ముందస్తుగా... ముందు జాగ్రత్తగా...ఇలా చేయండి!

ABN , First Publish Date - 2022-01-11T18:23:17+05:30 IST

కొన్ని రుగ్మతల మీద ఓ కన్నేసి ఉంచాలి. మరీ ముఖ్యంగా మహిళలకు కొన్ని ఆరోగ్య సమస్యలు వంశపారంపర్యంగా సంక్రమిస్తూ ఉంటాయి. అలాంటి వాటిని ముందస్తు పరీక్షలతో కనిపెట్టి, జాగ్రత్త పడడం అవసరం.

ముందస్తుగా... ముందు జాగ్రత్తగా...ఇలా చేయండి!

ఆంధ్రజ్యోతి(11-01-2021)

కొన్ని రుగ్మతల మీద ఓ కన్నేసి ఉంచాలి. మరీ ముఖ్యంగా మహిళలకు కొన్ని ఆరోగ్య సమస్యలు వంశపారంపర్యంగా సంక్రమిస్తూ ఉంటాయి. అలాంటి వాటిని ముందస్తు పరీక్షలతో కనిపెట్టి, జాగ్రత్త పడడం అవసరం.


కేన్సర్‌ను కనిపెట్టే జన్యు పరీక్ష

రొమ్ము, పెద్దపేగు, అండాశయ కేన్సర్లు జన్యుపరంగా సంక్రమిస్తాయి. బ్రాకా జన్యువు ఉన్నవారిలో ఈ కేన్సర్లు వచ్చే అవకాశాలు 50శాతం ఎక్కువ. అయితే ఈ జన్యువు కలిగిన మహిళల్లో 40 ఏళ్లకే కేన్సర్‌ బయట పడుతుంది. ఇలాంటి మహిళలు తప్పనిసరిగా బ్రాకా జన్యు పరీక్ష (రక్త పరీక్ష) చేయించుకోవాలి. పరీక్షలో ఈ జన్యువు ఉందని తేలితే, వారి కూతుళ్లు కూడా ఇదే పరీక్ష చేయించుకుని, తమలో ఆ జన్యువు లేదని నిర్థారించుకోవాలి. ఒకవేళ ఆ జన్యువు ఉందని పరీక్షల్లో తేలితే తొలి నెలసరి మొదలైనప్పటి నుంచీ పలు జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే... 


సెల్ఫ్‌ ఎగ్జామినేషన్‌: ప్రతి నెలా నెలసరి తర్వాత, రొమ్ములను స్వీయ పరీక్ష చేసుకోవాలి. ఇందుకోసం స్నానం చేసే సమయంలో సబ్బు చేతితో రొమ్ములను గుండ్రంగా తడిమి చూసుకుని, గడ్డలు లేవని నిర్థారించుకోవాలి.  


క్లినికల్‌ ఎగ్జామినేషన్‌: ప్రతి ఆరు నెలలకోసారి వైద్యుల చేత రొమ్ములను పరీక్ష చేయించుకోవాలి.  అలా్ట్రసౌండ్‌: రొమ్ములను స్కాన్‌ చేసే ఈ పరీక్ష ప్రతి ఆరు నెలలకోసారి, లేదా ఏడాదికోసారి చేయించుకోవాలి.  


మామోగ్రఫీ: 40 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత ఈ పరీక్ష చేయించుకోవాలి.


గుండె జబ్బులుడయాబెటిస్‌, ఒబేసిటీ, హైపర్‌టెన్షన్‌, హైపర్‌ ట్రైగ్లిజరిడీమియా (లిపిడ్స్‌ ఎక్కువగా ఉండడం), కొలస్ట్రాల్‌ ఎక్కువగా ఉండడం  మొదలైనవి జన్యుపరంగా సంక్రమించే హృద్రోగ కారకాలు. కాబట్టి వాటిని అదుపులో ఉంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవడంతో పాటు కొన్ని పరీక్షలు కూడా చేయించుకోవాలి. అవేంటంటే... 


రక్తపోటు: 25 ఏళ్ల వయసు నుంచీ ప్రతి ఏడాదీ రక్తపోటును పరీక్షించుకుంటూ ఉండాలి.  మధుమేహం: మెరుగైన జీవనశైలిని అనుసరించడంతో పాటు పాతికేళ్లు దాటిన ప్రతి మహిళా మధుమేహ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.  


