అమిత్ షాతో కెప్టెన్ అమరీందర్ సింగ్ భేటీ

ABN , First Publish Date - 2021-12-27T20:19:48+05:30 IST

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ చీఫ్

అమిత్ షాతో కెప్టెన్ అమరీందర్ సింగ్ భేటీ

న్యూఢిల్లీ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పంజాబ్ బీజేపీ ఇన్‌ఛార్జి గజేంద్ర సింగ్ షెకావత్, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) అధ్యక్షుడు సుఖ్‌దేవ్ ధిండ్సాలతో  సమావేశమయ్యారు. ఈ పార్టీలు కలిసి రానున్న పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. 


శాసన సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధికంగా నిలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలావుండగా, తాము కలిసి పోటీ చేస్తామని ఈ రెండు పార్టీలు ప్రకటించినప్పటికీ, సీట్ల పంపకం ఫార్ములాను నిర్ణయించలేదు. పట్టణాల్లో గెలుపు కోసం బీజేపీ విపరీతంగా కృషి చేస్తోంది. 


ఈ సమావేశం అనంతరం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇచ్చిన ట్వీట్‌లో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పంజాబ్ బీజేపీ ఇన్‌ఛార్జి గజేంద్ర సింగ్ షెకావత్, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) అధ్యక్షుడు సుఖ్‌దేవ్ ధిండ్సాలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో పొత్తులపై చర్చించినట్లు పేర్కొన్నారు. పంజాబ్‌లో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి చేయడం గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపారు.


పంజాబ్‌లో 117 శాసన సభ స్థానాలు ఉన్నాయి. త్వరలోనే శాసన సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేసే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది.


Updated Date - 2021-12-27T20:19:48+05:30 IST