పట్టాలపై కారు!

ABN , First Publish Date - 2022-06-27T07:55:53+05:30 IST

మెట్రో రైల్లో ప్రయాణం సుఖవంతమే అయినా స్టేషన్‌లో దిగాక రద్దీ గురించే ఆందోళన చెందుతున్నారా? ట్రాఫిక్‌లో ఆపసోపాలు పడుతూ..

పట్టాలపై కారు!

రద్దీ నివారణకు మెట్రోస్టేషన్‌ల వద్ద ఏర్పాటు

ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరే సౌలభ్యం

డ్రైవర్‌ రహిత ‘పాడ్‌ కార్లు’.. విద్యుచ్ఛక్తితో పరుగులు 

ఒక కార్లో ఆరుగురు.. నగరంలో 2చోట్ల ప్రతిపాదన

రాయదుర్గం నుంచి కోహినూర్‌ వరకు 7.5 కి.మీ.. అసెంబ్లీ నుంచి ప్యారడైజ్‌.. 10 కి.మీ మేర నిర్మాణం

డీపీఆర్‌ సిద్ధం.. కేంద్రం మార్గదర్శకాలే తరువాయి

బెంగళూరులో 5 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు 

పట్టాల నిర్మాణం కోసం భూసేకరణే సమస్య?


హౖదరాబాద్‌ సిటీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): మెట్రో రైల్లో ప్రయాణం సుఖవంతమే అయినా స్టేషన్‌లో దిగాక రద్దీ గురించే ఆందోళన చెందుతున్నారా? ట్రాఫిక్‌లో ఆపసోపాలు పడుతూ గమ్యస్థానానికి చేరేందుకు ఇబ్బంది అని ఫీలవుతున్నారా? మీ ఈ కష్టాలు త్వరలోనే తీరే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంకల్పం నెరవేరితే మెట్రో రైలు దిగాక ఎలాంటి రద్దీ బెడద లేకుండా ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఎందుకంటే పట్టాల మీద పరుగులు పెట్టే ప్రత్యేక ‘పాడ్‌ కార్లు’ రానున్నాయి!! స్టేషన్‌ దిగీ దిగగానే.. ఓ వైపు పట్టాల మీద సిద్ధంగా ఉన్న కార్లో ఎక్కేసి హాయిగా వెళ్లిపోవొచ్చు! ఇదంతా పర్సనలైజ్డ్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సస్టమ్‌ (పీఆర్‌టీఎస్‌) ప్రక్రియ. ఈ మేరకు ట్రాఫిక్‌ అధికంగా ఉండే ప్రాంతాల్లో నగరవాసులకు సరికొత్త రవాణాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఈ పనులకు సంబంధించి  డీపీఆర్‌ను సిద్ధం చేసిన ప్రబుత్వం, కేంద్ర సర్కారు మార్గదర్శకాలు కోసం ఎదరుచూస్తోంది.  రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం కేంద్ర మంత్రి హరదీ్‌పసింగ్‌ పూరీని కలిసి ఇదే అంశంపై చర్చించారు. 


