ఏపీలో ఉండలేం

ABN , First Publish Date - 2022-07-26T08:16:42+05:30 IST

తెలంగాణలోని భద్రాచలం నుంచి ఏపీలోని ఎటపాక మండలం ఐదు కిలోమీటర్లు.

ఏపీలో ఉండలేం

  • ఆంధ్రాలో అందని సాయం..తెలంగాణలో కలుస్తాం!
  • ‘ముంపు’కే వదిలేశారని ఎటపాక పోరుకేక 
  • పదిరోజులు బురదలోనే బతుకు పోరాటం
  • పరామర్శకు కూడా నోచుకోని బాధితులు
  • పొరుగునే తెలంగాణలో సత్వర సాయం
  • అక్కడ రూ.10వేలు ఇస్తే ఏపీలో రూ. 2వేలే
  • కొత్త జిల్లాలతో ఎటపాక డివిజన్‌ మాయం
  • దీంతో అత్యవసరంలో అందని సాయం
  • ఎగసిపడ్డ జనాగ్రహం.. ఆందోళనలు షురూ


చింతూరు/ఏలూరు/ఎటపాక, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలోని భద్రాచలం నుంచి ఏపీలోని ఎటపాక మండలం ఐదు కిలోమీటర్లు. దూరం పెద్దగా లేకపోయినా వరదల్లో చిక్కుకున్న ఈ రెండు ప్రాంతాలకు అందిన సాయం నుంచి స్పందన, పరామర్శ, చర్యల వరకు ప్రతి విషయంలోనూ తేడా స్పష్టంగా కనిపించింది. అన్నింటికన్నా ముఖ్యం, మానవత్వం! వైసీపీ సర్కారు, అధికారులనుంచి బాధితులకు కరువైంది ఇదే. వరదల్లో పదిరోజులు మగ్గిపోయినా పలకరించిన పాపాన పోవడంతో ఎటపాక మండల గ్రామాలు లోతుగా గాయపడ్డాయి. తెలంగాణలో భాగమైన భద్రాచలంలో వరద బాధితులకు రూ. పది వేలు అందుతుంటే.. ఏటపాక బాధితులకు కేవలం రూ. రెండు వేలు మాత్రమే ఇస్తామనడం, అందులోనూ చాలామందికి అవీ అందకపోవడం అసలే గాయపడ్డ గుండెలను మరింత మండించాయి. రాష్ట్ర విభజన పరిణామాల్లో ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చి చేరిన ఏడు విలీన మండలాల్లో ఎటపాక ఒకటి. ‘మమ్మల్ని తిరిగి తెలంగాణలో కలిపేయండి’ అంటూ ఈ మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలు ఏకంగా తీర్మానాలే చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 


ఇదే డిమాండ్‌తో అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని విలీన మండలాల ప్రజలు ప్లకార్డులు పట్టుకుని ఎక్కడికక్కడ రోడ్డుపైకి వస్తున్నారు. వరద ముంచెత్తిన పదిరోజులూ ఎలా బతికామో, మరెలా బయటపడ్డామో తలుచుకుంటే ఇప్పటికీ భీతి కలుగుతోందని బాధితులు వాపోతున్నారు. ఎటపాక మండలంలో పేరుకు నాలుగు చోట్ల పునరావాసాలు ఏర్పాటు చేశారు. కానీ.. గ్రామాలు వదిలి వచ్చి ఉండటానికి అవసరమైన వసతులేవీ అక్కడ లేవు. ఏటపాక గ్రామాలు సగానికి సగం నీట మునిగాయి. ఈ మండలంలో దాదాపు 32 వేల మంది నివసిస్తుంటే, వారిలో అత్యధికులు వరద పీడిత బాధితులే. గ్రామాల్లోకి వరద చేరుకోవడం మొదలైన రెండో రోజే సర్కారు సాయం, చర్యలపై ఆశలు వదిలేసుకున్నారు. వరద ముంపుపై ముందస్తుగా ఎటపాకకు సమాచారం ఇవ్వలేదు. స్థానికంగా ఉన్న సర్పంచ్‌లకు సంకేతాలు పంపలేదు. అధికారులు చూడనట్టు వదిలేశారు. అందుకనే ఐదు గ్రామాల సర్పంచులు ‘ఏపీలో ఉండలేం..’ అంటూ గ్రామ పంచాయల్లో తీర్మానాలు చేయించారు. ఇందులో నాలుగు చోట్ల వైసీపీ సర్పంచులే ఉండటం గమనార్హం. 


