హమ్మయ్య

ABN , First Publish Date - 2022-06-22T05:09:22+05:30 IST

వజ్రపుకొత్తూరు మండలంలో రెండు రోజులుగా ఎలుగుబంటి సంచరించడంతో అటు ప్రజలకు.. ఇటు అధికారులకు కంటినిండా నిద్ర కరువైంది. ఒకరిని చంపేసి.. ఆరుగురిని తీవ్రంగా గాయపరచడంతో.. ప్రజల్లో భయాందోళన పెరిగింది. ఎప్పుడు.. ఎవరి మీద దాడి చేస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపారు. దీన్ని అధికారులు సవాల్‌గా తీసుకుని.. రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఎలుగుబంటిని బంధించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

హమ్మయ్య
ఎలుగుబంటిని బంధించి బోనులో తీసుకెళ్తున్న దృశ్యం

పట్టుబడిన భల్లూకం
రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతం
విశాఖ జూకు తరలిస్తుండగా మృతి
ఊపిరిపీల్చుకున్న ప్రజలు
వజ్రపుకొత్తూరు, జూన్‌ 21:
వజ్రపుకొత్తూరు మండలంలో రెండు రోజులుగా ఎలుగుబంటి సంచరించడంతో అటు ప్రజలకు.. ఇటు అధికారులకు కంటినిండా నిద్ర కరువైంది. ఒకరిని చంపేసి.. ఆరుగురిని తీవ్రంగా గాయపరచడంతో.. ప్రజల్లో భయాందోళన పెరిగింది. ఎప్పుడు.. ఎవరి మీద దాడి చేస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపారు. దీన్ని అధికారులు సవాల్‌గా తీసుకుని.. రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఎలుగుబంటిని బంధించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వజ్రపుకొత్తూరు మండలంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని అధికారులు పట్టుకున్నారు. జిల్లా అటవీ శాఖాధికారి జీజీ నరేంద్ర ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం వేకువజామున నాలుగు గంటలకే అటవీశాఖ అధికారులు హారిక, ఏఎం నాయుడు తదితరులు  కిడిసింగి గ్రామానికి చేరుకుని.. ఎలుగుబంటి కదలికలపై వాకబు చేశారు. మంగళవారం ఉదయం గ్రామానికి సమీపంలో రేషన్‌ డీలర్‌ కడమటి రామారావు తోటలో ఉన్న ఇంటి పక్క షెడ్డులో ఎలుగుబంటి సేదతీరుతోంది. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో ఎలుగుబంటికి ముందుగా గన్‌ ఇంజక్షన్‌ ద్వారా మత్తు మందు ఇచ్చారు. అనంతరం ప్రత్యేక ఫోర్స్‌ సహాయంతో మత్తులో ఉన్న ఎలుగుబంటి నోటిని వస్ర్తాలతో కట్టి.. బోనులో బంధించారు. ఈ ఎలుగుబంటిని విశాఖలోని జంతుప్రదర్శన శాలకు తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో రెండు రోజులుగా భయాందోళన చెందిన ఈ ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకున్నారు. బందీలో ఉన్న ఎలుగుబంటిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానిక ఎస్‌ఐ గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

జూకు తరలిస్తుండగా మృతి..
అటవీశాఖ అధికారులకు తరలిస్తున్న ఎలుగుబంటిని విశాఖపట్నంలో జంతుప్రదర్శన శాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. దీంతో పోస్టుమార్టం నిర్వహించామని జూ అధికారులు తెలిపారు. దీని వయసు 12 ఏళ్లు ఉంటుందని, గుండెపోటుతో మృతి చెందిందని ధ్రువీకరించారు.

 

Updated Date - 2022-06-22T05:09:22+05:30 IST