నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం

Published: Fri, 23 Sep 2022 01:05:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం

హెల్మెట్‌ ధారణపై ద్విచక్ర వాహన చోదకుల్లో అలసత్వం

 ఈ ఏడాది ఇప్పటివరకూ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 157 ద్విచక్ర వాహనచోదకులు మృతి

....అందులో హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల చనిపోయినవారి సంఖ్య 37

నగర పోలీసుల అధ్యయనంలో వెల్లడి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రస్తుతం చిన్నా,పెద్దా అంతా అడుగుతీసి అడుగు వేయడానికి ద్విచక్ర వాహనాన్ని వినియోగిస్తున్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొందరు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హెల్మెట్‌ ధరించకపోవడం, ధరించినా క్లిప్‌ సరిగా పెట్టుకోకపోవడం వల్ల ఈ ఏడాది ఇప్పటివరకూ 37 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసుల అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ద్విచక్ర వాహనదారులు నిర్లక్ష్యం వీడాలని, వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని పోలీసులు కోరుతున్నారు. 

నగర రోడ్లపై ప్రతిరోజూ పది లక్షలకుపైగా ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మార్కెట్‌కు, కార్యాలయాలు, సినిమాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అత్యధికులు ద్విచక్ర వాహనాన్నే ఉపయోగిస్తున్నారు. అయితే స్పీడ్‌ను నియంత్రించలేకపోవడం, రోడ్ల దుస్థితి కారణంగా బ్యాలెన్స్‌ తప్పడం, తొందరగా గమ్యం చేరాలనే ఆత్రుతలో ఎక్కువ మంది ప్రమాదాల బారినపడుతున్నారు. ఆ సమయంలో తలకు రోడ్డు తగలడం లేదంటే పక్క నుంచి వెళ్లే వాహనాలు మీదకు దూసుకురావడం వంటి ఘటనలకు ఆస్కారం ఉంటుంది. ద్విచక్ర వాహనాలపై వెళుతూ ఎవరైనా ప్రమాదానికి గురైతే తలకు దెబ్బ తగిలే అవకాశం 50 శాతం ఉంటే...శరీరంలోని ఇతర భాగాలకు దెబ్బతగిలే అవకాశం 50 శాతం వుంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. తలకు దెబ్బ తగిలిన వారిలో ప్రాణాపాయం 95 శాతం ఉంటుంది కాబట్టి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అందుకు హెల్మెట్‌ ధరించడం ఒక్కటే మార్గమంటున్నారు. ద్విచక్ర వాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్‌ పెట్టుకోవడం వల్ల సురక్షితంగా గమ్యం చేరేందుకు అవకాశం వుంటుందని పేర్కొంటున్నారు.


జుట్టు చెదిరిపోతుందని హెల్మెట్‌ను పక్కనపెట్టేస్తున్న వైనం

జుట్టు చెదిరిపోతుందని కొందరు, చెమటపట్టి త్వరగా జుట్టు రాలిపోతుందని మరికొందరు హెల్మెట్‌ ధరించడానికి ఇష్టపడడం లేదు. పోలీసులు కేసు పెడుతున్నారనే భయంతో కొంతమంది హెల్మెట్‌ను వెంట తీసుకువెళుతున్నా తలకు పెట్టుకోకుండా ట్యాంకుపై పెట్టుకుని వాహనం నడుపుతున్నారు. మరికొందరైతే కేసులు బాధ లేకుండా పోలీసుల కళ్లు గప్పేందుకు తలపై హెల్మెట్‌ పెడుతున్నా, క్లిప్‌ను మాత్రం పెట్టుకోవడం లేదు. ఇదే ప్రాణాలకు ముప్పుగా మారుతోంది.   నగరంలో ఈ ఏడాది ఇప్పటివరకూ రోడ్డుప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులు 157 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 632 మంది క్షతగాత్రులయ్యారు. మృతిచెందిన వారిలో 25 మంది  హెల్మెట్‌ లేకపోవడం వల్ల, మరో ఇద్దరు హెల్మెట్‌ పెట్టుకున్నా క్లిప్‌ పెట్టుకోకపోవడంతో తలకు గాయమై మృతిచెందారు. మరో ఎనిమిది మంది ప్రమాదం జరిగినప్పుడు తమతోపాటు హెల్మెట్‌ కలిగివున్నా ధరించకుండా ట్యాంక్‌పై పెట్టినట్టు పోలీసుల అధ్యయనంలో తేలింది. 

 

అవగాహన కల్పిస్తున్నాం

సీహెచ్‌ శ్రీకాంత్‌, నగర పోలీస్‌ కమిషనర్‌

రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్న వారితోపాటు గాయపడుతున్న వారిలో అత్యధికం ద్విచక్ర వాహనదారులే ఉంటున్నారు. ప్రమాదానికి గురైనా కొంతమంది హెల్మెట్‌ పెట్టుకోవడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు. హెల్మెట్‌ లేకపోవడం వల్లే 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ ధారణపై అవగాహన పెంచే కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నాం. హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపే వారిని ఆపి ఇంటికి వెళ్లి తీసుకురావలసిందిగా పంపిస్తున్నాం. అసలు హెల్మెట్‌ లేనివారైతే కొనుక్కొని వచ్చిన తర్వాతే బైక్‌ ఇస్తున్నాం. బీట్‌ కానిస్టేబుళ్లతోపాటు సీసీ కెమెరాల ద్వారా కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ నుంచి ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం. 


ఈ ఏడాది ఇప్పటివరకూ రోడ్డు ప్రమాద మృతులు 255

గాయపడినవారు 977

మృతుల్లో ద్విచక్ర వాహనదారులు 157

గాయపడినవారిలో ద్విచక్ర వాహనదారులు 632

హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల మృతిచెందినవారు 27

హెల్మెట్‌ ధరించినా క్లిప్‌ పెట్టకపోవడం వల్ల మృతిచెందినవారు ఇద్దరు

హెల్మెట్‌ ఉన్నా తలకు పెట్టుకోకుండా ట్యాంక్‌పై పెట్టడం వల్ల మృతిచెందినవారు 8 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.