Canada Visa: కెనడా వెళదామనుకున్న భారతీయులకు వరుస షాకులు..!

ABN , First Publish Date - 2022-07-25T00:13:31+05:30 IST

ఎందరో భారతీయ విద్యార్థులు తమ కెనడా వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో ఏం చేయాలో తెలీక అయోమయ స్థితిలో కూరుకుపోతున్నారు. కరోనా సంక్షోభం తరువాత.. కెనడాలో విద్యార్థి వీసా దరఖాస్తు తిరస్కరణ రేటు ఏకంగా 40 నుంచి 50 శాతం మేర పెరిగిందని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు చెప్పారు.

Canada Visa: కెనడా వెళదామనుకున్న భారతీయులకు వరుస షాకులు..!

ఎన్నారై డెస్క్: రాధిక మెరిట్ స్టూడెంట్. IELTS‌లో ఆమెది 6.5 బ్యాండ్ స్కోర్. పైచదువులకు కెనడా వెళ్లాలనేది ఆమె కల. తనకు వీసా ఖచ్చితంగా మంజూరవుతుందని రాధిక భావించింది. కానీ.. తన దరఖాస్తు తిరస్కరణకు గురైందని ఇటీవల తెలియడంతో ఆమె ఒక్కసారిగా షాకైపోయింది. ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురి కావడం ఇది రెండోసారి! మొదటిసారి వీసా రాకపోయినా ఆమె పెద్దగా నిరాశ చెందలేదు కానీ.. రెండోసారీ నిరాశే ఎదురవడంతో ఆమె ఇండియాలోనే చదువు కొనసాగించేందుకు నిర్ణయించుకుంది. ‘‘మంచి అకాడమిక్ ప్రొఫైల్ ఉన్నా నాకు వీసా రాలేదు. ఇప్పుడు ఇండియాలోనే పైచదువులు చదవాలనుకుంటున్నా. కెనడా కాలేజీకి చెల్లించిన 17 వేల డాలర్ల తిరిగిచ్చేయమంటూ వారికి దరఖాస్తు చేసుకున్నా’’ అని ఆమె చెప్పింది. 


అయితే..ఇది రాధిక ఒక్కరి సమస్య మాత్రమే కాదు. ఎందరో భారతీయ విద్యార్థులు తమ కెనడా వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో ఏం చేయాలో తెలీక అయోమయ స్థితిలో కూరుకుపోతున్నారు. కరోనా సంక్షోభం తరువాత.. కెనడాలో(Canada) విద్యార్థి వీసా దరఖాస్తు తిరస్కరణ(Rejection) రేటు ఏకంగా 40 నుంచి 50 శాతం మేర పెరిగిందని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు చెప్పారు. కొవిడ్‌కు పూర్వం ఇది 15 నుంచి 20 శాతం మధ్య ఉండేదని తెలిపారు. ‘‘వీసా(student Visa) తిరస్కరణ రేటు ఇటీవల ఏకంగా రెండింతలైంది. చదువులో మంచి ట్రాక్ రికార్డు ఉన్న విద్యార్థులకూ వీసాలు రావడం లేదు’’ అని ఓ కన్సల్టెంట్ వ్యాఖ్యానించారు. ఆయా రంగాల్లోని గోల్డ్ మెడలిస్టులు, టాపర్లకు కూడా వీసాలు రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే.. దీనిపై కెనడా ప్రభుత్వం ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు. 


మరోవైపు.. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న వీసా దరఖాస్తుల సంఖ్య పెరిగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. కరోనా సంక్షోభంలో రెండేళ్ల పాటు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లో ఆంక్షలు అమలవడంతో అనేక మంది కెనడా వైపు మళ్లడం ప్రారంభించారని వారు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పెద్ద సంఖ్యలో వీసా అప్లికేషన్లు తిరస్కరణకు గురవుతుండడంతో విద్యార్థుల్లోనూ ఒత్తిడి పెరుగుతోంది. విద్యార్థి వీసా మంజూరు అయ్యేందుకు ఒక్కోసారి 12 నెలలు పడుతోందని కొందరు కన్సల్టెంట్లు చెబుతున్నారు. 

Updated Date - 2022-07-25T00:13:31+05:30 IST