అడ్డగోలు బుకాయింపు!

ABN , First Publish Date - 2022-06-25T08:03:41+05:30 IST

అడ్డగోలు బుకాయింపు!

అడ్డగోలు బుకాయింపు!

అప్పులపై బుగ్గన మార్కు గారడీ

పూర్తి అప్పులు వెల్లడించే ధైర్యం లేదా?

కార్పొరేషన్‌ రుణాలపై మౌనమెందుకు?

మాయ లెక్కలపై కాగ్‌ ప్రశ్నించలేదా?

30 వేల కోట్ల అప్పు మాయంపై అడగలేదా?

బడ్జెట్‌ హెడ్లు మైనస్‌లోకి ఎలా వెళ్లాయి?

ఇవన్నీ ప్రశ్నించడం నిజం కాదా?

ఒక్కదానికైనా జవాబివ్వలేదేం?

అన్నీదాచి తక్కువ అప్పులంటూ అబద్ధాలు


చేసిన అప్పును చేయలేదని, పెట్టామని చెప్పిన ఖర్చును పెట్టలేదంటూ అంకెలు మార్చి కాగ్‌కు తప్పుడు లెక్కలు పంపిన జగన్‌ సర్కారు.. మరో భారీ గారడీకి తెర తీసింది. అంకెల్లో తప్పులే కాదు.. రూ.30 వేల కోట్ల అప్పు కనిపించకుండా పోయినా.. అవేమీ పరిశీలించకుండానే కాగ్‌ ఇచ్చిన నివేదిక రచ్చకు కారణమైంది. దీంతో లెక్కలపై ఆ సంస్థ సర్కారును నిలదీసింది. వీటికి జవాబు చెప్పాల్సిన ఆర్థిక మంత్రి బుగ్గన.. కాగ్‌పై విశ్వాసం లేదా అని ఎదురుదాడికి దిగడం తాజా పరిణామం.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

బడ్జెట్‌ వ్యయాలు, అప్పులపై జగన్‌ సర్కారు పంపిన లెక్కలను యథాతథంగా కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తన రిపోర్టులో ప్రచురించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందులో రూ.30,000 కోట్లు గోల్‌మాల్‌ అయినట్లు బట్టబయలవడం, దీంతో కాగ్‌ పాత్రపైనా అనుమానాలు తలెత్తుతున్నాయని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఆ అంకెల గారడీని కొనసాగించేందుకు, ఆ రూ.30,000 కోట్ల గోల్‌మాల్‌ లెక్కలను సమర్థించుకోవడానికి శుక్రవారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియా సమావేశం పెట్టారు. కాగ్‌ లాంటి సంస్థను కూడా నమ్మరా అంటూ విమర్శించారు. నిజానికి కాగ్‌పై నమ్మకం లేనిది జగన్‌ ప్రభుత్వానికే. ఎందుకంటే అది దాస్తున్న కార్పొరేషన్‌ అప్పుల గుట్టు చెప్పాలని ఏజీ కార్యాలయం నెలకు కనీసం నాలుగైదు లేఖలు రాస్తోంది. ఒక్కదానికి కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ సమాచారం ఇవ్వడం లేదు. ఏజీ కార్యాలయం అడిగే ఏ ప్రశ్నకూ ఆ శాఖ అధికారుల నుంచి గానీ, మంత్రి నుంచి గానీ స్పందనే లేదు. ఏజీ కార్యాలయం ఈ నెల 16వ తేదీన ఒక లేఖ, ఆ తర్వాత వారం రోజులకే మరో లేఖను రాష్ట్ర ఆర్థిక శాఖకు రాసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం ఫైనల్‌ అకౌంట్స్‌కు సంబంధించి బడ్జెట్‌ హెడ్లన్నింటినీ మైనస్‌ చేసి ఎందుకు పంపారు.. తెచ్చిన అప్పులు, చేసిన ఖర్చులు ఎక్కడ దాచారో చెప్పాలని ఆ లేఖల్లో అడుగుతోంది. అయినా బుగ్గన మంత్రిగా ఉన్న ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చూస్తుంటే ఏజీపై, కాగ్‌పై ప్రభుత్వానికి ఏపాటి విశ్వాసం ఉందో అర్థమవుతోంది. అలాగే ప్రభుత్వం స్పందించకపోయినా ఏజీ కార్యాలయం ఎలాంటి క్రమశిక్షణ చర్యా తీసుకోదు. పైస్థాయిలో ఉన్న నియంత్రణ సంస్థలకు రాష్ట్ర సర్కారు తీరుపై ఫిర్యాదు చేయదు. ప్రభుత్వం సమర్పిస్తున్న గారడీ లెక్కలను ప్రశ్నిస్తున్నామని చెప్పుకోవడానికి ఓ వైపు లేఖలు రాస్తూ.. మరోవైపు గప్‌చు్‌పగా అదే గారడీ లెక్కలతో నివేదికలు ప్రచురించి పబ్లిక్‌ డొమైన్లో అందుబాటులో ఉంచుతోంది. జగన్‌ ప్రభుత్వం వాటిని చూపించి తమ అప్పులు తక్కువగా ఉన్నాయంటూ కొత్త అప్పులకు ఎగబడుతోంది. ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసుకోవడానికి ఓ రకంగా కాగ్‌ కూడా సహకరిస్తోందని ఈ పరిణామాలు గమనిస్తున్న ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


