కమ్మేస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-04-23T04:53:04+05:30 IST

రెండో దశలో కరోనా వైరస్‌ దడ పుట్టిస్తోంది..

కమ్మేస్తున్న కరోనా
మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రి ఆవరణలోని ట్రయాజ్‌ ఏరియా వద్ద గుంపులుగా ఉన్న జనం

- రెండో దశలో ప్రజలపై విరుచుకుపడుతున్న మహమ్మారి

- ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో తీవ్రమైన వ్యాప్తి

- టెస్టులు పెంచే కొద్దీ పెరుగుతున్న బాధితులు

- హెల్త్‌ బులిటెన్‌ను నిలిపి వేసిన అధికారులు

- నారాయణపేట జిల్లాలో నామమాత్రంగా వైద్య సేవలు

- జోగుళాంబ గద్వాల జిల్లాలో అదనంగా బెడ్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు

- పాలమూరు కొవిడ్‌ సెంటర్‌ వద్ద సౌకర్యాలు కరువు

- స్వాబ్‌ తీసుకునే ప్రాంతంలో కొరవడిన జాగ్రత్తలు


మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం)/గద్వాల టౌన్‌/నారాయణపేట క్రైం, ఏప్రిల్‌ 22 : రెండో దశలో కరోనా వైరస్‌ దడ పుట్టిస్తోంది.. ఈ నెల 7వ తేదీ నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలపై ముప్పేట దాడి చేస్తోంది.. ఊహకందని విధంగా ఒకరి నుంచి మరొకరికి దీని వ్యాప్తి వేగంగా జరుగుతోంది.. కొవిడ్‌ పరీక్షలు చేయించుకుంటున్న వారిలో సగం మందికి వైరస్‌ నిర్ధారణ అవుతోంది.. అందులో ర్యాపిడ్‌ టెస్టుల్లోనే పాజిటివ్‌ కేసులు ఎక్కువగా వస్తుండగా, ప్రజల నిర్లక్ష్యం వల్లే కేసులు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.. దీనికితోడు కరోనా పరీక్షలు చేసే కేంద్రాల వద్ద కూడా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా టెస్టులు చేస్తుండటంతో వైరస్‌ వ్యాప్తి మరింత ఎక్కువ అవుతోంది..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య చూస్తే ఏప్రిల్‌లోనే విపరీతంగా పెరిగాయి. మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు 90 లోపే కేసులు వచ్చాయి. కానీ, 7వ తే దీ నుంచి కేసుల సంఖ్య పెరిగింది. ఒక్కసారిగా 200 కేసు లతో ప్రారంభమై రోజుకు 550 నుంచి 730 వరకు కేసులు వస్తున్నాయి. 17న ఒకే రోజు 607 మందికి వైరస్‌ నిర్ధార ణ అయ్యింది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ పాజిటివ్‌ కేసుల బులెటిన్‌ను నిలిపి వేసింది. రోజుకు 200లోపే కేసులు వస్తున్నాయని అధికారికంగా చూపిస్తోంది.


పెరిగిన టెస్టులు

మార్చి నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు రోజుకు 1,200 వరకు కరోనా టెస్టులు చేసే వారు. ఆ తరువాతి రోజు నుంచి టెస్టులు చేయడం పెంచారు. అప్పటి నుంచి ఇప్ప టి వరకు రోజుకు ర్యాపిడ్‌ టెస్టులు 2,800, ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు రోజుకు 90లోపు చేస్తున్నారు. చేసే టెస్టుల్లో 40 శాతం పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. 


ర్యాపిడ్‌ టెస్టుల్లోనే పాజిటివ్‌లు 

ఇది వరకు ర్యాపిడ్‌ టెస్టుల్లో పాజిటివ్‌ కేసులు పెద్దగా వచ్చేవి కావు. దాదాపు వంద టెస్టులు చేస్తే ఐదు మందికి మాత్రమే పాజిటివ్‌ వచ్చేది. ప్రస్తుతం వంద టెస్టులు చేస్తే 60 మందికి పాజిటివ్‌ వస్తోంది. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు చేస్తే దాని ఫలితం రెండు రోజుల్లో వస్తుంది. అదే ర్యాపిడ్‌ టెస్టు చేస్తే కేవలం పది నిముషాల్లో ఫలితం చూపిస్తుం ది. వైరస్‌ శరీరంలో ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ర్యాపిడ్‌ టెస్టుల్లోనే బయట పడుతుందని, అందు వల్ల ర్యాపిడ్‌ చేసుకున్న ప్రతి ఒక్కరిలో పాజిటివ్‌ వస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే వైరస్‌ గాలిలో కలిసిపోయిందని తెలుస్తోంది.


