డేటా ఎంట్రీ ఆపరేటర్ల పరీక్ష రద్దు!

ABN , First Publish Date - 2021-03-07T05:20:39+05:30 IST

‘ఆరోగ్యశ్రీ ట్రస్టుకేర్‌’కు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ల పరీక్ష రద్దయింది. పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు కలెక్టరేట్‌ వద్ద శనివారం ఆందోళన చేశారు. ఉద్యోగ ప్రకటనలో చూపిన అర్హత... రాతపరక్షకు వచ్చేసరికి మార్పు చేసేశారని వాపోయారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, ఈ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్ల పరీక్ష రద్దు!
ఆందోళన చేస్తున్న అభ్యర్థులు

‘ఆరోగ్యశ్రీ ట్రస్టు కేర్‌’ పోస్టుల భర్తీలో అవకతవకలు
పరీక్ష నిర్వహణపై కొందరికే సమాచారం
కలెక్టరేట్‌ వద్ద బాధితుల ఆందోళన
కలెక్టర్‌కు ఫిర్యాదుతో నిలిచిన ప్రక్రియ
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మార్చి 6 :

‘ఆరోగ్యశ్రీ ట్రస్టుకేర్‌’కు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ల పరీక్ష రద్దయింది. పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు కలెక్టరేట్‌ వద్ద శనివారం ఆందోళన చేశారు. ఉద్యోగ ప్రకటనలో చూపిన అర్హత... రాతపరక్షకు వచ్చేసరికి మార్పు చేసేశారని వాపోయారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, ఈ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టులో జిల్లాలోని మూడు డేటాఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల భర్తీ కోసం ఇటీవల ప్రకటన వెలువడింది. ఏదైనా డిగ్రీతో కంప్యూటర్స్‌, పీజీడీసీఏ పూర్తిచేసిన వాళ్లు ఈ పోస్టులకు అర్హులని అందులో ప్రకటించారు. గత అనుభవం, టైపింగ్‌ తదితర వాటిని కూడా దరఖాస్తులో నమోదు చేయాలని సూచించారు. మూడు పోస్టులకుగానూ మొత్తం 270 మంది దరఖాస్తు చేసుకున్నారు.  అయితే నిబంధనలకు విరుద్ధంగా శనివారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ కేంద్రంలో కేవలం పది మందితో పరీక్ష నిర్వహించేశారు. వారికి కంప్యూటర్‌ అర్హత లేకున్నా డిగ్రీ ప్రాతిపదికన పరీక్షకు అనుమతిచ్చారు. మిగిలిన అభ్యర్థులకు కనీసం పరీక్ష విషయమై సమాచారం ఇవ్వలేదు. దీంతో వారంతా శనివారం కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు. కనీసం మెరిట్‌ లిస్టు తెలియకుండా... ఇటు అర్హతలు పాటించకుండా పది మందినే ఎంపికచేసి పరీక్ష నిర్వహించడంపై  ఆందోళనకు దిగారు. అర్హులైన తమను పక్కన పెట్టేసి.. అనర్హులకు ప్రాధాన్యమిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌ నివాస్‌కు వినతిపత్రం అందజేశారు. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై దర్యాప్తు చేయాలని కలెక్టర్‌ నివాస్‌ జేసీ శ్రీనివాసులకు ఆదేశించారు. ఈ మేరకు మెరిట్‌ జాబితా పరిశీలించగా.. అవకతవకలు జరిగినట్టు నిర్ధారించారు. దీంతో శనివారం నిర్వహించిన డేటా ఎంట్రీ ఆపరేటర్ల పరీక్ష రద్దు చేసినట్లు జేసీ వెల్లడించారు. మెరిట్‌ జాబితా తయారీలో అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2021-03-07T05:20:39+05:30 IST