కారు పట్టు.. తాకట్టు పెట్టు

ABN , First Publish Date - 2022-04-23T06:52:47+05:30 IST

జల్సాలకు, జూదాలకు అల వాటుపడిన కొందరు ఈజీమనీ కోసం ఎప్పటికప్పుడు కొత్త రూట్లు వెతుక్కొంటున్నారు. అందులో ఒకటి అద్దెకు కార్ల వ్యాపారం ఎత్తుగడ. తమ కంపెనీలకు నెలసరి అద్దెకు కార్లు కావాలంటూ గ్రామాల్లో కొందరు వలవిసురుతున్నారు.

కారు పట్టు.. తాకట్టు పెట్టు

  • ఈజీమనీ కోసం కొత్త మాయాజాలం
  • అధిక అద్దె ఇస్తామంటూ ఆశచూసి కార్లు లీజుకు
  • కాకినాడ, రామచంద్రపురం కేంద్రంగా అద్దె కార్ల బాగోతం.. ఇప్పటికే భారీగా మోసాలు
  • కోటనందూరు, తుని రూరల్‌ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు

కోటనందూరు, ఏప్రిల్‌ 22: జల్సాలకు, జూదాలకు అల వాటుపడిన కొందరు ఈజీమనీ కోసం ఎప్పటికప్పుడు కొత్త రూట్లు వెతుక్కొంటున్నారు. అందులో ఒకటి అద్దెకు కార్ల వ్యాపారం ఎత్తుగడ. తమ కంపెనీలకు నెలసరి అద్దెకు కార్లు కావాలంటూ గ్రామాల్లో కొందరు వలవిసురుతున్నారు. ఎక్కువ అద్దె వస్తుందనే ఆశ చూపి కొంతమంది దగ్గర వారి సొంత కార్లను తీసుకొని.. తర్వాత తాకట్టు పెట్టుకొని జల్సా చేస్తున్నారు. దీంతో ఎక్కువ అద్దెకు ఆశ పడిన కార్ల యాజమానులు అడ్డంగా బుక్కవుతున్నారు. అద్దెకోసం తమ కార్లు తీసుకుని వెళ్లిన వారి వద్దకు వెళ్లి అద్దె అడిగితే అదిగో, ఇదిగో అంటూ కాలంగడుపుతున్నా రు. దీంతో అద్దె ఇవ్వకపోయినా పర్వాలేదుకాని తమ కారు ఇచ్చేయమంటే అద్దెకు తీసుకున్నవారు అందుబాటులో లేకుండాపోతున్నారు. తీరా తమ కారు గురించి ఆరా తీస్తే అప్పటికే ఆ కారు తాకట్టులో ఉన్నట్టు తెలిసి యజమాను లు లబోదిబోమంటున్నారు. ఈ మోసాలపై పోలీసులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. 



ఆ కార్లు ఏం చేస్తున్నారంటే..

తమ సంస్థ అద్దెకు తీసుకున్న ఈ కార్లకు ప్రభుత్వ కార్యాలయాలకు, కంపెనీలకు అద్దెకు ఇస్తామని నమ్మబలుకుతారు. నెలకు రూ.30 వేల నుంచి కారునుబట్టి అంత కుమించి అద్దె వస్తుందని చెబుతారు. దాంతో సొంత కార్లు న్న యజమానులు వీరి వలలో పడతారు. మామూలు కార్లతోపాటు ఖరీదైన కార్లను కూడా వీరికి అద్దె వస్తుందనే ఆశతో వీరికి అప్పగిస్తున్నారు. వెంటనే వీరు కొంతమంది వడ్డీవ్యాపారులకు రూ.5ల వడ్డీకి తాకట్టు (రుణం తీరేవరకు కారును కూడా అప్పగించేలా) పెట్టి రెండు లక్షల నుంచి ఆపైబడి అప్పుగా తీసుకుంటున్నారు. దీనికి మధ్య లో దళారీ వ్యవస్థ ఉంటోంది. ఇలా తాకట్టుగా ఇచ్చిన వచ్చిన కారును దళారీల సహాయంతోనే వడ్డీ వ్యాపారులు.. కారు కావాలనే మోజు ఉన్నవారికి అంతే మొత్తం నగదు తీసుకుని మళ్లీ రూ.3ల వడ్డీకి మారు తాకట్టుతో వీరికి కారును అప్పగిస్తున్నారు. దీంతో కారు సరదా ఉన్న వారంతా ఇలా తాకట్టులో వచ్చిన ఆ కారులో జల్సా చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా కాకినాడ, రామచంద్రపురం, పిఠాపురం కేంద్రాలుగా జరుగుతున్నట్టు సమాచారం. నెల అద్దె వస్తుందనే ఆశతో కారు ఇచ్చినవారు నిండా మునిగిపోతుండగా, తొలుత తాకట్టు పెట్టి సొమ్ములు తీసుకున్న సంస్థవారు, తర్వాత తాకట్టు పెట్టుకున్న వడ్డీవ్యాపారులు, దళారులు లాభపడుతున్నారు. ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరితే చివరిగా తాకట్టులో కారు తెచ్చుకున్న వారు పూర్తిగా బుక్కవుతున్నారు. రెండు లక్షలు అప్పుగా ఇస్తే కారు తెచ్చుకుని వాడుకోవచ్చనే ఆశతో ఈ వ్యవహారంలో చిక్కుకున్న యువకులు పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలాంటి వ్యవహారంలో కోటనందూరు మండ లానికి సరిహద్దున ఉన్న నాతవరం మండలం ఎమ్‌బీ ప ట్నం గ్రామంలో 8 కార్లు వరకు పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు వచ్చి పట్టికెళ్లారని సమాచారం. అలాగే తుని వెలంపేట, రౌతులపూడి మండలం దిగుశవాడ ప్రాంతా లకు చెందిన ఇద్దరు కార్ల యాజమానులు అద్దెఎక్కువ వస్తుందనే ఆశతో తమ కార్లను అద్దెకు ఇచ్చారు. అలా తీసుకున్న వారు ఆ కార్లను తాకట్టుపెట్టి పరారీ అయ్యా రు. ఈ రెండు ఉదంతాలకు సంబంధించి తుని రూరల్‌, కోటనందూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 



కారు ఇచ్చి మోసపోయాం..

ఎక్కువ అద్దె వస్తుందని చెప్పడంతో ఒక వ్యక్తికి కారు అద్దెకు ఇచ్చానని, ఒక నెల అద్దె ఇచ్చిన తర్వాత నుంచి కనబడలేదని రౌతులపూడి మండలం దిగుశవాడకు చెందిన చింతల కుశరాజు చెప్పాడు. ఆరా తీస్తే తన కారు అప్పటికే తాకట్టులో పెట్టినట్టు తెలిసిందన్నారు. తుని మండలం వెలంపేటకు చెందిన భీమిరెడ్డి నాగదుర్గ కూడా ఇదే విధంగా మోసపోయినట్టు వాపోయాడు.

Updated Date - 2022-04-23T06:52:47+05:30 IST