కేన్సర్‌ అంటువ్యాధా? వంశపారంపర్యమా?

Jan 19 2021 @ 15:16PM

ఆప్తులు కేన్సర్‌ సోకినా, ఆ వ్యాధితో మరణించినా మనలో ఎన్నో సందేహాలు మొదలవుతాయి. కేన్సర్‌ ఎలా సోకి ఉండవచ్చనే ఆలోచన మొదలు, చికిత్సలో లోపం జరిగి ఉంటుందేమోననే అనుమానాల వరకూ ఎన్నో ఆలోచనలు మొదలవుతాయి. రక్తసంబంధీకుల నుంచి కేన్సర్‌ సోకి ఉంటుందా? చేస్తున్న వృత్తి కేన్సర్‌ను కలిగించి ఉంటుందా? ఆహారం ఇందుకు కారణమై ఉంటుందా? ఇలా కేన్సర్‌ సోకడానికి గల కారణాల కోసం ఆలోచనల అన్వేషణ మొదలుపెడతాం. కేన్సర్‌ చుట్టూ ఎన్నో సందేహాలు, అనుమానాలు, భయాలు, అయోమయాలు చోటుచేసుకుంటాయి. 


కారణం చెప్పలేం!

కేన్సర్‌కు కచ్చితమైన కారణం చెప్పడం కష్టం. జీన్స్‌, పర్యావరణ పరిస్థితులు, దురలవాట్లు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, వయసు పైబడడం, శరీరంలో సహజసిద్ధ హార్మోన్లు దీర్ఘకాలం పాటు ఉత్పత్తి జరుగుతూ ఉండడం, కృత్రిమ హార్మోన్లు, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, రబ్బరు, యాస్‌బెస్టాస్‌ వంటి కంపెనీలలో పని చేయడం, రేడియేషన్‌కు గురికావడం... ఈ కారణాలలో ఒకటి లేదా రెండు తోడైతే కేన్సర్‌ రావచ్చు. ఈ కారణాలేవీ లేకపోయినా కేన్సర్‌ వచ్చే వీలూ ఉంది. కాబట్టి కారణాలను తెలుసుకుని బాధపడే కంటే ఈ వ్యాధి పట్ల అవగాహన ఏర్పరుచుకోవడం ఎంతో అవసరం. ఈ వ్యాధిని తుదముట్టించాలంటే ప్రారంభ దశలోనే గుర్తించాలి. అంటే కేన్సర్‌ కణితి 1 సెంటీమీటరు కంటే చిన్నదిగా ఉండి, ఉన్న ప్రాంతానికే పరిమితమై, శరీరంలో ఏ ఇతర భాగానికీ ఆ కణాలు వ్యాప్తి చెందని దశ అది. 


వంశపారంపర్యమా?

రక్తసంబంధీకులు ఒకరిద్దర్లో రొమ్ము కేన్సర్‌ బయల్పడితే, వారి కుటుంబాల్లో ఆ జన్యువు ఉండే ప్రమాదం ఎక్కువ. కేన్సర్‌ సోకే అవకాశాన్ని ముందుగానే కనిపెట్టాలంటే బి.ఆర్‌.సి.ఎ1, బి.ఆర్‌.సి.ఎ2 జీన్‌ మ్యుటేషన్‌ పరీక్షలు చేయాలి. ఈ పరీక్షల్లో పాజిటివ్‌ ఫలితం వస్తే రొమ్ము కేన్సర్‌ కణం శరీరంలో ఉన్నట్టుగా భావించాలి. కేన్సర్‌కు గురికాకముందే మాస్టెక్టమీతో రెండు రొమ్ములను తొలగించి, ప్లాస్టిక్‌ సర్జరీతో రొమ్ములను పునర్నిర్మించడం ఒక పద్ధతి. లేదా రొమ్ములను పరీక్షించుకుంటూ క్రమంతప్పక అలా్ట్రసౌండ్‌, మామోగ్రఫీ చేయిస్తూ, ఏ చిన్న గడ్డ కనిపించినా బయాప్సీ చేయించడం మరో పద్ధతి. 


అంటువ్యాధి కాకపోయినా....

కేన్సర్‌ అంటువ్యాధి కాదు. అయితే కేన్సర్‌ను కలగజేసే వైర్‌సలు ఒకరి నుంచి మరొకరికి సోకడం ద్వారా కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. లైంగిక సంపర్కం లేదా రక్తమార్పిడి ద్వారా ఈ వైర్‌సలు ఒకరి నుంచి మరొకరికి సోకుతాయి. హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌.పి.వి), హెపటైటిస్‌ బి, సి, హెచ్‌.ఐ.వి వైర్‌సలు ఈ కోవకు చెందినవి. హెచ్‌.పి.విలో కొన్ని రకాలు గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు ప్రధాన కారణం. హెపటైటిస్‌ బి, సిలతో కాలేయం మొదట సిర్రోసి్‌సకు, తర్వాత కేన్సర్‌కూ గురవుతుంది.


డాక్టర్‌ సిహెచ్‌.మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌.ఫోన్‌: 9848011421


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.