రైతుగోడు

ABN , First Publish Date - 2022-08-19T06:05:03+05:30 IST

వైసీపీ పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. కాల్వల పూడిక తీత పనులు చేపట్టకపోవడం, పూర్తి స్థాయిలో నీటిని కాల్వలకు విడుదల చేయకపోవడంతో దివి ప్రాంతంలోని శివారు భూముల్లోని ఆకుమడులకు నేటికీ నీరందడం లేదు.

రైతుగోడు
జరుగువానిపాలెం..

కాల్వల పూడికతీతలో ప్రభుత్వ నిర్లక్ష్యం

దివిసీమ దిగువ భూములకు అందని సాగునీరు

 నెర్రలిచ్చి ఎండిపోతున్న నారుమళ్లు

మందపాకల 2, 3, 4, 5 నెంబర్ల కాల్వల్లో 

చుక్కనీరు లేని దుస్థితి

తక్షణం సాగునీరందించాలని రైతుల వేడుకోలు 

కోడూరు : వైసీపీ పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. కాల్వల పూడిక తీత పనులు చేపట్టకపోవడం, పూర్తి స్థాయిలో నీటిని కాల్వలకు విడుదల చేయకపోవడంతో దివి ప్రాంతంలోని శివారు భూముల్లోని ఆకుమడులకు  నేటికీ నీరందడం లేదు.  అరకొరగా కాల్వలకు వదిలిన నీరు దిగువక చేరకపోవడానికి కారణం ప్రభుత్వ అసమర్థతే అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని సాగు భూములకు సాగు నీరందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, ఇరిగేషన్‌ అధికారులు, పాలకులు రైతుల సమస్యలపై చొరవ చూపడం లేదని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సాగునీరు అందక నారుమళ్లు ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు. నాగాయలంక నుంచి వచ్చే మందపాకల చానల్‌ కింద సుమారు 500 ఎకరాల సాగుకు పోసిన నారుమళ్లకు నీరందడం లేదని రైతులు తెలిపారు.  మందపాకల, పాదాలవారిపాలెం, జరుగువానిపాలెం గ్రామాల్లో 2, 3, 4, 5 కాల్వల కింద నారుమళ్లు నెర్రలిచ్చి నారు ఎండిపోతోందని వాపోయారు.  కనీసం ఇంజన్లతో అయినా తోడుకుందామంటే పంట కాల్వలో చుక్క నీరు లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క వరద వచ్చి లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నప్పటికీ, దిగువ ప్రాంత భూములకు అధికారులు నీరు అందించకపోవటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఇరిగేషన్‌ అధికారులు స్పందించి దిగువ ప్రాంత భూములకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. 

 ఇంజన్లతో తోడేస్తున్నారు!

లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నా దిగువ ప్రాంత రైతులకు సాగునీరు అందకపోవటం బాధాకరం. ఎగువ ప్రాంతంలో   రైతులు ఇంజన్లతో ఎక్కువగా నీరు తోడేయడంతోనే  దిగువకు సాగునీరు రావడం లేదు.  నీరు లేక నారుమడులు ఎండిపోతున్నాయి.

-అప్పికట్ల రవీంద్ర, జరుగువానిపాలెం

రెండురోజుల్లో పరిష్కరిస్తాం

మందపాకల కెనాల్‌ కింద ఎగువ ప్రాంతంలో రైతులందరూ ఒకేసారి నాట్లు వేస్తూ అధిక మొత్తంలో ఇంజన్లతో నీరు తోడేస్తున్నారు. అయినప్పటికీ బుధవారం రాత్రి 2, 3 నెంబర్ల కాల్వల కింద ఎగువున ఇంజన్లు కట్టివేయించి నీరు అం దించాం. 4, 5 నెంబర్ల కాల్వల కింద కూడా నీరు అందిస్తాం. రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో నీటి సమస్య పరిష్కరిస్తాం.

- రవితేజ, ఇరిగేషన్‌ ఏఈ



Updated Date - 2022-08-19T06:05:03+05:30 IST