కనీస సౌకర్యాలు లేక మరింత వ్యాప్తి

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఆవరణ లోని కొవిడ్‌ సెంటర్‌ ముందు ఆర్‌టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ టె స్టులు చేస్తున్నారు. ముందుగా టెస్టులు చేయించుకునే వా రు డాక్టరుతో చూపించుకొని రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ట్రయాజ్‌ ఏరియాను ఏర్పాటు చేశారు. అయితే, ఆ ప్రాం తంలో జనం ఒకరి వెనక మరొకరు బారులు తీరుతున్నా రు. భౌతిక దూరం పాటించడం లేదు. ఒకరినొకరు తాకు కుంటూ, తోపులాట మధ్యలో రిజిస్ర్టేషన్‌ చేయించుకుంటు న్నారు. స్వాబ్‌ తీసే ప్రాంతంలో కూడా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా టెస్టులు చేస్తున్నారు. కూర్చోవడానికి బెంచీ లు, కుర్చీలు, భౌతిక దూరం పాటించే వ్యవస్థ లేదు. ఆర్‌ టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ టెస్టులకు సంబంధించిన స్వాబ్‌లు ఒకే చోట తీస్తున్నారు. దీని వల్ల ఆ ప్రాంతంలో వైరస్‌ వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. వైరస్‌ ఉన్నవాళ్లు, లే ని వాళ్లు అనే తేడా లేకుండా అందరూ ఒకే చోట ఉంటు న్నారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే వైరస్‌ మరింత వ్యా పించే అవకాశం ఉంది.

నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందటం లేదు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేస్తు న్నారు. హైదరాబాద్‌, మహారాష్ట్ర ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు, తిరిగి స్వగ్రామాలకు వస్తుండటంతో అధికారులు వారికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజూ 50 నుంచి 120 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అవుతోంది. కాగా, జిల్లా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డును అప్పట్లో ఐసోలేషన్‌ వార్డుగా 10 బెడ్లతో ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకిన వారిని ఈ వార్డులో అధికారులు ఉంచడం లేదు. దీంతో ఈ వార్డు నిరుపయోగంగా మారింది. వైరస్‌ బారిన పడి ఇంటి వ ద్ద ఉండలేని వారిని నారాయణ పేట మండలం సింగారం చౌర స్తాలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తున్నారు. కాగా, ధన్వాడ మం డలంలో శుక్రవారం నుంచి పాక్షిక లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు పంచాయతీ అధికారులు టాంటాం వేయించారు.


గర్భిణికి పాజిటివ్‌

మద్దూరు మండలం జాదవ్‌రావుపల్లి గ్రామానికి చెందిన ఓ గ ర్భిణి ప్రసవం కోసం గురువారం జిల్లా ఆసుపత్రికి వచ్చింది. ఆ మెకు వైద్యులు కరోనీ పరీక్షలు చేయగా పాజిటివ్‌ రావడంతో, మహబూబ్‌నగర్‌కు రేఫర్‌ చేశారు.

జోగుళాంబ గద్వాల జిల్లాలో కూడా కరోనా కేసులు రోజు రోజుకు అధికమవుతున్నాయి. అయితే, జిల్లా ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో బెట్ల కొరత లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్డులో 40 బెట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరో 30 బెడ్లు ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రంగా ఏర్పాటు చేసిన పీజీ కేం ద్రంలో అందుబాటులో ఉన్నాయని కొవిడ్‌ ఇన్‌చార్జి శశికళ తెలిపారు. కరోనాతో చికిత్స పొందుతున్న రోగులకు రోజు వారీగా ఆరు సిలిండర్ల మేరకు ఆక్సిజన్‌ అందిచాల్సి ఉండగా, ప్రస్తుతం 70 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

Updated Date - 2021-04-23T04:53:04+05:30 IST