రాయితీ రద్దు

ABN , First Publish Date - 2021-07-30T06:01:49+05:30 IST

పంట దిగుబడులు పెరగడానికి సూక్ష్మ పోషకాలు అత్యవసరం. గత ప్రభుత్వం రైతులకు సూక్ష్మపోషకాలను ఉచితంగా అందించేది.

రాయితీ రద్దు

  1. సూక్ష్మ పోషకాలపై సబ్సిడీ ఎత్తివేత
  2. గత ఏడాది 50 శాతం.. ఇప్పుడు అదీ లేదు
  3. ఎకరా సాగుకు అదనంగా రూ.2 వేలు ఖర్చు 
  4. రైతు పథకాలన్నిటికీ సున్నా చుడుతున్న ప్రభుత్వం


కర్నూలు-ఆంధ్రజ్యోతి: పంట దిగుబడులు పెరగడానికి సూక్ష్మ పోషకాలు అత్యవసరం. గత ప్రభుత్వం రైతులకు సూక్ష్మపోషకాలను ఉచితంగా అందించేది. 2019లో వైసీపీ ప్రభుత్వం సూక్ష్మ పోషకాలను ఉచితంగా ఇవ్వలేనని తేల్చి చెప్పింది. 50 శాతం రాయితీకి ఇచ్చేది. క్రమంగా ఈ రాయితీని తగ్గిస్తూ ఇప్పుడు ఏకంగా ఎత్తేసింది. ఈ ఏడాది అదీ ఎత్తేసి రైతులు ముందుగా పూర్తి డబ్బులు చెల్లిస్తేనే సూక్ష్మ పోషకాలను ఆర్బీకేల ద్వారా అందిస్తామని తేల్చేసింది. తమది అన్నదాతల ప్రభుత్వమని చెప్పుకుంటూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జగన్‌మోహన్‌రెడ్డికే చెల్లని రైతులు మండిపడుతున్నారు.

 

ఒక్కో పథకానికి మంగళం


రైతు రాయితీ పథకాలను ఒక్కోదాన్ని నెమ్మదిగా ప్రభుత్వం ఎత్తేస్తోంది. ఆ జాబితాలోకి ఇపుడు సూక్ష్మ పోషకాల పథకం కూడా వచ్చి చేరింది. సూక్ష్మ పోషకాలు భూమికి ఎంత మేలు చేస్తాయి. దిగుబడి పెంచుతాయి. రసాయన ఎరువులు వాడటం కన్నా ఏటా సాగుకు ముందు భూసార పరీక్షలు చేసి, ఏ నేలకు ఎలాంటి పోషకాలు అందిస్తే పంట దిగుబడి బాగా వస్తుందో గుర్తించి, వాటిని రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం ఈ పథకం ఉద్దేశం. వ్యవసాయం లాభసాటి కావడానికి, భూసారాన్ని పరిరక్షించడానికి సూక్ష్మ పోషకాలు చాలా ముఖ్యం. రెండేళ్ల కిందట దాకా ఈ పథకం సజావుగా జరిగింది. దాని వల్ల దిగుబడులు బాగా పెరిగాయి. వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఎత్తేసింది. 


2014 నుంచి 2019 వరకు నిర్విరామంగా..


2014 నుంచి 2019 వరకు సాయిల్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కార్డులను రైతులకు ఇచ్చేవారు. జిల్లాలో దాదాపు 40-50 వేల మంది రైతులకు ఈ కార్డులు ఇచ్చారు. జింకు, జిప్సం, బోరాన్‌ వంటి పోషకాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం అందించింది. దీని వల్ల రైతులకు వ్యవసాయ దిగుబడుల పట్ల భరోసా ఉండేది. 


 రైతులపై అదనపు భారం


బహిరంగ మార్కెట్‌లో పది కేజీల జింకు రూ.550. జిప్సం 50 కేజీల సంచి రూ.1,150. బోరాన్‌ కిలో రూ.500. కంపెనీలను బట్టి ఈ ధరల్లో  వ్యత్యాసం ఉంటుంది.  ఇప్పుడు ప్రభుత్వం డబ్బు కడితేనే ఇవి ఇస్తామనడం వల్ల ఎకరాకు రూ.2,000 వరకు రైతులకు అదనపు భారం పడుతుంది. అదీ రైతులు సమీప ఆర్‌బీకేల్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ చెబుతోంది.


భూసార పరీక్షలూ అంతంత మాత్రమే!


రెండేళ్ల క్రితం వరకూ విధిగా భూసార పరీక్షలు చేసేవారు.  సాయిల్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కార్డులను అధికారులు రైతులకు ఇచ్చేవారు. సూక్ష్మ పోషకాలను ఉచితంగా ఇచ్చే పథకాన్ని ఎత్తేయడం వల్ల  భూసార పరీక్షలు కూడా చిత్తశుద్ధిగా చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ భూముల్లో పోషక లోపం తెలియజేసే యంత్రాంగం కూడా కరువైందని రైతులు అంటున్నారు. మట్టి నమూనాలు తీసికెళితే ఆర్‌బీకేల్లో పరీక్షలు చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారేగాని క్షేత్రస్థాయిలో అమలవుతున్న దాఖలాలు లేవు.


సూక్ష్మసేద్యం పథకం అమలు చేస్తామంటూ ప్రభుత్వం రెండు వారాల క్రితం ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ వాటికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. మార్గదర్శకాలు ఇవ్వకుండా ప్రకటన మాత్రమే విడుదల చేయడం తమకు ఒరిగేదేమీ లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


 పంటల దిగుబడిపై ప్రభావం


భూమిలో పోషకాల లోపం తెలియకుండా వ్యవసాయం చేయడం వల్ల పంటల దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. మొక్కలు ఆరోగ్యంగా ఎదగడానికి జింకు ఎంతగానో తోడ్పడుతుంది. జిప్సంలో కాల్షియం, గంధకం మిశ్రమాలు ఉండడం వల్ల అది భూముల్లో సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది. బోరాన్‌ పూతదశలో కీలకంగా పనిచేస్తుంది. ఇబ్బడిముబ్బడిగా రసాయన ఎరువుల వాడకం వల్ల   సారాన్ని కోల్పోతున్న భూములు సూక్ష్మపోషకాల వల్ల తిరిగి సారవంతమవుతాయి. అలాంటి సూక్ష్మ పోషకాలపై పూర్తిగా రాయితీ ఎత్తేయడం రైతు ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు. రాయితీ రద్దుపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని జిల్లా రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

Updated Date - 2021-07-30T06:01:49+05:30 IST