పూర్తి అప్పులు వెల్లడించే ధైర్యం ఉందా?

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన అప్పులను కార్పొరేషన్‌ అప్పులతో సహా బ్యాంకుల వారీగా, ఆర్థిక సంస్థల వారీగా వెల్లడించే ధైర్యం ప్రభుత్వానికి లేదు కాబట్టే కాగ్‌ పది రోజులకొకసారి లేఖల రూపంలో అడుగుతున్నా ఇప్పటి వరకు బుగ్గన కార్పొరేషన్ల అప్పుల వివరాలను కాగ్‌కు పంపలేదు. అప్పులపై ఇన్ని వివాదాలు ముసురుకున్నప్పుడు శ్వేతపత్రం విడుదల చేసి ఇవే మా ప్రభుత్వం చేసిన అప్పులని బహిరంగంగా మంత్రి ఎందుకు ప్రకటించడం లేదు..? ఏ ఒక్క ప్రెస్‌మీట్‌లోనూ కార్పొరేషన్‌ అప్పుల ఊసెత్తే ధైర్యం ఎందుకు చేయడం లేదు..? ఎందుకంటే ఆ అప్పులన్నీ బయటకువచ్చిన మరుక్షణం నుంచి రాష్ట్రానికి పైసా కూడా అప్పు పుట్టదు. అప్పు లేకపోతే ఒక్కపూటైనా సీఎం జగన్‌ రాష్ర్టా న్ని నడపలేరు. అప్పు పుట్టని మరుక్షణమే ప్రభుత్వం కుప్పకూలుతుంది.. అందుకే బుకాయింపులు తప్ప వాస్తవాలు చెప్పే ధైర్యం చేయడం లేదు. కార్పొరేషన్‌ అప్పులను పూర్తిగా.. ఆర్‌బీఐ, ఈఏపీ, నాబార్డు నుంచి తెచ్చిన అప్పులను సగానికి సగం దాచి చెబుతున్న మాయ లెక్కలకే కాగ్‌తో అధికారిక ముద్ర వేయించుకుంది. అయినప్పటికీ కాగ్‌ తన నివేదికలో తాము కార్పొరేషన్‌ అప్పుల వివరాలు అడిగినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇంకా సమాధానం రాలేదని, ఆ సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని రాసుకొచ్చింది. పూర్తిగా, సమగ్రంగా సమాచారం రానప్పుడు కాగ్‌ ఆ మాయలెక్కలను ఆమోదించి ఎందు కు రిపోర్టు విడుదల చేసిందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 


దాచినంత మాత్రాన కట్టేపనిలేదా?

