ఆరోగ్య సమస్యల రూపంలో కేన్సర్స్‌!

Jun 29 2021 @ 11:54AM

ఆంధ్రజ్యోతి(29-06-2021)

నిరక్షరాస్యత, గ్రామీణ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, అమాయకత్వం ఆరోగ్య సమస్యలను తీవ్రమైన దశకు తీసుకువెళ్లడానికి ప్రధాన కారణం. అలాగే సొంత వైద్యాలు, నొప్పి తగ్గించే మందులు, యాంటీబయాటిక్స్‌, ఇంటర్నెట్‌ నాలెడ్జ్‌లతో ఆరోగ్య సమస్యలు తాత్కాలికంగా తగ్గినట్టు అనిపించినా దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని తిరిగి సరిదిద్దలేనంతగా దెబ్బతీస్తాయి. 


అలాగే వేడి చేసిందనీ, అలసటకు గురయ్యామని, పాత దెబ్బల ప్రభావమనీ కొన్ని ఆరోగ్య సమస్యలకు తమకు తామే సర్దిచెప్పుకునే తత్వం కూడా కేన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులు తీవ్రమయ్యే అవకాశాలను పెంపు చేస్తాయి. కేన్సర్‌ వ్యాధి నయమయ్యే అవకాశాలు  ఆ వ్యాధిని గుర్తించిన దశ, తీవ్రతల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలను కచ్చితంగా కనిపెట్టి, అందుకు తగిన వైద్యం ఎంచుకోవడం ఎంతో అవసరం. 


తలనొప్పి: తలనొప్పికి వేర్వేరు కారణాలు ఉంటాయి. చీకాకు, అలసట, పనుల ఒత్తిడి, ఎండ, కొన్ని రకాల వాసనలు, ఆకలి వంటి కారణాలుతో లేదా మెగ్రేన్‌ వల్ల తలనొప్పి రావచ్చు. అయితే తరచుగా వేధించే తలనొప్పి కోసం పెయిన్‌ కిల్లర్స్‌ మీద ఆధారపడడం సరి కాదు. ఈ మందులు కాలేయం, మూత్రపిండాల మీద ప్రభావం చూపిస్తాయి. మైగ్రేన్‌ అయితే నిర్దిష్టకాలం పాటు సరైన మందులు వాడుకోవాలి. ఉదయం లేచిన వెంటనే తల భారం, తీవ్రమైన నొప్పి, వేగంగా వచ్చే వాంతులు, వికారం లాంటి లక్షణాలు బ్రెయిన్‌ ట్యూమర్లకు సంకేతాలు కావచ్చు.


గొంతు నొప్పి: చల్లని పదార్థాలు, వాతావరణం, కొత్త ప్రదేశం, తాగేనీరు మారడం లాంటి వాటి వల్ల గొంతు బొంగురుపోవడం, నొప్పితో బాధ పడేవారు ఉంటారు. రెండు నుంచి మూడు రోజుల్లో మందులు వాడినా తగ్గకపోతే పరీక్షలు చేయించకోవడం అవసరం. థైరాయిడ్‌ కేన్సర్‌, గొంతు సంబంధిత కేన్సర్‌, లంగ్‌ కేన్సర్‌ లక్షణాలు ఈ విధంగానే ఉంటాయి.


దగ్గు, ఆయాసం: సిగరెట్లు తాగేవారిలో పై లక్షణాలు కనిపించడం సహజం అనుకుంటారు. వీరికి లంగ్‌ కేన్సర్లతో పాటు అనేక రకాల ఇతర కేన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువ. గొంతులో నస, ఆగని దగ్గు, కళ్లెలో రక్తం, ఆయాసం, టి.బి, లంగ్‌ కేన్సర్‌ లక్షణాలు కావచ్చు.


కడుపు ఉబ్బరం, మంట: నిద్రలేమి, క్రమం తప్పిన ఆహారవేళలు, ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలు. త్రేన్పులు, ఉబ్బరం, ఆకలి తగ్గడం, వికారం వంటి లక్షణాలు అందర్లో కనిపించేవే! అయితే వీటికి యాంటాసిడ్లు వాడడం వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే దక్కుతుంది. అయితే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తరచుగా వేధిస్తూ ఉంటే, ఎండోస్కోపీ, స్కానింగ్‌ పరీక్షలతో జీర్ణాశయ కేన్సర్‌, లివర్‌, పాంక్రియాస్‌, గాల్‌ బ్లాడర్‌ కేన్సర్లు కావని నిర్ధారించుకోవాలి.


మూత్రవ్యవస్థలో తేడాలు: మూత్రంలో రక్తం పడడం, ఆగి ఆగి రావడం, మంట వంటివి ఇన్‌ఫెక్షన్స్‌, కిడ్నీస్టోన్స్‌ లక్షణాలు కావచ్చు. లక్షణాలు తీవ్రంగా ఉండి, చికిత్సకు లొంగకపోతే యూరినరీ బ్లాడర్‌ సంబంధిత కేన్సర్‌ కావచ్చు. 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో ప్రోస్టేట్‌ గ్రంధి సమస్యలు, కేన్సర్‌ లక్షణాలు ఒకేలా ఉంటాయి. నెలసరి మధ్య రక్తస్రావం, పొట్ట భారంగా ఉండం, ఆకలి మందగించడం, స్త్రీలు నెలసరి ముందు పిఎమ్‌ఎస్‌ సమస్యలుగా పొరబడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఒవేరియన్‌, యుటిరైన్‌ కేన్సర్స్‌ కావచ్చు.


డాక్టర్‌ మోహన వంశీ, 

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌: 9848011421
Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.