కార్ల దొంగ చిక్కాడు

ABN , First Publish Date - 2022-07-01T06:09:12+05:30 IST

అద్దెకు కార్లను తీసుకుని నకిలీ డాక్యుమెంట్లతో వాటిని అమ్మేస్తున్న పాడేరుకు చెందిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

కార్ల దొంగ చిక్కాడు
ప్రధాన నిందితుడు మణికంఠ, స్వాధీనం చేసుకున్న నాలుగు కార్లతో పోలీసు అధికారులు

- కార్లను అద్దెకు తీసుకుని కొన్ని విక్రయం, మరికొన్ని తాకట్టు

- అద్దె చెల్లించకపోవడంతో వాహన యజమానుల ఫిర్యాదు

- పోలీసుల దర్యాప్తులో గుట్టురట్టు

- ప్రధాన నిందితుడి అరెస్టు

- నాలుగు కార్లు స్వాధీనం

- ముఠాలోని సభ్యుల కోసం గాలింపు


అద్దెకు కార్లను తీసుకుని నకిలీ డాక్యుమెంట్లతో అమ్మేయం లేదా తాకట్టు పెట్టే ముఠా గుట్టు రట్టయింది. విశాఖలో ఇదే తరహా మోసాలకు పాల్పడి మన్యంలోనూ కార్యకలాపాలు సాగిస్తున్న ముఠా సూత్రధారిని పోలీస్‌ ప్రత్యేక బృందాలు చాకచక్యంగా పట్టుకున్నాయి. అతని నుంచి నాలుగు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.


పాడేరు, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): అద్దెకు కార్లను తీసుకుని నకిలీ డాక్యుమెంట్లతో వాటిని అమ్మేస్తున్న పాడేరుకు చెందిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం అతనిని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌ విధించడంతో విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరు పట్టణం గుడివాడ వీధికి చెందిన మణికంఠ అనే యువకుడు ఓ కంపెనీకి  కార్లు అద్దెకు కావాలని చెప్పి తెలిసిన వాళ్ల వద్ద నుంచి కార్లు తీసుకున్నాడు. వాటికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొన్ని విక్రయించగా, మరికొన్ని తాకట్టు పెట్టాడు. అయితే కొన్నాళ్లుగా అద్దె చెల్లించకపోవడం, తమ వాహనాలు ఎక్కడున్నాయో కూడా సమాచారం చెప్పకపోవడంతో పాటు మణికంఠ పరారీలో ఉండడంతో కార్ల యజమానులకు అనుమానం వచ్చింది. తమకు జరిగిన అన్యాయంపై బాఽధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేయగా, స్థానిక సీఐ సుధాకర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. పరారీలో ఉన్న మణికంఠను చాకచక్యంగా పట్టుకుని అతను తాకట్టు పెట్టిన నాలుగు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ముఠాలో మరికొంత మంది సభ్యులు ఉన్నారని తెలుసుకుని వారి కోసం గాలిస్తున్నారు.  

మణికంఠ పాత నేరస్థుడే..

పాడేరుకు చెందిన మణికంఠ కార్లను అద్దెకు తీసుకుని, ఇతరులకు అమ్మేసిన రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని స్థానికులు తెలిపారు. గతంలో విశాఖపట్నంలో ఉంటూ ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీకి కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నానని అందర్నీ నమ్మించి వందల సంఖ్యలో కార్లను అద్దెకు తీసుకుని పలువురికి వాటిని అమ్మేసిన వ్యవహారంలో వైజాగ్‌ త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదుకాగా, ఇటీవల అటువంటి వ్యవహారంలో అతనిపై గాజువాకలో మరో కేసు నమోదైంది. కానీ మణికంఠ వ్యవహార శైలిలో ఎటువంటి మార్పురాలేదని, పలువురు యువకుల్ని ఒక ముఠాగా చేసి ఈ వ్యవహారం నడుపుతున్నాడని బాధితులు తెలిపారు. అతనిముఠా సభ్యులు కూడా పట్టుబడితే మరిన్ని విషయాలు తెలుస్తాయని వారు చెబుతున్నారు. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ల వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. 


వాహనాలు కొనే ముందు జాగ్రత్త

వాహనాలను కొనే ముందు జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్లు పక్కాగా లేకుండా ఎవరూ ఎటువంటి వాహనాలను కొనకూడదు. పలువురు అద్దెకని తీసుకువచ్చినవి, చోరీ చేసిన కార్లను సైతం అమ్మేసే అవకాశాలున్నాయి. అందువల్ల తక్కువ ధరకు వస్తున్నాయని నకిలీ డాక్యుమెంట్లతో లేదా డాక్యుమెంట్లు లేకుండా వాహనాలను కొనకూడదు. వాటిని అమ్మేవాళ్లతోపాటు కొనుక్కున్న వ్యక్తులపై సైతం చట్టపరంగా చర్యలు చేపడతాం. ఎవరైనా తప్పుడు విఽధానంలో వాహనాల అమ్మకానికి లేదా తాకట్టుకు ప్రయత్నిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

- బి.సుధాకర్‌, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, పాడేరు

Updated Date - 2022-07-01T06:09:12+05:30 IST