హిందూపురంలో అధికార పార్టీ భూదందా

ABN , First Publish Date - 2022-02-13T05:53:40+05:30 IST

పట్టణంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు రియల్‌ మాఫియా సాగిస్తున్నారు. వివాదాల్లో ఉన్న, ప్రభుత్వ మిగులు, ఖాళీ స్థలాలపై కన్నేస్తున్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన వాటినీ వదలట్లేదు. ఖాళీగా కనిపిస్తే వాలిపోయి, కబ్జాలు చేసేస్తున్నారు

హిందూపురంలో అధికార పార్టీ భూదందా
ఎర్రకొట్టాల వద్ద అధికార పార్టీ నాయకుడు కబ్జా చేస్తున్న విలువైన భూమి ఇదే..

ఖాళీగా కనిపిస్తే కబ్జా

రూ.కోట్ల విలువైన స్థలాల ఆక్రమణ

వివాద, ప్రభుత్వ భూములపై ఆరా

యంత్రాంగంపై తీవ్ర ఒత్తిళ్లు

జోరుగా అక్రమ రిజిసే్ట్రషన్లు


హిందూపురం, ఫిబ్రవరి 12: పట్టణంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు రియల్‌ మాఫియా సాగిస్తున్నారు. వివాదాల్లో ఉన్న, ప్రభుత్వ మిగులు, ఖాళీ స్థలాలపై కన్నేస్తున్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన వాటినీ వదలట్లేదు. ఖాళీగా కనిపిస్తే వాలిపోయి, కబ్జాలు చేసేస్తున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని, యంత్రాంగ్రంపై ఒత్తిళ్లు తీసుకొచ్చి, అక్రమ మార్గాల్లో రిజిస్ట్రేషన్లు చేసేసుకుని, రు.కోట్ల విలువైన భూములను వశం చేసుకుంటున్నారు. హిందూపురం పట్టణ నడిబొడ్డున మిగులు భూముల పేరుతో రూ.6 కోట్లు విలువచేసే స్థలంపై తమకు హక్కు ఉందని అధికార పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు సబ్‌రిజిస్ర్టార్‌పై ఒత్తిడి తీసుకొచ్చి, రిజిస్ర్టేషన చేయించుకోవడం చర్చనీయాంశమైంది. ఇలా పట్టణ పరిధిలో మిగులు భూములు, జలవనరులు, మున్సిపల్‌ ఓపెన స్థలాలపై కొందరు అధికార పార్టీ నాయకులు కన్నేసి, ఆక్రమిస్తున్నారు. ఈ వ్యవహరం వెనుక అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి వద్ద అన్ని వ్యవహారాలు చక్కబెడుతూ నాయకుడిగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తి హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక తామేమీ తక్కువకాదని అధికార పార్టీ పేరుతో రియల్‌ వ్యాపారులు బరితెగించి విలువైన ప్రభుత్వభూములను కలిపేసుకుంటూ సొ మ్ము చేసుకుంటున్నారు. ఓవైపు అధికార పార్టీ నాయకులు, మరోవైపు రియల్‌ మాఫియా దెబ్బకు యంత్రాంగం తలొగ్గాల్సి వస్తోంది. ఇలాగే ఒత్తిళ్లు పెడితే పని చేయలేమని సబ్‌రిజిస్ర్టార్‌, రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేస్తున్న పలువురు అధికారులు వాపోతున్నట్లు తెలుస్తోంది.


శ్మశాన వాటిక కూడా..