రోడ్డెక్కిన ‘వరద’ ఆగ్రహం

ఒకే గోదావరి...ఒకే వరద... ఒకే తరహా నష్టం... అయినా పరిహారంలో ఎందుకింత వ్యత్యాసమంటూ అల్లూరి జిల్లా ఎటపాక మండలవాసులు జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నిజానికి, ఏటా వరదలు వస్తుంటాయి. ఐతే ధన, ప్రాణ నష్టాలను నిలువరించడం ప్రభుత్వ విధి. దీనికోసం మే నెల నుంచే కసరత్తు మొదలుపెట్టాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇలాగే జరిగేది. విభజనతో అటు నుంచి ఇటు కలవడంలో తొలుత కొన్ని ఇబ్బందులు పడ్డా ఆ తర్వాత కలిసిపోయారు. అయితే, అప్పట్లో గోదావరి జిల్లాల్లో ఉన్న ఎటపాక తదితర మండలాలను.. పాలనా సౌలభ్యం పేరిట.. అల్లూరి జిల్లాలో కలిపారు. ఈ క్రమంలో ఎటపాకకు డివిజనును సైతం తొలగించి రంపచోడవరంలో కలిపేశారు. దీంతో వరదలు వంటి ఎమర్జెన్సీ సమయాల్లో పాలనా సాయం గతంతోపోల్చితే మరింత దూరమైంది. 


ఆదుకున్న ‘పొరుగు’

వరద ముప్పు తప్పించమని ఎంత మొత్తుకున్నా అధికారులు కదలలేదు. ప్రాణాలుపోయే పరిస్థితుల్లో పొరుగున ఉన్న భద్రాచలం కలెక్టర్‌ అనుదీప్‌కు, అక్కడి ఎమ్మెల్యే వీరయ్యకు ఎటపాక మండల బాధితులు సమాచారం ఇచ్చారు. తన రాష్ట్రం, తన పరిధి కాదని వదిలేయకుండా భద్రాచలం కలెక్టర్‌ ముందుకొచ్చారు. గుండాలలో ఒక డాబాపై చిక్కుకుపోయిన 70 మందిని తెలంగాణ ఎమ్మెల్యే సహకారంతో సురక్షితంగా భద్రాద్రికి చేర్చి.. ఆ తదుపరి ఆంధ్ర ప్రాంతానికి తరలించగలిగారు. అప్పటి దాకా ఏపీ యంత్రాంగం దిక్కులు చేస్తూ ఉండిపోయింది.

   

అసలు పట్టించుకోలేదు

‘‘గోదావరి వరదల్లో మమ్మల్ని ఆంధ్రా అధికారులు పట్టించుకోనేలేదు. వరద వస్తుందని ముందుగా చెప్పి మమ్మల్ని ఒడ్డుకూ చేర్చలేదు. వరదల్లో చిక్కుకున్న మా గోడు వినేవారేలేరు. ఇలాంటి దారుణం ఎప్పుడూ చూడలేదు. ఇక తట్టుకునే పరిస్థితులు లేవు’’            

- పాపారావు, కన్నాయిగూడెం


ఆదుకోలేదు.. 

‘కష్టంలో ఎవరూ ఆదుకోలేదు. తెలంగాణ అధికారులే రిస్క్‌ తీసుకుని వచ్చి వరదల్లో మమ్మల్ని ఆదుకున్నారు. ఆంధ్రా అధికారులు మాత్రం పదిరోజులైనా పలకరించడానికి రాలేదు’’

  - కొత్తపల్లి కమలమ్మ, గుండాల

Updated Date - 2022-07-26T08:16:42+05:30 IST