ట్రంప్ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోర్టుకెక్కిన పోలీసులు!

ABN , First Publish Date - 2021-04-01T21:45:24+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై యూఎస్ కేపిటల్ పోలీసు అధికారులు కోర్టులో దావా వేశారు. జనవరి 6న కేపిటల్ భవనం వద్ద చోటు చేసుకున్న ఘర్షణల కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని

ట్రంప్ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోర్టుకెక్కిన పోలీసులు!

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై యూఎస్ కేపిటల్ పోలీసు అధికారులు కోర్టులో దావా వేశారు. జనవరి 6న కేపిటల్ భవనం వద్ద చోటు చేసుకున్న ఘర్షణల కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. ఇందుకు 75వేల డాలర్లను  నష్టపరిహారంగా ట్రంప్ నుంచి ఇప్పించాలని కోరారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గత ఏడాది నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై జో బైడెన్ ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన ఎన్నికను అధికారికంగా ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ జనవరి 6న కేపిటల్ భవనంలో సమావేశమైంది. అయితే ఎన్నికల్లో ఆక్రమాలు జరిగినట్టు పదేపదే ఆరోపించిన ట్రంప్.. ‘దొంగతనాన్ని అడ్డుకోండి’ అంటూ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. 



దీంతో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు కేపిటల్ భవనం వద్దకు చేరుకుని అలజడి సృష్టించారు. యూఎస్ కాంగ్రెస్ సమావేశం జరుగుతుండగానే కేపిటల్ భవనంలోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో భద్రతాదళాలకు, ట్రంప్ మద్దతుదారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా.. జనవరి 6న జరిగిన అల్లర్లకు ట్రంపే కారణమని ఆరోపిస్తూ.. జేమ్స్ బ్లాసింగ్‌గేమ్స్, సిడ్నీ హెంబీ అనే ఇద్దరు పోలీసు అధికారులు కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. జనవరి 6న చోటు చేసుకున్న ఘర్షణల వల్ల తమపై భౌతిక, మానసిక దాడి జరిగినట్టు పేర్కొన్నారు. తమకు జరిగిన నష్టానికి ఒక్కరికి 75వేల డాలర్ల చొప్పున మొత్తం 150వేల డాలర్లను ట్రంప్‌ నుంచి నష్టపరిహారంగా ఇప్పించాలని కోరారు. అంతేకాకుండా ట్రంప్ తన మద్దతు దారులను ఉద్దేశించి చేసిన ట్వీట్ల వివరాలను కూడా వారు తమ దావాలో పొందుపర్చారు. 


Updated Date - 2021-04-01T21:45:24+05:30 IST