కారు ఢీకొట్టడంతో పంచాయతీ కార్యదర్శులకు గాయాలు

ABN , First Publish Date - 2021-11-27T06:22:14+05:30 IST

చిలకలూరిపేట నుంచి మార్టూరు వైపు జాతీయరహదారిపై తాతపూడి సమీపంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను వెనుక నుంచి కారు ఢీకొట్టింది.

కారు ఢీకొట్టడంతో పంచాయతీ కార్యదర్శులకు గాయాలు
రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడిన మార్టూరు పంచాయతీ కార్యదర్శి జె సురేష్‌, పూనూరు పంచాయతీ కార్యదర్శి మురళి


వివాహానికి వెళ్లి వస్తుండగా ఘటన

ఒకరికి సీరియస్‌

మార్టూరు, నవంబరు 26 : చిలకలూరిపేట నుంచి మార్టూరు వైపు జాతీయరహదారిపై తాతపూడి సమీపంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మార్టూరు పంచాయతీ కార్యదర్శి జె.సురే్‌షకు తీవ్ర గాయాలుకాగా, యద్దనపూడి మండలం పూనూరు కార్యదర్శి మురళికి స్వల్పగాయాలయ్యాయి. బల్లికురవ మండలం ఉపమాగులూరు గ్రామానికి చెందిన అమరనేని భాస్కరరావు కుమార్తె వివాహం బొప్పూడి ఆంజనేయస్వామి గుడి సమీపంలోని కల్యాణ మండపంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఈ వివాహానికి ఇద్దరు కార్యదర్శులు మార్టూరు నుంచి ద్విచక్రవాహనంపై వెళ్లారు. వారు వివాహ వేడుకల్లో పాల్గొని బైక్‌పై మార్టూరు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇదే సమయంలో అటుగా వస్తున్న జడ్‌పీ వైస్‌ చైర్‌పర్సన్‌ చుండి సుజ్ఞానమ్మ కుమారుడు రవిచందు వారిద్దరిని సొంత వాహనంలో చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై పడిపోవడంతో సురేష్‌ తలకు తీవ్రగాయాలుకాగా అతనిని గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మురళి స్వల్పగాయాలతో బయటపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సురేష్‌ బైక్‌ను నడుపుతున్నాడు. ప్రమాదానికి కారణమైన కారును అక్కడే వదలి కారు యజమానులు పరారైనట్లు తెలిసింది.


బకింగ్‌హాం కాలువలో జారిపడి యువకుడు మృతి

మన్నేటికోట(ఉలవపాడు), నవంబరు 26 : బకింగ్‌హాం కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం మం డలంలోని కరేడు పంచాయతీ పరిధిలోని చిన్నపల్లెపాలెం వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మన్నేటికోట గ్రామానికి చెందిన బూసి శ్రీనివాసులు తన స్నేహితులతో కలిసి కరేడు చిన్నపల్లెపాలెం వద్ద బకింగ్‌హాం కాలు వ లాకుల వద్దకు వెళ్లాడు. స్నేహితులు ఈత కొడుతుండగా ఒడ్డున నిలబడి ఉన్న శ్రీనివాసులు జారీ ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడు. స్నేహితులు పక్కనే ఉన్న జాలర్లను తీసుకొచ్చి గాలించి బయటకు తీయించారు. అప్పటికే శ్రీనివాసులు మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్సై  విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఉలవపాడు సీహెచ్‌సీకి తరలించినట్లు చెప్పారు. మృతుడికి భార్యతో పాటు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.

Updated Date - 2021-11-27T06:22:14+05:30 IST