నగరంలోని ఎల్బీనగర్‌-మియాపూర్‌, జేబీఎ్‌స-ఎంజీబీస్‌, నాగోలు-రాయదుర్గం కారిడార్లలోని 56 స్టేషన్ల గుండా రోజుకు 820 మెట్రో ట్రిప్పులు నడుస్తున్నాయి. ఇందులో 3.20 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే 86 ఎంఎంటీఎస్‌ రైళ్లలో సుమారు 40 నుంచి 45 వేల మంది వరకు ప్రయాణిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల నుంచి నడుస్తున్న మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లు దిగిన తర్వాత కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులతోపాటు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు సాధారణ ప్రయాణికులు రోడ్లపై పెద్ద ఎత్తున ఉంటున్న ట్రాఫిక్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు సందర్భాల్లో గంటల తరబడి సతమతమవుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇతర దేశాల్లో నడుస్తున్న పీఆర్‌టీఎ్‌సను మన వద్ద కూడా తీసుకొచ్చి నగరవాసులకు మెరుగైన రవాణాను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండే హైటెక్‌ సిటీ ప్రాంతంలో పీఆర్‌టీఎ్‌సను తీసుకొచ్చేందుకు  ప్రభుత్వం నిర్ణయించింది. రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి 7.5 కిలోమీటర్ల పరిధిలోని మైండ్‌స్పేస్‌, ఇనార్బిట్‌ మాల్‌, అరబిందో, నాలెడ్జి సిటీ, మైహూ భుజా, ఐటీసీ కోహినూర్‌ వరకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు మెస్బర్స్‌ అల్ర్టా పీఆర్‌టీ లిమిటెడ్‌తో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌)  ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికలో రాష్ట్ర పురపాలకశాఖ వెల్లడించింది. అలాగే కారిడార్‌-2 జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ మార్గంలో ట్రాఫిక్‌ తీవ్రత  కలిగిన అసెంబ్లీ నుంచి సచివాలయం మీదుగా ప్యారడైజ్‌ మెట్రోస్టేషన్‌ వరకు 10 కిలోమీటర్ల వరకు పీఆర్‌టీఎస్‌ ప్రతిపాదించారు. ఈ రెండు ప్రాంతాల్లో త్వరగా ఎలివేటెడ్‌ మార్గాన్ని నిర్మించేందుకు తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరుతోంది.


పాడ్‌ కారు ఎలా నడుస్తుంది?

పీఆర్‌టీఎ్‌సకు మెట్రో మాదిరిగా ఎంపిక చేసిన ప్రాంతంలో రోడ్డు పక్కన ఎలివేటెడ్‌ ట్రాక్‌ ఉంటుంది. ఆ ట్రాక్‌ మీద పాడ్‌ కార్లు ఉంటాయి. అచ్చంగా కారు మాదిరిగానే ఉంటాయి. ఒక పాడ్‌కారులో నలుగురు నుంచి ఆరుగురు ప్రయాణించవచ్చు. లోపల డ్రైవర్‌ ఎవరూ ఉండరు. ట్రాక్‌కు అనుసంధానం చేసే  విద్యుత్తుపై ఆధారపడి ఇవి నడుస్తుంటాయి. ప్రయాణికులు ఎక్కి దిగేందుకుగాను స్టేషన్లు ముందుగానే ఫీడ్‌ చేసి ఉంటాయి. ఆ విధంగా ఎంపిక చేసిన స్టేషన్లలోనే ఆగుతాయి. ఆటోమేటిక్‌ వ్యవస్థ ద్వారా రద్దీ మార్గాల్లో 5 నుంచి 10 కిలోమీటర్ల లోపు మాత్రమే నడుస్తాయని హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులు తెలిపారు.  ప్రస్తుతం ఈ వ్యవస్థను బెంగళూరులోని 5 మార్గాల్లో ప్రతిపాదించినట్లు వెల్లడించారు.  


ఇప్పట్లో సాధ్యపడేనా! 

నగరంలో పీఆర్‌టీఎస్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం  ఓ వైపు కృషి చేస్తున్నప్పటికీ సాధ్యాసాధ్యాలపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాఫిక్‌ రద్దీ కలిగిన ప్రాంతాల్లో ట్రాక్‌ నిర్మాణం కోసం స్థల సేకరణ చేపట్టాల్సి ఉంటుంది. కారిడార్‌-2 జేబీఎస్‌- ఫలక్‌నుమా మార్గంలో భాగంగా ఇప్పటిదాకా ఎంజీబీఎస్‌ వరకే నిర్మించారు. అక్కడి నుంచి 5.5 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం నెలకొంది. పాతబస్తీలోని ప్రార్థన మందిరాలు అడ్డురావడంతో రెండుసార్లు అలైన్‌మెంట్‌ మార్చారు. అభ్యంతరాల నేపథ్యంలో పనులను ఎంజీబీఎస్‌ వరకు పూర్తిచేసి వదిలేశారు.  ఈ సమస్యనే పీఆర్‌టీఎస్‌ విషయంలో తలెత్తుతుందా? లేదంటే సాఫీగా పూర్తవుతాయా? నిధుల సమీకరణ సజావుగా సాగుతుందా అనే విషయాలపై సందిగ్ధం నెలకొంది.

Updated Date - 2022-06-27T07:55:53+05:30 IST