరిచయం చేసుకున్నాడు. అనంతరం పచైయప్పన్ గురించి అంత వాకాబు చేసి, రాజేశ్వరి మొబైల్ నం.తో పాటు ఈ-మెయిల్ ఐడీ ఇచ్చాడు సెంథిల్. దాంతో పచైయప్పన్ ఆమెకు ఫోన్ చేశాడు. కొద్దిసేపు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఆమె తల్లి రాణి, సోదరుడితో కూడా మాట్లాడించింది. అనంతరం సెంథిల్ కుమార్ ఆమె ఫొటో ఒకటి అతనికి వాట్సాప్ చేశాడు. ఇలా కొన్నిరోజులు రాజేశ్వరితో పచైయప్పన్ ఫొన్‌లో మాట్లాడడం చేశాడు. ఈ క్రమంలో ఆమె సెంథిల్ సహయంతో వివిధ కారణాలు చెబుతూ పచైయప్పన్ నుంచి ఏకంగా రూ.1.3 కోట్లు లాగేసింది. ఇలా ఉండగా ఒకరోజు రాజేశ్వరిని వీడియో కాల్ మాట్లాడుదామని అడిగాడు. 


కానీ, దానికి ఆమె నిరాకరించింది. వీడియో కాల్ ఎందుకు నేరుగా ఇండియాకు రమ్మని కోరింది. దాంతో మార్చిలో పచైయప్పన్ స్వదేశానికి వచ్చాడు. ఒక హోటల్‌లో దిగి రాజేశ్వరిని కబురు చేశాడు. అయితే, అక్కడికి రాజేశ్వరి రాలేదుగానీ సెంథిల్ ప్రకాశ్ ఓ ముఠాతో కలిసి వచ్చాడు. అనంతరం పచైయప్పన్ వద్ద ఉన్న విలువైన ఐఫోన్, నగదు తీసుకుని ఈ విషయం ఎవరికైనా చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. దాంతో పచైయప్పన్ ప్రాణభయంతో తిరిగి కెనడా వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లిన తర్వాత స్వదేశంలో ఉన్న బంధువులకు జరిగిన విషయం చెప్పాడు. వారి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సెంథిల్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.        


Updated Date - 2022-04-27T16:50:53+05:30 IST