బిఎమ్‌ఐ: అధిక బరువును ఈ పరీక్షతో కనిపెట్టవచ్చు. జీవనశైలి రుగ్మతలకు మూల కారణమైన అధిక బరువును అదుపులో ఉంచుకోగలిగితే, గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. 


ఆస్టియోపోరోసిస్‌

ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గుదల వల్ల ఎముకలు గుల్లబారే సమస్య మహిళల్లో అత్యంత సహజం. అయితే ఈ పరిస్థితి మెనోపాజ్‌కు చేరుకున్న మహిళలతో పాటు కేన్సర్‌ చికిత్స తీసుకునేవారిలో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎముకల సాంద్రతను కనిపెట్టే పరీక్షను ఆశ్రయించాలి.  


బోన్‌ డెన్సిటీ టెస్ట్‌: పాతికేళ్ల వరకూ చక్కని సాంద్రత కలిగి ఉండే ఎముకలు, ఆ తర్వాత నుంచీ క్రమేపీ పలుచనవడం మొదలుపెడతాయి. సాధారణంగా మహిళల్లో 55 ఏళ్ల వయసు నుంచీ ఎముకలు గుల్లబారే వేగం పెరుగుతుంది. అంతకంటే ముందే మెనోపాజ్‌కు చేరుకున్న మహిళల్లో ఈ నష్టం మరింత ఎక్కువ. కాబట్టి లక్షణాలు బయల్పడిన వెంటనే వైద్యులను సంప్రతించి ఎముకల సాంద్రత కనిపెట్టే పరీక్షలు చేయించుకోవాలి. కేన్సర్‌ చికిత్సలు, యాంటీ ఈస్ర్టోజన్‌ మందులు, ఆస్తమా చికిత్సలో భాగంగా వాడే స్టెరాయిడ్ల మూలంగా ఎముకలు గుల్లబారతాయి. ఈ కోవకు చెందిన వారు వయసుతో నిమిత్తం లేకుండా బోన్‌ డెన్సిటీ పరీక్ష చేయించుకుని, అవసరమైన చికిత్స తీసుకోవాలి. తల్లి నుంచి బిడ్డకు ఆస్టియొపొరోసిస్‌ సంక్రమించే అవకాశాలు తక్కువే అయినా, తమ ఎముకల సాంద్రత గురించిన అనుమానం ఉన్న మహిళలు కూడా బోన్‌ డెన్సిటీ పరీక్ష (డెక్సా టెస్ట్‌) చేయించుకోవచ్చు. పరీక్షల్లో సాంద్రత తగ్గే అవకాశం ఉందని తేలినప్పుడు పోషకాహారం, వ్యాయామాలతో పాటు క్యాల్షియం, విటమిన్‌ డి సప్లిమెంట్లు తీసుకోవాలి. అదనంగా బిస్ఫాల్ఫనేట్స్‌ కూడా తీసుకోవాలి. అండాలు సరిపడా... 


ఎఎమ్‌ హెచ్‌ పరీక్ష: ఒవేరియన్‌ రిజర్వ్‌ను ఎఎమ్‌హెచ్‌ టెస్ట్‌ (యాంటీ ములేరియన్‌ హార్మోన్‌) ద్వారా మహిళలు పరీక్షించుకోవచ్చు. అయితే ఈ పరీక్ష ఫలితాన్ని బట్టి అండాలు విడుదలయ్యే కాలపరిమితిని కచ్చితంగా అంచనా వేసే వీలుండదు. అండాల విడుదల సక్రమంగా జరగకపోవడానికీ, తగ్గడానికీ, ఆగిపోవడానికీ ఎన్నో కారణాలుంటాయి. కాబట్టి ఈ పరీక్షలో అండాలు నిల్వలు సరిపడా కనిపిస్తే, పిల్లలను కనే అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయనే నమ్మకంతో వివాహాన్ని ఏళ్ల తరబడి వాయిదా వేసుకోవడం సరి కాదు. అండాల నిల్వలతో పని లేకుండా, మహిళలు 25 నుంచి 30 ఏళ్లలోపు తల్లి కావాలి. 


డాక్టర్‌ చుప్పన రాగసుధ,

సీనియర్‌ కన్సల్టెంట్‌ అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌,

బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో చిల్ర్డెన్స్‌ హాస్పిటల్‌, విశాఖపట్నం.

Updated Date - 2022-01-11T18:23:17+05:30 IST