28 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2022-06-18T08:36:05+05:30 IST

అగ్నిపథ్‌పై ఆగ్రహ జ్వాలలతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తలెత్తిన హింసాత్మక ఘటనలు.. పలు రైళ్ల..

28 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దు

70 ఎంఎంటీఎస్‌ రైళ్లు కూడా..

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): అగ్నిపథ్‌పై ఆగ్రహ జ్వాలలతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తలెత్తిన హింసాత్మక ఘటనలు.. పలు రైళ్ల రద్దుకు దారి తీశాయి. ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఆందోళనల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే శుక్రవారం పలు రైళ్లను అకస్మాత్తుగా రద్దు చేసింది. 28 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 70 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. ఎనిమిది రైళ్లను దారి మళ్లించగా మరో 18 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా సికింద్రాబాద్‌ మీదుగా వివిధ దూర ప్రాంతాలకు వెళ్లే కొన్ని రైళ్లను పాక్షికంగా, మరి కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డెక్కన్‌ (నాంపల్లి) రైల్వేస్టేషన్‌ను మూసివేశారు. రైళ్లను అకస్మాత్తుగా రద్దు చేయడంతో ముందస్తుగా ప్రయాణాలు ప్లాన్‌ చేసుకున్న వారు ఇబ్బందులు పడ్డారు. రాకపోకలు పున:ప్రారంభమవుతాయో.. లేదో చెప్పే పరిస్థితి లేకపోవడంతో రిజర్వేషన్‌ చేయించుకున్నవారు అయోమయానికి గురయ్యారు.


చిన్న పిల్లల తల్లిదండ్రులు, వయోధికులకు మరిన్ని ఇక్కట్లు ఎదురయ్యాయి. అలాగే, రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, లింగంపల్లి రైల్వేస్టేషన్లతోపాటు శివారు ప్రాంతాల్లోని మేడ్చల్‌, ఫలక్‌నుమా, ఘట్‌కేసర్‌, ఉదానగర్‌, మౌలాలి, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా సికింద్రాబాద్‌ వైపు వెళ్లే  రేపల్లె ప్యాసింజర్‌ను నల్లగొండ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. భువనగిరి మార్గంలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన రైళ్లను చర్లపల్లి, మౌలాలి స్టేషన్ల వరకే నడిపించారు. సిర్పుర్‌ కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాల్సిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ రైలును భువనగిరి రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. దీంతో సుమారు 1400 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ-సికింద్రాబాద్‌ మధ్యలో ప్రయాణించే శాతవాహన ఎక్స్‌ప్రె్‌సను ఘట్‌కేసర్‌లో, గుంటూరు-వికారాబాద్‌ మధ్యలో నడిచే పల్నాడు ఎక్స్‌ప్రె్‌సను చర్లపల్లి స్టేషన్‌లో నిలిపివేశారు.


సికింద్రాబాద్‌ నుంచి బల్లార్ష వెళ్లే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌, హౌరా ఎక్స్‌ప్రె్‌సను మౌలాలి స్టేషన్‌లో నిలిపివేశారు. దీంతో ఈ రైళ్లలోని ప్రయాణికులు వారి గమ్యస్థానాలను చేరుకునేందుకు నానా తంటాలు పడ్డారు. జిల్లాలోని రైల్వేస్టేషన్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైళ్ల రాకపోకలకు సంబంధించిన సమాచారం కోసం దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 04027786666 అందుబాటులో ఉంచింది. 


కిక్కిరిసిన బస్టాండ్‌లు..

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైళ్ల రద్దుతో ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సాధారణ రోజులతో పోల్చితే రెట్టింపు స్థాయిలో ప్రయాణికులు బస్టాండ్లకు తరలివచ్చారు. దీంతో ఆర్టీసీ అధికారులు చాలా రూట్లలో అదనపు బస్సులను నడిపారు. ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లే రహదారులను పోలీసులు మూసేయడంతో స్టేషన్‌తోపాటు రేతిఫైల్‌ బస్టాండ్‌లో ఆర్టీసీ సేవలు శుక్రవారం రాత్రి వరకు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ రూట్లలో బస్సులు నడిపారు. అయితే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రసూల్‌పురాకు వెళ్లే ప్రయాణికులు క్లాక్‌ టవర్‌ వరకు నడుచుకుంటూ వెళ్లాల్సిరావడంతో నానా అవస్థలు పడ్డారు. 

Updated Date - 2022-06-18T08:36:05+05:30 IST