మాస్టర్‌ ప్లాన్‌లో ‘కేపిటల్‌ హిల్‌’

Jul 23 2021 @ 00:33AM

వివరాలు మాత్రం నిల్‌

కాపులుప్పాడలో ఐటీ కంపెనీల కోసం ఓ కొండపై 170 ఎకరాల మేర అభివృద్ధి చేసిన టీడీపీ ప్రభుత్వం

ఇప్పుడు ఆ కొండపైనే కార్యాలయాలు నిర్మించే అవకాశం వుందని ప్రచారం

మరోవైపు నగరంలో పలు రహదారుల విస్తరణకు ప్రతిపాదన

సిరిపురం-ఆశీల్‌మెట్ట రోడ్డు 26 మీటర్లు నుంచి 45 మీటర్లకు విస్తరణ

వాల్తేరు మెయిన్‌ రోడ్డు, అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డు కూడా...

అంత భారీమొత్తం నష్ట పరిహారం చెల్లించే పరిస్థితి ఉందా?


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌-2041లో కాపులుప్పాడలో ఒక కొండను ‘కేపిటల్‌ హిల్‌’గా చూపించింది. అంతకు మించి దాని వివరాలు ఎక్కడా పొందుపరచలేదు. తెలుగుదేశం ప్రభుత్వం కాపులుప్పాడలో ఐటీ కంపెనీల కోసం దాదాపు 400 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఓ కొండలో 170 ఎకరాలు అభివృద్ధి చేసి ఓ లేఅవుట్‌ వేసింది. కొండపైకి రహదారి నిర్మించడంతో పాటు, వాటర్‌ ట్యాంక్‌, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, సెంటర్‌ డివైడర్లు, వాటిపై లైటింగ్‌ కోసం విద్యుత్‌ స్తంభాలు వంటివి ఏర్పాటుచేసింది. అక్కడే అదానీకి కొంత స్థలం ఇస్తామని ప్రకటించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేటాయింపును రద్దు చేసి...వేరే కొండపై అదానీకి స్థలం ఇచ్చింది. సుమారు రూ.75 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ కొండను రెండున్నరేళ్లుగా ఖాళీగానే ఉంచింది. అక్కడ ఎవరికీ సెంటు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ కొండపైనే రాష్ట్ర రాజధాని కార్యాలయాలు నిర్మించే అవకాశం వుందని అనధికార వర్గాల భోగట్టా.


చిత్ర విచిత్రమైన ప్రతిపాదనలు

నగరం వెలుపల ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో చెప్పాల్సిన మాస్టర్‌ ప్లాన్‌...ఈసారి ఎక్కువగా నగరం రూపురేఖలు మార్చడానికి అనేక ప్రతిపాదనలు చేసింది. బీఆర్‌టీఎస్‌ రహదారుల నిర్మాణానికి దశాబ్దకాలంగా జీవీఎంసీ సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు వాటిని మరిన్ని మీటర్లకు విస్తరించాలని మాస్టర్‌ప్లాన్‌లో వీఎంఆర్‌డీఏ ప్రతిపాదించగా, స్థానిక ఎమ్మెల్యేలంతా వ్యతిరేకిస్తున్నారు. 


సంపత్‌ వినాయకుడి గుడి మార్గం 45 మీటర్లకు పెంపు

సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ కార్యాలయం నుంచి దత్‌ ఐల్యాండ్‌ మీదుగా సంపత్‌ వినాయకుడి గుడి వైపు వచ్చే మార్గం ప్రస్తుతం 26 మీటర్ల వెడల్పు (సుమారు 85.8 అడుగులు)తో ఉంది. దీనిని భవిష్యత్తులో 45 మీటర్లు (145.5 అడుగులు)కు విస్తరిస్తామని మాస్టర్‌ ప్లాన్‌లో వీఎంఆర్‌డీఏ ప్రతిపాదించింది. ఆ మార్గంలో అన్నీ వాణిజ్య సముదాయాలే ఉంటాయి. వాటి వెనుక నివాసాలు ఎంతో కాలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మార్గాన్ని విస్తరించాలంటే..భారీగా నష్టపరిహారం ఇవ్వాలి. అంత మొత్తాలు చెల్లించగలిగే స్థితిలో స్థానిక సంస్థలు లేవు. వాటి సంగతి పక్కన పెడితే...ఇప్పుడు ఈ మాస్టర్‌ప్లాన్‌ ఆమోదం పొందగానే...ఇకపై ఆ మార్గంలో 45 మీటర్లలోపు ఎవరైనా భవనాలు నిర్మించాలంటే...జీవీఎంసీ అనుమతి ఇవ్వదు. ఆ కొత్త రహదారి ఎప్పుడు వేస్తారో...వేయరో తెలియదు గానీ అందులో వున్నందున ఒక్క ప్లాన్‌కు అనుమతి రాదు. అమ్ముకోవడానికి వీలుకాదు. దాంతో అక్కడ స్థలాలున్నవారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనవలసిందే. అలాగే సిరిపురం-జగదాంబ రహదారి (వాల్తేరు మెయిన్‌రోడ్డు), అక్కయ్యపాలెం 80 ఫీట్‌ రోడ్డు కూడా విస్తరణకు ప్రతిపాదించింది.


గెడ్డలు, వాగులు మాయం

కొత్తగా ప్రతిపాదించిన మాస్టర్‌ ప్లాన్‌లో నగరం నడి మధ్య నుంచి ప్రవహిస్తున్న గెడ్డలు, వాగులు ఎక్కడా చూపించలేదు. నగరంలో ఇవి చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో చాలా వాటిని నాయకులు, ప్రజా ప్రతినిధులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అయినా ఇంకా చాలాచోట్ల వాటి ఉనికి ఉంది. వాటిని ఎలా విస్మరిస్తారని, ప్లాన్‌లో చూపించాల్సిందేనని సీపీఎం, జనసేన నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.


