Advertisement

పీఠం కోసం కుస్తీ..!

Mar 6 2021 @ 00:31AM

రాజకీయ కత్తులు దూస్తున్న అభ్యర్థులు

మైదుకూరు, ప్రొద్దుటూరు చైర్మన పీఠాలపై దృష్టి

హోరా హోరీగా ప్రచారం

కడప నగరంలో గౌరవప్రదమైన స్కోర్‌ కోసం టీడీపీ వ్యూహం

రాయచోటి ఏకగ్రీవమైనా చైర్మన పీఠంకోసం వైసీపీలో సిగపట్లు

వ్యూహాలతో వేడెక్కిన పట్టణాలు


పురపోరు కీలక దశకు చేరింది. చైర్మన పీఠం కోసం అధికార పక్షం.. గౌరవప్రదమైన స్కోర్‌ కోసం ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. ప్రచారంలో దూకుడు పెంచాయి. 8వ తేది సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగుస్తుంది. మిగిలిన సమయం మూడు రోజులే. తెల్లారకనే ఓటర్ల ఇంటి ముందు అభ్యర్థులు వాలిపోతున్నారు. కడప నగర మేయర్‌ పీఠం వైసీపీకే ఖరారు అయ్యింది. ఇక్కడ గౌరవప్రదమైన సీట్ల కోసం టీడీపీ ప్రయత్నం చేస్తోంది. మైదుకూరు, ప్రొద్దుటూరు చైర్మన పీఠాలపై తెలుగుదేశం నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వైసీపీని బలంగా ఢీకొడుతున్నారు. 31 వార్డులు ఏకగ్రీవం చేసుకొని రాయచోటి చైర్మన పీఠం తమ ఖాతాలో వేసుకున్న వైసీపీకి చైర్మన అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారింది. మరో పక్క ఎన్నికలు జరిగే 136 వార్డుల్లో నువ్వా.. నేనా..! అన్నరీతిలో అభ్యర్థులు పోరాడుతున్నారు.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కడప కార్పొరేషనతో పాటు ఏడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఒక్క మైదుకూరులో మాత్రమే 24 వార్డులుంటే అన్నిచోట్లా టీడీపీ అభ్యర్థులను బరిలో దింపింది. మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి, టీటీడీ మాజీ చైర్మన పుట్టా సుధాకర్‌యాదవ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పట్టణంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన బలిజ సామాజికవర్గానికి చెందిన ధనపాల జగనను చైర్మన అభ్యర్థిగా ఎంపిక చేశారు. అభ్యర్థుల ఎంపిక, గత ఏడాది మార్చి నెలలో నామినేషన్ల దాఖలు వరకు అధికార పార్టీ ఒత్తిళ్లకు అభ్యర్థులు చేజారకుండా పక్కా వ్యూహంతో ముందుకెళ్లారు. టీడీపీ అధికారంలో ఉండగా గత పాలకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో రూ.100 కోట్లతో అభివృద్ధి చేశాం.. టీడీపీని గెలిపిస్తే ఇంటి పన్ను పాత బకాయిలు, నీటి పన్ను పూర్తిగా రద్దు, ప్రస్తుతం ఉన్న పన్నును 50 శాతం తగ్గిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించినా.. దీటుగా ఢీకొడుతున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 41 వార్డులు ఉంటే 9 వార్డులు వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. 31 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ 29 వార్డుల్లో అభ్యర్థులను బరిలో దింపి.. రెండు వార్డుల్లో సీపీఐ, స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. చైర్మన పీఠం దక్కాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 21 స్థానాలు గెలవాలి. నామినేషన్ల సమయంలో టీడీపీ నాయకులు పెద్దగా శ్రద్ధ చూపలేదు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ వచ్చి వెళ్లిన తరువాత స్థానిక నాయకులు గట్టిగా నిలబడ్డారు. టీడీపీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు అధికార పార్టీ పలు బేరాలు, బెదిరింపులు, బుజ్జగింపులు చేపట్టినా.. ఇనచార్జి ఉక్కు ప్రవీణ్‌, చైర్మన అభ్యర్థి వీఎస్‌ యుక్తియార్‌, పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి అభ్యర్థులు చేజారకుండా పక్కా వ్యూహంతో మెజార్టీ స్థానాల్లో పోటీలో ఉన్నారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో గత పాలకవర్గంలో టీడీపీ చైర్మన్లే ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఈ రెండు పీఠాలు దక్కించుకోవడానికి గట్టి కృషి చేస్తున్నారు. 


