ఎముకల్లో నొప్పి, తిమ్మిర్లు కేన్సర్‌ లక్షణాలే!

Dec 8 2020 @ 10:36AM

ఆంధ్రజ్యోతి(08-12-2020)

శరీరానికి ఆసరాను అందించే ఎముకలకూ కేన్సర్‌ రావచ్చు. ఎముకలకు వచ్చే క్షయ, కేన్సర్‌ లక్షణాలు ఒకేలా ఉండడంతో బోన్‌ కేన్సర్‌ను క్షయగా భ్రమ పడే ప్రమాదమూ ఉంటుంది. 


ఎముకల మీద కేన్సర్‌ గడ్డ ఏర్పడిన ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. కేన్సర్‌ గడ్డ వల్ల ఎముక నొప్పిగా ఉండడం, జ్వరం, రాత్రిపూట చమటలు, బరువు తగ్గడం, గడ్డ వచ్చిన ప్రదేశంలో ఎముక విరగడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. కేన్సర్‌ కాని గడ్డ గుండ్రంగా, నెమ్మదిగా పెరుగుతుంది. కేన్సర్‌ కణితి కచ్చితమైన ఆకారం లేకుండా, వేగంగా పెరుగుతుంది. కణితి పెద్దదిగా ఉన్నప్పుడు ఎక్స్‌రేలలో, చిన్నదిగా ఉన్నప్పుడు ఎమ్మారై, సిటిస్కాన్‌లలో కనిపిస్తుంది. అయితే కణితి ఏ కోవకు చెందినదనేది నిర్థారించుకోవడం కోసం బయాప్సీ చేస్తారు. 


ఎన్నో రకాలు

బోన్‌ కేన్సర్‌ గడ్డలలో ఆస్టియో సార్కోమా, ఈవింగ్స్‌ సార్కోమా కాండ్రో సార్కోమా, ఫైబ్రోసార్కోమా, కార్టోమా అనే రకాలుంటాయి. ఈ గడ్డలు వయసును బట్టి ఏర్పడతాయి. ఆస్టియో సార్కోమా, ఈవింగ్స్‌ సార్కోమా చిన్న వయస్కుల్లో వస్తే, కాండ్రో సార్కోమా మధ్య వయస్కుల్లో వస్తుంది. చాలావరకూ బోన్‌ కేన్సర్లు సెకండరీగానే ఉంటాయి. అంటే, శరీరంలో మిగతా భాగాల్లో వచ్చిన కేన్సర్‌ ఎముకలకు వ్యాప్తి చెందడం (మెటాస్టాసిస్‌) ఎక్కువగా చూస్తూ ఉంటాం. నేరుగా ఎముకలకే కేన్సర్‌ సోకడం కొంత అరుదు. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌ కేన్సర్లు ఎముకల మీద చిన్న గడ్డ రూపంలో బయల్పడవచ్చు.


చికిత్సలున్నాయి

అన్ని సర్జరీలలాగే సర్జరీ, రేడియో, కీమో థెరపీల ప్రాధాన్యత ఈ కేన్సర్‌కూ ఉంటుంది. కేన్సర్‌ గడ్డ వచ్చిన ప్రదేశాన్ని తీసేసినప్పుడు చిన్నగా ఉండే సిమెంటింగ్‌, గ్రాఫ్టింగ్‌ పద్ధతుల్లో సరిచేస్తారు. ఎముక తీయవలసిన ప్రదేశం ఎక్కువగా ఉంటే, బోన్‌ బ్యాంక్‌ నుంచి ఎముకలను తీసుకుని వేయడం, లేదా మెటల్‌ ఇంప్లాంట్స్‌ వాడడం జరుగుతుంది. కేన్సర్‌ కణితి పెద్దదిగా ఉంటే సర్జరీ కంటే ముందు కీమో, రేడియో థెరపీలతో కణితిని చిన్నదిగా చేసి, తర్వాత సర్జరీ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సర్జరీ తదనంతరం ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్‌ ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుంది. సెకండరీ బోన్‌ కేన్సర్‌ ఎక్కువ కాబట్టి మిగతా కేన్సర్లను ముందుగా గుర్తించి చికిత్స తీసుకోగలిగితే ఈ కేన్సర్‌నూ నివారించుకోగలుగుతాము. కేన్సర్‌ వచ్చిన ఎముకలను గట్టిపరచడానికి బిస్‌పాసొనేట్స్‌ ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రోస్టేట్‌ కేన్సర్‌, లంగ్‌ కేన్సర్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌లు మిగతా కేన్సర్ల కంటే ఎక్కువగా ఎముకలకు పాకే గుణం కలిగి ఉంటాయి. కేన్సర్‌ కణితి వల్ల నరాల మీద ఒత్తిడి ఏర్పడడం వల్ల కాళ్లలో, లేదా చేతుల్లో బలహీనత, తిమ్మిర్లు, తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.


డాక్టర్‌ సిహెచ్‌.మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌.ఫోన్‌: 9848011421

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.