ఆక్రమణలు.. కబ్జాలు

ABN , First Publish Date - 2022-07-28T16:41:14+05:30 IST

మహానగర ప్రధాన వరద ప్రవాహ వ్యవస్థగా ఉన్న మూసీ ముంపునకు ఆక్రమణలు, కబ్జాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మూసీని మూసేసి

ఆక్రమణలు.. కబ్జాలు

 మూసీకి ఇరువైపులా వేలాది నిర్మాణాలు

 ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ పరిధిలోనే బస్తీలు, కాలనీలు

 ఎఫ్‌టీఎల్‌లోనే మూసా, శంకర్‌, వాహెద్‌నగర్‌ బస్తీలు


Hyderabad /Rajendranagar/Ramantapur/Chadarghat: మహానగర ప్రధాన వరద ప్రవాహ వ్యవస్థగా ఉన్న మూసీ ముంపునకు ఆక్రమణలు, కబ్జాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మూసీని మూసేసి ఆక్రమణదారులు లే అవుట్లు చేసి ఇష్టానికి విక్రయించే దందా ఇప్పటికీ కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనం. బాపూఘాట్‌ మొదలు నాగోల్‌ వరకు మూసీకి ఇరువైపులా ఆక్రమణల పర్వం యథేచ్ఛగా జరుగుతోంది. ప్రస్తుత ముంపు ప్రాంతాల్లో మెజార్టీ మూసీని ఆక్రమించి నిర్మించినవే అని అధికారులు చెబుతున్నారు. అయినా.. చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెకిస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు హడావిడి చేసి.. అనంతరం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. సర్వేలు నిర్వహించి గుర్తించిన ఆక్రమణల తొలగింపు దిశగా అడుగు కూడా ముందుకు పడడం లేదు. గుడిసెలు మాత్రమే కాదు.. భారీ వెంచర్లు మూసీ బఫర్‌ జోన్‌లో వస్తుండటం గమనార్హం. 


50 మీటర్లుగా బఫర్‌ జోన్‌

మూసీ ఒక్కో చోట ఒక్కో విస్తీర్ణంలో ఉంటుంది. పలు ఏరియాల్లో ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే నిర్మాణాలు రాగా.. ఇంకొన్ని చోట్ల బఫర్‌ జోన్‌ ఆక్రమిస్తున్నారు. 2020లో భారీ వర్షాల నేపథ్యంలో వచ్చిన వరదల ఆధారంగా మూసీ ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించారు. ఎఫ్‌టీఎల్‌ నుంచి ఒక్కో వైపు 50 మీటర్ల మేర బఫర్‌ జోన్‌గా గుర్తిస్తూ జీఓ-7ను 2016లో ప్రభుత్వం జారీ చేసింది. అంతకుముందు మూసీ ఎఫ్‌టీఎల్‌ ఒక్కో వైపు 100 మీటర్లుగా ఉండేది. దీనిని తగ్గిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఉత్తర్వుల ప్రకారం ఎఫ్‌టీఎల్‌ నుంచి 150 అడుగుల మేర(బఫర్‌ జోన్‌) నిర్మాణాలకు అనుమతి ఉండదు. కుల్సుంపురా, జియాగూడ, అఫ్జల్‌గంజ్‌, పురానాపూల్‌, పేట్ల బురుజు, మహమూద్‌నగర్‌, జుబేదాబేగం బస్తీ, బండ్లగూడ, సన్‌సిటీ, గోల్నాక, అంబర్‌పేట, రామంతాపూర్‌ ప్రాంతాల్లో మూసీ పక్కనే బస్తీలు, కాలనీలు వెలిశాయి. పలు చోట్ల బహుళ అంతస్తుల భవనాలు, పెట్రోల్‌ బంక్‌లు ఏర్పాటు చేశారు. ముసారాంబాగ్‌ వద్ద బ్రిడ్జిపై నుంచి వరద ప్రవాహం పొంగి పొర్లడంతో పెట్రోల్‌ బంక్‌లోకి నీళ్లు వచ్చాయి. అంబర్‌పేట వైపు చికెన్‌, స్ర్కాప్‌, ఇతరత్రా దుకాణాలు నీట మునిగాయి.

 

అక్రమ కట్టడాలు గుర్తింపు

చాదర్‌ఘాట్‌లోని మూసీ పరీవాహక ప్రాంతాలైన ముసానగర్‌, శంకర్‌నగర్‌ బస్తీలు మూసీ నది బఫర్‌ జోన్‌లోనే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. గత మార్చిలో ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఫైనల్‌ నోటిపికేషన్‌ జారీ చేయడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా పరిధిలో 14 కి.మీల పొడవునా గోల్కొండ, ఆసిఫ్‌నగర్‌, బహదూర్‌పురా, చార్మినార్‌, హిమాయత్‌నగర్‌, నాంపల్లి, అంబర్‌పేట, సైదాబాద్‌ మండలాలను కలుపుతూ ప్రవహించే నదికి ఇరువైపులా వేలాది ఆక్రమణలున్నాయి. చాదర్‌ఘాట్‌లో మూసీ ప్రవాహాన్ని ఆనుకొని మూసానగర్‌, శంకర్‌నగర్‌ బస్తీలు వెలిశాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా బస్తీల్లో విద్యుత్‌, తాగునీరు, రోడ్లు వంటి సదుపాయాలు కల్పించేలా కొందరు ఒత్తిడి తీసుకువస్తున్నారు. అంబర్‌పేట మండలం పరిఽధిలోకి వచ్చే శంకర్‌నగర్‌, ముసానగర్‌ బస్తీల్లో 1,100 అక్రమ కట్టడాలు వెలిసినట్లుగా రెవెన్యూ అధికారులే అధికారికంగా గుర్తించారు. సైదాబాద్‌ మండలం పరిధిలోని వడ్డెరబస్తీ, అజయ్‌హట్స్‌, శాలివాహనహట్స్‌, అంబేడ్కర్‌ హట్స్‌ పేరుతో వెలిసిన 600 అక్రమ కట్టడాలను గుర్తించారు. వీటిపై నివేదిక తయారు చేసిన రెవెన్యూ అధికారులు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఆర్‌డీసీ)కి అందించారు. ముంపునకు గురయ్యే బస్తీ వాసులకు పక్కా ఇళ్లు ఇచ్చే అంశంపై ఉన్నత స్థాయిలో స్పష్టత రావడం లేదు.  అలాగే, పక్కా గృహాలు ఇస్తామన్నా కొందరు వెళ్లేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. 


ఈసా నదిపై...

బాపూఘాట్‌ వరకు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ ప్రాంతాల్లో ఇప్పటికే వందల సంఖ్యలో నిర్మాణాలు వెలిశాయి.  ప్రస్తుతం జనచైతన్య ఫేజ్‌-2 వద్ద ఈసా నది బఫర్‌ జోన్‌ పరిధిలో నిర్మాణాలు మొదలయ్యాయి. అయినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎంఆర్‌డీసీ ఏర్పాటచేసినా.. మూసీ పరిస్థితి మారడం లేదు.

Updated Date - 2022-07-28T16:41:14+05:30 IST