ఇక కార్డు లావాదేవీలు మరింత భద్రం

ABN , First Publish Date - 2022-09-30T06:34:35+05:30 IST

క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులకు మరింత రక్షణ కల్పించేందుకు ఆర్‌బీఐ ప్రకటించిన టోకెనైజేషన్‌ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది.

ఇక కార్డు లావాదేవీలు మరింత భద్రం

రేపటి నుంచే టోకెనైజేషన్‌


ముంబై : క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులకు మరింత రక్షణ కల్పించేందుకు ఆర్‌బీఐ ప్రకటించిన టోకెనైజేషన్‌ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. టోకెనైజేషన్‌ వల్ల స్వల్పకాలంలో కార్డు లావాదేవీలు తగ్గడంతో పాటు కంపెనీలకు ఆదాయ నష్టం కూడా ఏర్పడవచ్చవంటూ ఆ ప్రక్రియ అమలుపరిచేందుకు మరింత గడువు ఇవ్వాలని బ్యాంకర్లు, వ్యాపారులు కూడా కోరుతున్నారు. అయినప్పటికీ ఆర్‌బీఐ ఇంతవరకు సానుకూలంగా స్పందించలేదు. పెద్ద వ్యాపారులు కొంతమేరకు కొత్త విధానానికి కట్టుబడడానికి సిద్ధమైనప్పటికీ చిన్న వ్యాపార సంస్థలు మరింత గడువు కోరుతున్నాయి. మూడేళ్ల క్రితం కార్డు డేటాకు రక్షణ కల్పించే దిశగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకర్లు, వ్యాపారుల అభ్యర్థనల మేరకు పలు విడతలుగా వాయిదా వేసిన అనంతరం ఈ ఏడాది అక్టోబరు 1వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. ఆర్‌బీఐ నిర్ణయం ప్రకారం సెప్టెంబరు 30వ తేదీ నాటికే కార్డులను టోకెనైజ్‌ చేయాలి. 


టోకెనైజేషన్‌ అంటే ఏమిటి..?:ఈ ప్రక్రియలో ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో కస్టమర్‌ కార్డు వివరాలను వ్యాపారులు భద్రపరచడానికి వీలు లేదు. ఇప్పటివరకు తాము స్టోర్‌ చేసిన కస్టమర్‌ డేటాను కూడా తొలగించాల్సి ఉంటుంది. కార్డు డేటా భౌతికంగా భద్రపరిచేందుకు బదులుగా ఆల్గోరిథమ్‌ ఆధారిత కోడ్‌ ద్వారా వివరాలు స్టోర్‌ అయి ఉంటాయి. దీన్నే టోకెన్‌గా కూడా వ్యవహరిస్తారు. దీని వల్ల కస్టమర్‌ డేటాకు పూర్తి భద్రత కలుగుతుంది.


వ్యాపారులేమంటున్నారు...? : తాము ఇంకా సిద్ధంగా లేకపోవడం వల్ల స్వల్పకాలంలో తమకు ఆదాయ నష్టం ఏర్పడుతుందన్నది వ్యాపారుల వాదం. ఈ టోకెనైజేషన్‌తో బోర్డు ఆధారిత లావాదేవీలు కూడా తగ్గే ఆస్కారం ఉందంటున్నారు. గతంలో కూడా టోకెనైజేషన్‌ గడువు సమీ పిస్తున్న సమయంలో కార్డు చెల్లింపులు 15ు పడిపోయిందన్న విషయం వారు గుర్తు చేశారు. 


Updated Date - 2022-09-30T06:34:35+05:30 IST