అమెరికాకంటే అదే బెటర్..! భారతీయుల్లో మారుతున్న ట్రెండ్!

ABN , First Publish Date - 2022-03-19T23:21:26+05:30 IST

అమెరికా అంటే భూతల స్వర్గం.. అవకాశాల ఖజాగా! ఒక్కసారి అక్కడ కాలు పెడితే చాలు.. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. ఆర్థికంగా అందలాలు ఎక్కేయచ్చు! ఇదీ సగటు భారతీయుడికి ఉండే ఆలోచన. ఇప్పటికీ ఈ ఆలోచనా ధోరణిలో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ.. అమెరికాలోని పరిస్థితుల రీత్యా అనేక మంది ప్రస్తుతం అమెరికా కలను పక్కకు పెట్టి..

అమెరికాకంటే అదే బెటర్..! భారతీయుల్లో మారుతున్న ట్రెండ్!

ఎన్నారై డెస్క్: అమెరికా అంటే భూతల స్వర్గం.. అవకాశాల ఖజానా! ఒక్కసారి అక్కడ కాలు పెడితే చాలు.. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. ఆర్థికంగా అందలాలు ఎక్కేయచ్చు! ఇదీ సగటు భారతీయుడికి, ముఖ్యంగా విద్యార్థులకు ఉండే ఆలోచన. ఇప్పటికీ ఈ ఆలోచనా ధోరణిలో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ.. అమెరికాలోని పరిస్థితుల రీత్యా అనేక మంది ప్రస్తుతం అమెరికా కలను పక్కకు పెట్టి కెనడా వైపు చూస్తున్నారు. ఇటీవల కాలంలో కెనడాకు చేరుకుంటున్న భారతీయుల సంఖ్య పెరగడానికి కారణం ఇదేనంటోంది తాజాగా విడుదలైన ఓ నివేదిక. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ(ఎన్ఎప్ఏపీ) సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. 


దీని ప్రకారం.. 2016 నుంచి 2021 మధ్య కెనడాలో శాశ్వత నివాసార్హత(పర్మెనెంట్ రెసిడెన్సీ) పొందిన భారతీయుల సంఖ్య ఏకంగా 115 శాతం పెరిగింది. కెనడాలో స్థిరపడాలనుకునే వారే కాకుండా.. ఉన్నత చదువులకు కెనడాను ఎంచుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో అమెరికాలో పీజీ స్థాయిలోని సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరిన వారి సంఖ్య 40 శాతం పడిపోగా.. కెనడా కాలేజీలూ యూనివర్శిటీల్లో చేరుతున్న వారు ఏకంగా 182 శాతం పెరిగారు. కెనడాలో టెంపరరీ వీసాలు పొందడం లేదా అక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం ఎంత సులువులో ఈ లెక్కలు కళ్లకుకట్టినట్టు చెబుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.


ఇక కెనడాలో శాశ్వత నివాసం కోసం ప్రయత్నించేవారు, పోస్ట్ గ్రాడ్యూయేట్ వర్క్ పర్మిట్ పొందడాన్ని ఆ దిశలో తొలి అడుగుగా భావిస్తారు. ‘‘అమెరికా నుంచి కెనడావైపు మళ్లుతున్న భారతీయ టెక్ నిపుణుల వల్ల కెనడాకు ఎంతో ప్రయోజనం కలుగుతోంది. అమెరికాలోని హెచ్-1బీ వీసా రెన్యూవల్ చేసుకోవడం, శాశ్వత నివాసార్హత పొందడటం కష్టంగా మారుతుండటంతో అనేక మంది కెనడావైపు మొగ్గు చూపుతున్నారు..’’ అని టొరొంటోలోని ఇమ్మిగ్రేషన్ న్యాయవ్యవహారాల సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. విదేశీ ట్యాలెంట్‌ను ఆకర్షించేందుకు కెనడా కంపెనీలకు అక్కడి ప్రభుత్వం ఇతోధికంగా ప్రోత్సాహాన్ని అందిస్తోందని చెప్పారు. పెద్ద సంఖ్యలో విదేశీయులను తమ దేశానికి వలస వచ్చేలా ప్రోత్సహించేందుకు కెనడా ప్రభుత్వం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. దీంతో.. కెనడాలో చదువుకున్న విదేశీ విద్యార్థులకు అక్కడే స్థిరపడేందుకు అవకాశాలు మరింతగా మెరుగవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. 


2022- 2024 మధ్య ఏటా సగటున దాదాపు 4.5 లక్షల మందికి కెనడాలో శాశ్వత నివాసం కల్పించాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు వలసల విధానాన్ని రూపొందించింది. ఇక 2021లో ఏకంగా 4.05 లక్షల మంది విదేశీయులు కెనడాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు అనుమతి పొందారు. ఒకే సంవత్సరంలో ఇంతమందికి పర్మెనెంట్ రెసిడెన్సీ కోసం అనుమతివ్వడం కెనడా చరిత్రలో ఇదే తొలిసారి అని పరిశీలకులు చెబుతున్నారు.  అమెరికాలో సుదీర్ఘకాలం పాటు ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులు ఎంచుకునే పాపులర్ దారి హెచ్-1బీ వీసాలు. అయితే.. హెచ్-1బీ వీసాల సంఖ్య విషయంలో దేశాల వారీగా ఉన్న పరిమితి కారణంగా అనేక మందికి ఈ వీసా దొరకడం నానాటికీ కష్టంగా మారిపోతోందని చెబుతున్నారు. 2016 నుంచి 2019 మధ్య కాలంలో అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ఏడు శాతం మేర పడిపోయిందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ(ఎన్ఎప్ఏపీ) సంస్థ రూపొందించిన నివేదిక తేల్చింది. 

Updated Date - 2022-03-19T23:21:26+05:30 IST