శంకుస్థాపనలకే పరిమితం

ABN , First Publish Date - 2022-01-20T17:04:04+05:30 IST

జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌లో అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి.

శంకుస్థాపనలకే  పరిమితం

కార్యరూపం దాల్చని అభివృద్ధి పనులు  

ఏడాదిగా ప్రారంభించని కాంట్రాక్టర్లు

పట్టించుకోని ప్రజాప్రతినిధులు

నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు  


కాప్రా, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌లో అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. ప్రజాప్రతినిధులు హడావుడిగా శంకుస్థాపనలు చేయగా కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో అధికారులు వారికి మొక్కుబడిగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఫలితంగా సర్కిల్‌ పరిధిలో ఏడాది కాలంగా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. గ్రేటర్‌ ఎన్నికలకు ముందు కాప్రా సర్కిల్‌లో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు సర్కిల్‌లోని కాప్రా, ఏఎ్‌సరావునగర్‌, చర్లపల్లి, హెచ్‌బీకాలనీ, మల్లాపూర్‌, నాచారం డివిజన్‌లలో కోట్లాది రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో ప్రధానంగా బాక్స్‌ డ్రైనేజీలు, బాక్స్‌ కల్వర్టులు తదితర పనులు ఉన్నాయి.


ఈ ప్రతిపాదనలను ఉన్నతాధికారులు ఆమోదించడం, నిధులమంజూరు, టెండర్ల ప్రక్రియ వరకు అధికారిక పనులన్నీ చకచకా జరిగిపోయాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతుందనగా 2020 నవంబర్‌లో హడావుడిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుభా్‌షరెడ్డి, అప్పటి మేయర్‌ బొంతు రామ్మోహన్‌, స్థానిక కార్పొరేటర్లు శంకుస్థాపన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ మరుసటి రోజు నుంచి ఆయా అభివృద్ధి పనుల గురించి ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో చేసిన పనులకు బిల్లులు రాలేదన్న సాకుతో కాంట్రాక్టర్లు ఈ పనులపై నిర్లక్ష్యం వహించారు. అధికారులు కూడా సదరు కాంట్రాక్లర్లకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 


హెచ్‌బీకాలనీ తిరుమలనగర్‌లో రూ.2 కోట్లతో బాక్స్‌ డ్రైనేజీ, లక్ష్మీనగర్‌లో రూ.2 కోట్లతో బాక్స్‌ డ్రైనేజీ, కాప్రా-ఎల్లారెడ్డిగూడ కల్వర్టు విస్తరణకు రూ.1.60 కోట్లతో బాక్సు కల్వర్టు, నాచారం బాబానగర్‌లో రూ.2 కోట్లతో బాక్స్‌ కల్వర్టు పనుల శిలాఫలకాలు ఏడాదిగా దర్శనమిస్తున్నాయి.


ఎస్‌ఈ దృష్టికి తీసుకెళ్లాం

జోనల్‌ ఎస్‌ఈ పరిధిలో టెండర్లు నిర్వహించిన బాక్స్‌ డ్రైనేజీ, బాక్స్‌ కల్వర్టు పనులను కాంట్రాక్టర్లు ఇంకా మొదలు పెట్టలేదు. ఆ కాంట్రాక్టర్లకు మూడో నోటీసు కూడా జారీ చేశాం. అయినా వారి నుంచి స్పందన రాలేదు. ఈ విషయాన్ని ఎస్‌ఈ దృష్టికి తీసుకెళ్లాం. సదరు టెండర్లు రద్దుచేసి రీకాల్‌ చేయాలన్న దానిపై ఎస్‌ఈ నిర్ణయం తీసుకుంటారు.

- డి.కోటేశ్వరరావు, కాప్రా సర్కిల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌

Updated Date - 2022-01-20T17:04:04+05:30 IST