నాపై అనుబంధ చార్జిషీట్‌ను రద్దుచేయండి

ABN , First Publish Date - 2021-03-06T08:32:17+05:30 IST

ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో తనపై నిరాధారంగా అభియోగాలు మోపారని ఈ కేసులో ఆరో ముద్దాయిగా ఉన్న ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి పేర్కొన్నారు.

నాపై అనుబంధ చార్జిషీట్‌ను రద్దుచేయండి

ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మి వినతి

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో తనపై నిరాధారంగా అభియోగాలు మోపారని ఈ కేసులో ఆరో ముద్దాయిగా ఉన్న ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు అధికారులు 2012 మార్చి 30న సీబీఐ కోర్టులో దాఖలు చేసిన మొదటి అనుబంధ చార్జిషీటు/పోలీసు రిపోర్టు/చలాన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ వేశారు. ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ 2015 ఫిబ్రవరి 10న దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ కోర్టు ముందు పెండింగ్‌లో ఉంది. ఇదే వ్యాజ్యంలో ఆమె తాజాగా అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పట్లో కొన్ని దస్ర్తాలు కోర్టుకు సమర్పించలేదని.. వాటిని ఇప్పుడు జతపరుస్తున్నానని.. విచారణకు స్వీకరించాలని, ఈ మేరకు పూర్వ పిటిషన్‌లో చేసిన అభ్యర్థనను సవరించాలని అభ్యర్థించారు. ఆమె ఈ కేసులో 9నెలలకు పైగా జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. అనారోగ్య కారణాలతో 2013 ఏప్రిల్‌ 1న బెయిల్‌పై బయటకు వచ్చారు. తనపై మోపిన అభియోగాల్లో ఒక్క దానిలోనైనా సీబీఐ తగిన ఆధారాలు చూపలేకపోయిందని, నిరాధారంగా తనను ఈ కేసులో పావుగా చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను మైనింగ్‌ చట్టాలను ఉల్లంఘించలేదని, బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం విధులు నిర్వహించానని చెప్పారు.

Updated Date - 2021-03-06T08:32:17+05:30 IST