ఇక్కడ పని చేయలేం..!

ABN , First Publish Date - 2022-06-26T04:50:20+05:30 IST

డోన్‌ మున్సిపాలిటీలో పలువురు కీలక అధికారులు బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

ఇక్కడ పని చేయలేం..!
డోన్‌ మున్సిపల్‌ కార్యాలయం

బదిలీల కోసం మంత్రుల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు

ప్రజాప్రతినిధుల ఒత్తిడే కారణమని ఆరోపణలు


డోన్‌, జూన్‌ 25: డోన్‌ మున్సిపాలిటీలో పలువురు కీలక అధికారులు బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో ఇక్కడ పని చేయలేమని అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పట్టణంలో రైల్వేస్టేషన్‌ రహదారి, కోర్టు రహదారిల్లో రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో పలు ఆక్రమణలను తొలగించారు. తొలగింపునకు సంబంధించిన బిల్లులు చేయాలని టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులు, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇందులో అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఇంజనీరింగ్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అయితే అందుకు ఇంజనీరింగ్‌ విభాగంలోని కీలక అధికారి ససేమిరా అన్నట్లు తెలిసింది. ఏ పనులు చేశారో తనకు తెలియదని, అలాంటి వాటికి తాను బిల్లులు చేయలేనని ఇంజనీరింగ్‌ అధికారి తేల్చి చెప్పినట్లు సమాచారం. బిల్లుల విషయమే అధికారులు, కొందరు ప్రజాప్రతినిధుల మధ్య కోల్డ్‌వార్‌కు తెర తీసినట్లు తెలిసింది. దీంతో సదురు ఇంజనీరింగ్‌ అధికారిని ఇప్పటికే పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పలు భవనాల నిర్మాణాల పనుల నుంచి తప్పించారు. దీంతో ఇంజనీరింగ్‌ విభాగంలోని అధికారులు మూకుమ్మడిగా బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆ మంత్రిని కలిసి చిత్తూరు జిల్లాలో పోస్టింగ్‌ కోసం ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అదేవిధంగా మున్సిపాలిటీలో కీలకమైన ఓ అధికారి కూడా చిత్తూరు జిల్లాకే బదిలీ చేయించుకునేందుకు మరో మంత్రిని కలిసినట్లు తెలిసింది. అయితే మున్సిపాలిటీలోని కీలకమైన అధికారిని బదిలీపై పంపేందుకు జిల్లాకు చెందిన మంత్రి విముఖత చూపినట్లు తెలుస్తోంది. దీంతో సదరు కీలక అధికారి బదిలీకి బ్రేక్‌ పడవచ్చన్న చర్చ కూడా సాగుతోంది. 


మంత్రి అనుగ్రహం ఎవరికో? 


డోన్‌ నియోజకవర్గంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న కీలక అధికారులు జిల్లాకు చెందిన మంత్రి అనుగ్రహం పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూ శాఖలోని ఓ అధికారి నంద్యాల జిల్లా కేంద్రానికి బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే నియోజకవర్గంలోనే పని చేయాలని మంత్రి సూచించినట్లు సమాచారం. మైనర్‌ ఇరిగేషన్‌లోనూ కొందరు అధికారులు వారం రోజులుగా అమరావతిలోనే మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని ఓ నియోజకవర్గానికి బదిలీ చేయించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆర్‌అండ్‌బీలో పని చేసే పలువురు ఇంజనీరింగ్‌ అధికారులు బదిలీల కోసం పది రోజులుగా మంత్రుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది. ఆర్‌డబ్ల్యూఎస్‌లో పని చేసే ఇద్దరు ఇంజనీరింగ్‌ అధికారులు జిల్లా కేంద్రానికి బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఓ మంత్రి ఆశీస్సులు పొందేందుకు వారం రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో నియోజకవర్గంలో మంత్రి అనుగ్రహం ఎవరికి ఉంటుందో వేచి చూడాల్సిందే.

Updated Date - 2022-06-26T04:50:20+05:30 IST