హిందూపురంలోని మోతకపల్లి వద్ద సర్వేనెంబరు 64-3లో 95 సెంట్లు హెల్త్‌ సెంటర్‌ నిర్మాణానికి కేటాయించగా.. మిగిలిన రూ.1.5 కోట్ల విలువైన 20 సెంట్ల భూమిని అధికార పార్టీ కౌన్సిలర్‌ తమ కమ్యూనిటీ కల్యాణమండపం పేరుతో ఏకంగా ఆక్రమించి, రాళ్లు నాటి కబ్జా చేశాడు. భూమికి పట్టా ఇవ్వాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఈ విషయంపై అధికార వైసీపీలోనే ఇద్దరు మున్సిపల్‌ కౌన్సిలర్లు మధ్య వార్‌ సాగుతోంది. తమ వార్డులో భూమి ఎలా ఆక్రమిస్తారంటూ నాటిన రాళ్లను ఓ కౌన్సిలర్‌ అనుచరులు ధ్వంసం చేశారు. శ్మశానవాటికకు కేటాయించిన భూమిని ఎలా ఆక్రమిస్తారని ఓ సామాజిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే కోవలోనే హిందూపురం-పెనుకొండ ప్రధాన రహదారి పక్కనే ఇందిరమ్మ కాలనీలోని సర్వేనెంబరు 52-2లో మున్సిపల్‌ ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మాణానికి 25 సెంట్లు అప్పగించారు. ఇందులో రూ.కోటి విలువచేసే 10 సెంట్ల భూమిలో తమకు ఇళ్ల పట్టాలు ఉన్నాయని మూడు రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి అనుచరుడు కబ్జా చేసేందుకు యత్నించగా.. కాలనీవాసులు అడ్డుకున్నారు. దీంతో వెనక్కి తగ్గారు. అధికార పార్టీ రియల్‌ మాఫియా పట్టణ సమీపంలోని పూలకుంట వద్ద 392-3 సర్వే నెంబరులో రూ.4 కోట్ల విలువైన 88 సెంట్ల ప్రభుత్వ రస్తా పోరంబోకు భూమిని పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం లేఔట్‌ సిద్ధం చేయగా.. తమ వెంచర్‌ ముందు ఇవ్వొద్దని అధికార పార్టీ రియల్‌ వ్యాపారి అడ్డు తగిలాడు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి, మరోచోట రెండెకరాల భూమి కొనుగోలు చేసి, తన వెంచర్‌ ముందు ఇవ్వకుండా మరోచోట ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా చేశాడు. కిరెకెర వద్ద జలవనరుల శాఖకు చెందిన సర్వేనెంబర్‌ 386-3లోని 92 సెంట్ల భూమిని ప్రధాన రహదారి పక్కనే ఉండగా కలిపేసుకున్న రియల్‌ వెంచర్‌పై అధికారులు సర్వేచేసి ఆరు నెలల కిందట ఆక్రమణలు తొలిగించారు. అయినా ప్రభుత్వ పెద్దల ద్వారా జలవనరులశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి, ఆ భూమిని కలిపేసుకునేందుకు రాష్ట్రస్థాయిలో పావులు కదుపుతున్నారు. ఇలా హిందూపురం ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన కొందరు భూకబ్జాలకు తెరలేపడంతో రూ.కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు.


రూ.6 కోట ్ల భూమికి ఎసరు

పట్టణంలోని ఎర్రకొట్టాల సమీపాన రూ.6 కోట్ల విలువైన భూమికి అధికార పార్టీలోని ఓ చోటా నాయకుడు ఎసరు పెట్టాడు. అక్కడి ఓ సర్వే నెంబరులో 5.75 ఎకరాల్లో ఇప్పటికే 2.13 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 1.78 ఎకరాల్లో పదేళ్ల కిందటే వెంచర్‌ నిర్మాణంతో 47 మందికిపైగా ప్లాట్లు కొనుగోలు చేశారు. మిగిలిన భూమి 1.75 ఎకరాలు కూడా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి ఆధీనంలో ప్రహరీ నిర్మించారు. ఇందులో 88 సెంట్లకు వనబీ పాసుపుస్తకాలున్నాయి. మిగిలిన 87 సెంట్లకు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఇవ్వకుండా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వ్యవసాయేతర భూమిగా కన్వర్షన కాలేదని సాంకేతిక కారణాలతో పాసుపుస్తకాలు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సర్వే నెంబరులోని భూమిపై తమకు వారసత్వం ఉందని ముగ్గురిని తెరపైకి తీసుకొచ్చి, మిగులు భూములు ఉన్నాయని మాన్యువల్‌ ఈసీ పత్రం పెట్టి, జనవరి 25న 1.78 ఎకరాల భూమిని కొందరికి హిందూపురం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రిజిస్ర్టేషన చేశారు. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఓ నాయకుడి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. భూమి ఆధీనంలో ఉన్న వారిని పంచాయితీకి రావాలనీ, లేదంటే రూ.1.50 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఈనెల 3న సబ్‌రిజిస్ర్టార్‌కు ఇళ్ల పట్టాలు కొనుగోలు చేసినవారు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. రిజిస్ర్టేషన చేసిన డాక్యుమెంట్‌ రద్దు చేస్తామని సబ్‌రిజిసా్ట్రర్‌ హమీ ఇచ్చారు. అయినా నేటికీ రద్దు కాలేదని ఇళ్ల పట్టాల కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీ నేతలు ఉండడంతో బాధితులు.. పోలీసులను ఆశ్రయించలేకపోతున్నారు.



Updated Date - 2022-02-13T05:53:40+05:30 IST