కడపలో గౌరవప్రదమైన స్కోర్‌ దిశగా..!

కడప నగరపాలక ఎన్నికలు టీడీపీకి అగ్నిపరీక్షగా మారాయి. 50 డివిజన్లు ఉంటే ఇప్పటికే అధికార వైసీపీ 23 డివిజన్లు ఏకగ్రీవంగా తమ ఖాతాలో వేసుకొని మేయర్‌ పీఠానికి రెండు సీట్ల దూరంలో ఉంది. పీఠం ఆ పార్టీకే దాదాపు ఖాయమైనట్లే. ఎన్నికలు జరిగే 27 డివిజన్లలో కేవలం 14 స్థానాల్లోనే టీడీపీ అభ్యర్థులను నిలిపింది. అంతర్గత విభేదాలు, సీనియర్‌ నాయకులు ప్రచారానికి దూరంగా ఉన్నా.. టీడీపీ ఇనచార్జి అమీర్‌బాబు ఒక్కరే అభ్యర్థుల తరపున ప్రచారంలో దూకుడు పెంచారు. కార్పొరేషన ఏర్పడ్డాక తొలి పాలకవర్గంలో టీడీపీ పక్షాన 8 మంది, రెండో పాలకవర్గంలో ఏడుగురు కార్పొరేటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లోనైనా అభ్యర్థులను గెలిపించుకొని గౌరవాన్ని కాపాడుకోవాలనేది ఆ పార్టీ వ్యూహం. 


రాయచోటిలో చైర్మన పీఠం కోసం సిగపట్లు

రాయచోటి మున్సిపాలిటీలో 34 వార్డులకు గానూ 31 వార్డులు ఏకగ్రీవం చేసుకొని అధికార పార్టీ వైసీపీ చైర్మన పీఠం తన ఖాతాలో వేసుకుంది. అయితే.. ఆ పీఠం అధిష్టించేది ఎవరు..? ప్రస్తుతం ఆ పార్టీలోనే కాదు పట్టణంలో ప్రధాన చర్చ. హోటలైనా.. టీకొట్టయినా.. మార్నింగ్‌ వాకింగ్‌ మైదానమైనా.. ఎక్కడికెళ్లిని ఇదే చర్చ. 4వ వార్డు కౌన్సిలర్‌ హరూనబాషా, 20వ వార్డు కౌన్సిలర్‌ పి.మదనమోహనరెడ్డి, 22వ వార్డు కౌన్సిలర్‌ దశరథరామిరెడ్డి, 30వ వార్డు కౌన్సిలర్‌ ఆసీ్‌ఫఅలీఖాన చైర్మన పీఠంకోసం పోటీ పడుతున్నారు. నలుగురు ఆశిస్తున్నా దశరథరామిరెడ్డి, ఆసీఫ్‌ అలీఖానలలో ఒకరు చైర్మన అవుతారని పట్టణంలో విస్తృత ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ చీఫ్‌విప్‌, స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారు..? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. పట్టణంలో బలమైన సామాజికవర్గానికి ఇప్పటికే ఎమ్మెల్సీ, మార్కెట్‌ యార్డు చైర్మన, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన వంటి పదవులు ఇచ్చారు. మున్సిపల్‌ చైర్మన పీఠం మరో సామాజికవర్గానికి చెందిన పార్టీలో సీనియర్‌ కౌన్సిలర్‌కు దక్కవచ్చని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. చైర్మనగిరి ఆశిస్తున్న ఆ నలుగురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే శ్రీకాంతరెడ్డి ఆశీస్సుల కోసం ఆయన చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. మున్సిపాలిటీగా ఏర్పడ్డాక మొదటి చైర్మనగా బీసీ వర్గానికి చెందిన వీరభద్రయ్యకు అవకాశం దక్కింది. రెండో పర్యాయం ముస్లిం సామాజికవర్గానికి చెందిన నసీబూన ఖానమ్‌ను చైర్మనగా చేశారు. ప్రస్తుతం రెడ్డి సామాజికవర్గానికే చైర్మన పీఠం ఇవ్వాలని ఎమ్మెల్యేను గట్టిగా డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.