అభ్యర్థుల మందుచూపు!

ABN , First Publish Date - 2021-03-02T06:12:10+05:30 IST

జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో మద్యానికి డిమాండ్‌ బాగా పెరిగిపోయింది.

అభ్యర్థుల మందుచూపు!

ఓటర్లకు పంపిణీ చేయడానికి భారీఎత్తున మద్యం సేకరణ

ఎన్నికల కోడ్‌ అమలుతో దుకాణాల్లో అమ్మకాలపై పరిమితులు

ఒక్కో వ్యక్తికి ఒక బాటిల్‌ మాత్రమే విక్రయం

మద్యం సేకరణకు కిరాయి మనుషులు నియామకం

బాటిల్‌కు రూ.10 కమీషన్‌గా చెల్లింపు

భారీగా మద్యం నిల్వ చేస్తున్న అభ్యర్థులు

జీవీఎంసీ ఎన్నికల్లో ఏరులై పారనున్న మద్యం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో మద్యానికి డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. పోలింగ్‌ ముందురోజు ఓటర్లకు పంపిణీ చేయడానికి పలువురు అభ్యర్థులు ముందుచూపుతో మద్యం సేకరణలో బిజీగా ఉన్నారు. ప్రైవేటు మద్యం దుకాణాలు లేకపోవడం, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో మద్యం ధరలు చాలా అధికంగా వుండడంతో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ కూడా మనిషికి ఒక్క బాటిల్‌ మాత్రమే విక్రయిస్తుండడంతో భారీగా మద్యం కొనుగోలు చేయడానికి కమీషన్‌ విధానంలో మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. 


ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కార్యకర్తలు, ప్రచార సామగ్రి ఎంత ముఖ్యమో, మద్యం కూడా అంతే ముఖ్యం. ఓటర్లకు మద్యం పంపిణీ చేయడం సర్వసాధారణం. పురుష ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు బలమైన ఇండిపెండెంట్లు కూడా మద్యం పంపిణీ చేస్తుంటారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే...స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం ప్రవాహం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నెల పదో తేదీన జీవీఎంసీ ఎన్నికలు జరుగుతుండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు, మద్యం సేకరణపై దృష్టిసారించారు. గతంలో ప్రైవేటు మద్యం దుకాణాలు వున్నప్పుడు ఎంత మద్యం కావాలన్నా దొరికేది. కానీ ప్రస్తుతం మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టడంతో పరిస్థితి మారిపోయింది. దీంతో అధికార పార్టీ అభ్యర్థులకు తప్ప మిగిలిన వారికి మద్యం సేకరణ తలనొప్పిగా మారింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ సీసాలు ఒక్కో మనిషికి మూడు మాత్రమే ఇవ్వాలన్న నిబంధన ఉంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత దీనిని ఒక సీసాకే పరిమితం చేశారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మద్యం సేకరించడానికి పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో అభ్యర్థి 10 నుంచి 20 మంది వరకు మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. ఒక దుకాణంలో ఒక వ్యక్తికి ఒక సీసా మాత్రమే అమ్మాలన్న నిబంధన వుండడంతో వీరు ప్రతి దుకాణానికి వెళ్లి ఒక్కో సీసా చొప్పున మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాధ్యమైనన్ని ఎక్కువ మద్యం సీసాలు సేకరిస్తున్నారు. వంద సీసాలు కాగానే ముందుగా నిర్దేశించుకున్న ప్రాంతానికి తీసుకువెళ్లి భద్రపరుస్తున్నారు. అక్కడికి మరొక బృందం వచ్చి, అభ్యర్థులు సూచించిన చోటకు సరకు తీసుకువెళ్లి భద్రపరుస్తున్నారు. 


సీసాకు రూ.10 కమీషన్‌


దుకాణాల నుంచి మద్యం కొనుగోలు చేసి తీసుకువచ్చిన మనుషులకు ఒక్కో సీసాకు అభ్యర్థులు రూ.10 చొప్పున కమీషన్‌ ఇస్తున్నారు. ఉదాహరణకు రూ.150 ధర వుంటే మద్యం సీసాలను వంద సేకరించగలిగితే, మద్యం కొనుగోలు ధరతోపాటు కమీషన్‌ కింద వెయ్యి రూపాయలు అందజేస్తున్నారు. ఇది లాభసాటిగా వుండడంతో అభ్యర్థుల అనుచరుల్లో కొంతమంది మద్యం సేకరణకు నడుం బిగించారు. జీవీఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఎక్కువ మంది ఈ తరహాలోనే మద్యం సేకరిస్తుండడంతో దుకాణాల్లో చీప్‌ లిక్కర్‌ అమ్మకాలు బాగా పెరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే రెండింతలు ఎక్కువగా చీప్‌ లిక్కర్‌ అమ్ముడవుతున్నట్టు సిబ్బంది చెబుతున్నారు.  

Updated Date - 2021-03-02T06:12:10+05:30 IST