ముచ్చుకోట అడవి ఆక్రమణ

ABN , First Publish Date - 2022-05-27T06:20:09+05:30 IST

ముచ్చుకోట అటవీ ప్రాంతాన్ని కబ్జా చేస్తున్నారు. పెద్దపప్పూరు, పుట్లూరు, నార్పల మండలాల్లో వందల ఎకరాల్లో అటవీ భూములు అన్యాక్రాంతం అయ్యాయి.

ముచ్చుకోట అడవి ఆక్రమణ
కబ్జా భూమిలో అరటి సాగుచేసిన దృశ్యం

బోర్లు వేసి పంటల సాగు

పట్టించుకోని అధికారులు

తాడిపత్రి, మే 26: ముచ్చుకోట అటవీ ప్రాంతాన్ని కబ్జా చేస్తున్నారు. పెద్దపప్పూరు, పుట్లూరు, నార్పల మండలాల్లో వందల ఎకరాల్లో  అటవీ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. అడవి మధ్యలో అనుమతి లేకుండా కొందరు పంటలు పండిస్తున్నారు. మరి కొన్ని చోట్ల భూములను సాగుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గతంలో కబ్జాకు గురైన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ రాజకీయ ఒత్తిడులు, ఇతర కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారీ వృక్షాలు ఉండాల్సినచోట అరటి, వేరుశనగ తదితర పంటలు కనిపిస్తున్నాయి. అటవీ భూముల్లో ఏకంగా బోర్లు వేసి మరీ పంటలను సాగుచేస్తున్నారు. ఒకరిని చూసుకొని మరొకరు అడవిని సాగుభూమిగా మారుస్తున్నారు. అయినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. 


పత్తా లేని సిబ్బంది

అడవుల్లోని వృక్ష సంపద, వన్య ప్రాణులను రక్షించుకునేందుకు అటవీశాఖ పరిధిలో ముచ్చుకోట సెక్షన్‌ ఆఫీ్‌సను ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ రేంజర్‌, ఏడుగురు సిబ్బంది విధులు నిర్వహించేవారు. వీరి కోసం మచ్చుకోట గ్రామంలో క్వార్టర్స్‌ ఏర్పాటు చేశారు.  క్వార్టర్స్‌లో ఉండి విధులు నిర్వర్తించాల్సిన సిబ్బంది, ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. విధులకు చుట్టపు చూపుగా  వచ్చి పోతుంటారు. అధికారులు ముచ్చుకోట సెక్షన్‌ పై దృష్టి పెట్టనందుకే ఈ పరిస్థితి ఏర్పడింది. తరచుగా తనిఖీలు నిర్వహించి, చెట్ల నరికివేతను అరికట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.


30 వేల ఎకరాలు..

అనంతపురం జిల్లా పరిధిలోని వివిధ మండలాల్లో దాదాపు 30 వేల ఎకరాల్లో ముచ్చుకోట అటవీ ప్రాంతం విస్తరించింది. ఈ అడవిలో ఎక్కువగా నారవేప చెట్లు ఉన్నాయి. గతంలో జింకలు, నెమళ్లు, ఇతర వన్య ప్రాణులు ఎక్కడ చూసినా కనిపించేవి. భూముల కబ్జా కారణంగా మానవ సంచారం పెరగడంతో అవి కనుమరుగవుతున్నాయి. కొన్ని వన్య ప్రాణులు ఆహారం, నీటి కోసం సమీప గ్రామాల్లోకి వస్తున్నాయి. 


అక్రమ మైనింగ్‌ కోసం..

ముచ్చుకోట అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ జరుగుతోంది. మైనింగ్‌ కోసం చెట్లను నరికేస్తున్నారు. గతంలో చెట్ల నరికివేతను అధికారులు అడ్డుకున్నా ఫలితం లేకపోతోంది. నిఘా వైఫల్యం కూడా అక్రమ మైనింగ్‌కు కారణమవుతోంది. ఫారె్‌స్టలో సుద్ద, లైమ్‌స్టోన్‌, మొజాయిక్‌, బలపం తదితర ఖనిజ సంపద ఉంది. అక్రమంగా వీటిని తవ్వి, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అటవీ ప్రాంతంలో రోడ్డు కూడా ఏర్పాటు చేశారంటే, పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రోడ్డు కోసం వందలాది చెట్లను నరికేశారు. అటవీ ప్రాంతంలో గనుల తవ్వకం కోసం కొందరు లీజు పొందారు. దీనికి బదులుగా లీజుదారులు కొంత భూమిని కొనుగోలు చేసి అటవీశాఖకు అప్పగించారు. ఈ భూమిలో మొక్కల పెంచే బాధ్యత లీజుదారులపై ఉంది. కానీ పూర్తిస్థాయిలో మొక్కలను పెంచలేదన్న ఆరోపణలు ఉన్నాయి. 

Updated Date - 2022-05-27T06:20:09+05:30 IST