ప్రజలకు వివరించేదెపుడు?

ఈ పెరస్పెక్టివ్‌ మాస్టర్‌ ప్లాన్‌ సామాన్యులు ఎవరికీ అర్థం కావడం లేదు. న్యాయంగా చెప్పాలంటే...ప్రజా ప్రతినిధులు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, ప్రజా సంఘాలు, సంక్షేమ సంఘాలకు వేర్వేరుగా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చి, అందరికీ అర్థమయ్యేలా అధికారులు తమ ప్రణాళికలు వివరించాలి. ఆపై అభ్యంతరాలు కోరాలి. కానీ అప్పుడెప్పుడో మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనకు సన్నాహాలు చేస్తున్న సమయంలో పెట్టిన సమావేశాలను ఇప్పుడు ఉటంకిస్తూ...అన్నీ నిర్వహించేశామని చెప్పడం బాధ్యతల నుంచి తప్పుకోవడమేనని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 


2 రకాలుగా మాస్టర్‌ ప్లాన్‌!?

విశాఖపట్నంలో రాష్ట్ర పరిపాలనా రాజధాని ఏర్పాటైతే ఒకలా, కాకుంటే మరోలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్టుందని రెండు రోజుల క్రితం నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఏపీఎఫ్‌ఈఆర్‌డబ్ల్యుఎస్‌) అభిప్రాయం వ్యక్తంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా అసోసియేషన్లు కలిగిన తమను కూడా మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనలో భాగస్వామ్యం చేసి వుంటే బాగుండేదని  పేర్కొంది. భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనుల ప్రణాళిక బాగానే ఉంది గానీ వాటిని బలపరిచేలా డేటా ఎక్కడా పొందుపరచకపోవడం అసంతృప్తికి గురిచేసిందని తెలిపింది. ప్రజల అభిప్రాయాలు పూర్తిగా తెలుసుకోవడానికి కనీసం సెప్టెంబరు 15 వరకు అభ్యంతరాలు స్వీకరించాలని సూచించింది.


ముందుచూపు లేదు: విష్ణుకుమార్‌రాజు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ

మాస్టర్‌ప్లాన్‌ తయారుచేసే అధికారులకు ముందుచూపు ఉండాలి. కానీ ఇక్కడ నగర ప్రజల సమస్యలను అర్థం చేసుకోకుండా ప్రతిపాదనలు చేశారు. వీటిని యథాతథంగా అమలు చేస్తే చాలామంది ఆత్మహత్యలు చేసుకోవలసి ఉంటుంది. ఇప్పటికైనా వెంటనే అందరికీ అర్థమయ్యేలా ఆ ప్లాన్‌ను వివరించాలి.


మాస్టర్‌ప్లాన్‌పై జీవీఎంసీ అభ్యంతరం

- బీఆర్‌టీఎస్‌ కారిడార్లు, అక్కయ్యపాలెం 80 ఫీట్‌ రోడ్డు, ఆశీల్‌మెట్ట రోడ్డు విస్తరణకు విముఖం

- ఎనిమిది జోన్ల పరిధిలో 203 అంశాలు గుర్తింపు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): వీఎంఆర్‌డీఏ విడుదల చేసిన మాస్టర్‌ప్లాన్‌-2041 ముసాయిదాపై అభ్యంతరాలు తెలియజేసేందుకు జీవీఎంసీ కూడా సమాయత్తమవుతోంది. జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం వున్న పలురహదారుల వెడల్పును అమాంతం పెంచడంతోపాటు రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ జోన్‌లుగా కలిసి వున్న ప్రాంతాలను కేవలం రెసిడెన్షియల్‌ ప్రాంతాలుగా మార్చాలనే ప్రతిపాదన భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారుతుందని జీవీఎంసీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ తరపున అభ్యంతరాలను తయారుచేయాలని కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు జోన్లవారీగా అభ్యంతరం వున్న వాటిని గుర్తించి జాబితా తయారుచేస్తున్నారు. ప్రస్తుతానికి ఎనిమిది జోన్లలో కలిపి 203 అంశాలను గుర్తించినట్టు తెలిసింది. వీటిలో అత్యధికంగా జోన్‌-1 (భీమిలి) పరిధిలో 82 ఉండగా, జోన్‌-2 (మధురవాడ) పరిధిలో 34 వున్నట్టు చెబుతున్నారు. జాతీయ రహదారి నుంచి సంగివలస, నమ్మివానిపేట చెరువు రోడ్లను ఏకంగా 45 మీటర్లకు విస్తరించాలని మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. దీనివల్ల అనేక వ్యవసాయ భూములు, నివాసాలు పోతాయని అధికారులు భావిస్తున్నారు. అలాగే నగరంలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డు, అక్కయ్యపాలెం 80 ఫీట్‌రోడ్డు, సిరిపురం జంక్షన్‌ నుంచి ఆశీల్‌మెట్ట జంక్షన్‌ వరకూ వున్న రోడ్లను భారీగా విస్తరించాలని ప్రతిపాదించడం వల్ల అనేక ప్రైవేటు ఆస్తులను తొలగించాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. వీటన్నింటిపైనా పూర్తిస్థాయిలో కసరత్తు చేసి ఈ నెలాఖరు నాటికి వీఎంఆర్‌డీఏకి సమర్పించాలని అధికారులు భావిస్తున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.