NRI భార్య నిర్వాకం.. భర్తతో రూ.18లక్షలు ఖర్చు చేయించి.. ఎయిర్‌పోర్టులోనే వదిలివెళ్లిన వైనం..!

ABN , First Publish Date - 2022-04-14T17:13:07+05:30 IST

భార్యను భారీ మొత్తం వెచ్చించి కెనడా పంపించిన భర్తకు పరాభవం ఎదురైంది.

NRI భార్య నిర్వాకం.. భర్తతో రూ.18లక్షలు ఖర్చు చేయించి.. ఎయిర్‌పోర్టులోనే వదిలివెళ్లిన వైనం..!

ఎన్నారై డెస్క్: భార్యను భారీ మొత్తం వెచ్చించి కెనడా పంపించిన భర్తకు పరాభవం ఎదురైంది. భర్త డబ్బులతో ఎంచక్క కెనడా వెళ్లిన భార్య.. ఆ తర్వాత తన అసలు రూపం చూపించింది. భర్తను కెనడా ఎయిర్‌పోర్టులోనే వదిలేసి తన దారి తాను చూసుకుంది. ఎలాగోలా అక్కడి నుంచి స్వదేశానికి చేరుకున్న భర్త మొగ పోలీసులకు భార్యపై ఫిర్యాదు చేశాడు. తనను రూ.18.50లక్షలు భార్య మోసం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ రాష్ట్రం మొగ జిల్లా పరిధిలోని ఖొసా కొట్లాకు చెందిన ఎన్నారై రజ్వీందర్ కౌర్ తూర్‌కు రౌలి గ్రామానికి చెందిన హర్దీప్ సింగ్‌తో వివాహమైంది. పెళ్లి తర్వాత భార్యను ఉన్నత చదువుల కోసం హర్దీప్ స్టడీ వీసాపై కెనడా పంపించాడు. ఆ సమయంలో అతడు ఏకంగా రూ.18.50 లక్షలు ఖర్చు చేశాడు.


కెనడా వెళ్లి సెటిల్ అయిన తర్వాత హర్దీప్‌ను తీసుకువెళ్తానని రజ్వీందర్ ప్రామిస్ చేసింది. అన్నట్టుగానే కొన్నాళ్లకు ఆమె నుంచి హర్దీప్‌కు కెనడా రావాల్సిందిగా పిలుపు వచ్చింది. దాంతో హర్దీప్ ఎంతో ఆనందంగా కెనడా చేరుకున్నాడు. భర్తను రిసీవ్ చేసుకోవడానికి విమానాశ్రయానికి వచ్చిన రజ్వీందర్.. అక్కడ తన అసలు రూపం బయటపెట్టింది. ఇంకో రూ.8లక్షలు ఇస్తే గానీ ఇంటికి తీసుకెళ్లనని మొండికేసింది. ఆమె మాటలు విన్న హర్దీప్‌కు ఏం చేయాలో తోచలేదు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో భర్తను నిర్దాక్షన్యంగా విమానాశ్రయంలోనే వదిలేసి వెళ్లిపోయింది. రజ్వీందర్ చర్యతో నిర్ఘాంతపోయిన హర్దీప్.. కొంత సమయానికి తెరుకుని చివరకు ఎలాగోలా స్వదేశానికి వచ్చేశాడు. అనంతరం తనను భార్య మోసం చేసిందంటూ మొగ పోలీసులను ఆశ్రయించాడు. తనతో రూ.18.50లక్షలు ఖర్చు చేయించి కెనడా వెళ్లిన భార్య.. ఇప్పుడు తనను నడిరోడ్డున వదిలేసిందని పోలీసుల వద్ద తన గోడును వెళ్లబోసుకున్నాడు. దాంతో పోలీసులు రజ్వీందర్ కౌర్‌తో పాటు ఆమె తండ్రి గురుప్రీత్ సింగ్, తల్లి హర్ ప్రకాశ్ కౌర్‌లపై సెక్షన్ 420, 120బీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Updated Date - 2022-04-14T17:13:07+05:30 IST