కారు రిపేరు ఖర్చు ఇన్సూరెన్స్‌ కంపెనీ చెల్లించాల్సిందే..

ABN , First Publish Date - 2021-02-28T15:05:27+05:30 IST

భారీ వర్షంలో మునిగి చెడిపోయిన కారుకు ఇన్సూరెన్స్‌ చెల్లించేందుకు నిరాకరించిన కంపెనీ తీరును రాష్ట్ర వినియోగదారుల ఫోరం తప్పుబట్టింది.

కారు రిపేరు ఖర్చు ఇన్సూరెన్స్‌ కంపెనీ చెల్లించాల్సిందే..

  • తీర్పునిచ్చిన రాష్ట్ర వినియోగదారుల ఫోరం 

హైదరాబాద్‌ సిటీ : భారీ వర్షంలో మునిగి చెడిపోయిన కారుకు ఇన్సూరెన్స్‌ చెల్లించేందుకు నిరాకరించిన కంపెనీ తీరును రాష్ట్ర వినియోగదారుల ఫోరం తప్పుబట్టింది. ఇన్సూరెన్స్‌ సర్వేయర్లు అంచనావేసిన కారు రిపేరుకయ్యే ఖర్చు రూ.17.54 లక్షలు చెల్లించాలని తీర్పును వెలువరించింది. బంజారాహిల్స్‌కు చెందిన సుధాకర్‌రాజు తన ఆడి కారుకు రూ. 1,12,705 చెల్లించి భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి చెందిన ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్నాడు. 2013 సెప్టెంబర్‌ 15న నగరంలో కురిసిన భారీవర్షం కారణంగా కేబీఆర్‌ పార్క్‌ వద్ద నిలిచిన వరదనీటిలో కారు మునిగింది. నీళ్లు తొలగిన తర్వాత కారు స్టార్ట్‌కాకపోవడంతో షోరూమ్‌కు తీసుకువెళ్లాడు. 


కారును పరిశీలించిన ఇన్సూరెన్స్‌ సంస్థ ప్రతినిధులు నీటిలో మునగడం ‘హైడ్రోస్టాటిక్‌ లాస్‌’ కిందకు వస్తుందని, తన పాలసీలో ఈ అంశం లేదని చెబుతూ ఇన్సూరెన్స్‌ చెల్లించలేమని తేల్చి చెప్పారు. ఇన్సూరెన్స్‌ సంస్థ పాలసీ తీసుకున్నా రిపేర్‌కు డబ్బులు చెల్లించకపోవడంతో బాధితుడు కారు రిపేరుకయ్యే ఖర్చుకు 12 శాతం వడ్డీతోపాటు రూ. 50వేలు పరిహారం కోరుతూ రాష్ట్ర వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు.  కేసును విచారించిన రాష్ట్ర వినియోగదారుల ఫోరం ప్రెసిడెంట్‌ జస్టిస్‌ ఎంఎ్‌సకే జైస్వాల్‌, మెంబర్‌ జస్టిస్‌ మీనారంగనాథ్‌లతోకూడిన బెంచ్‌ ‘అంచనా వేసిన కారు రిపేరు ఖర్చులో రూ.17,54,359కి మొత్తానికి 2014 నుంచి 7 శాతం వడ్డీ, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ. 10వేలు’ 30 రోజుల్లో చెల్లించాలని తీర్పును వెలువరించింది.

Updated Date - 2021-02-28T15:05:27+05:30 IST