చేసిన అప్పులను ఎప్పటికప్పుడు మంత్రి బుగ్గన దాస్తూ వస్తున్నారు. దాచినంత మాత్రాన నిజంగా బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు ఆ అప్పు కట్టే పనిలేదంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. కానీ కొత్త అప్పులు పుట్టించుకోవడం కోసమే.. అప్పటికే తెచ్చిన అప్పులకు మంత్రి ముసుగేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఏపీఎ్‌సడీసీ నుంచి రూ.8,000 కోట్లు.. అలాగే స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌, ఏపీపీఎ్‌ఫసీ, పౌరసరఫరాల కార్పొరేషన్‌, మార్క్‌ఫెడ్‌ నుంచి వేల కోట్ల అప్పులు తెచ్చి ప్రభుత్వ అవసరాలకు వాడి.. ఖర్చును మాత్రం కార్పొరేషన్ల ఖాతాలో చూపించారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. టీడీపీ హయాంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. కార్పొరేషన్‌ అప్పులు ప్రభుత్వం కోసం వాడితే ఆ అప్పును చంద్రబాబు ప్రభుత్వం  పబ్లిక్‌ డెట్‌లోనే చూపించింది. మంత్రి బుగ్గనలా రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడలేదు. గత ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ డెట్‌ కింద రూ.55,000 కోట్ల అప్పు తెచ్చారు. ఇందులో ఆ సంవత్సరపు ఫైనల్‌ అకౌంట్స్‌లో కేవలం రూ.25,000 కోట్ల అప్పు మాత్రమే ఆ పద్దులో చూపించారు. మిగతా రూ.30 వేల కోట్లు దాచారు. దాచినంత మాత్రాన కట్టేపనిలేకుండా పోతుందా? తమ అప్పు తక్కువే ఉందని చూపించుకోవడం కోసం ఈ విధంగా కాగ్‌ నివేదికలో ప్రచురించుకున్నారు. తక్కువ అప్పులని చూపించి కొత్త అప్పులు తెచ్చుకుంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ ద్రవ్యలోటు 2.1 శాతానికి తగ్గినట్లు కనిపించడానికి కారణం.. జగన్‌ సర్కారు పథకాల ఖర్చును ప్రభుత్వ ఖాతాలో కాకుండా కార్పొరేషన్లలో దాచడం.. తెచ్చిన అప్పును తేనట్లు అంకెలుమార్చి కాగ్‌కు పంపడం వల్లేనని కొందరు ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు.


‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఏజీ కార్యాలయంలో దుమారం

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.30,000 కోట్లు గోల్‌మాల్‌ జరిగిందని.. దీనిపై కాగ్‌ కూడా కళ్లు లేనట్టు ప్రవర్తించిందని ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం ఏజీ కార్యాలయంలో దుమారం రేపింది. దీంతో.. తమకు పంపిన అంకెల్లో గారడీలపై, మాయలపై వివరణ ఇవ్వాలని, మీడియాలో తమను టార్గెట్‌ చేస్తూ వచ్చిన కథనంపై, అకస్మాత్తుగా పబ్లిక్‌ డెట్‌లో అప్పులు ఎలా మాయమయ్యాయో చెప్పాలంటూ ఏజీ కార్యాలయం నుంచి రాష్ట్ర ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏజీ కార్యాలయంపై, కాగ్‌పై తమకు నమ్మకం ఉందని ప్రచారం చేసుకోవడానికి, ఈ ప్రచారాన్ని తమ అనుకూల మీడియాలో ప్రచురించి ఏజీ కార్యాలయంలో చెలరేగిన దుమారం సద్దుమణిగేలా చేయడానికే మంత్రి బుగ్గన శుక్రవారం మీడియా ముందుకొచ్చి ప్రత్యేకించి కాగ్‌కి అనుకూలంగా వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.

Updated Date - 2022-06-25T08:03:41+05:30 IST