..అదే కారణభూతం

ABN , First Publish Date - 2021-04-22T05:32:03+05:30 IST

..అదే కారణభూతం

..అదే కారణభూతం
బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

అధికారులూ.. నాటి ఆంక్షలు నేడేవీ?

ప్రజలూ.. నాటి నియమాలు నేడు మరిచారా?

జిల్లాలో కనిపించని కరోనా నిబంధనలు

కంటైన్‌మెంట్‌ జోన్లు లేవు, యాక్టివ్‌ జోన్లు అసలే లేవు

ప్రాణభయంతో బయట తిరిగేస్తున్న బాధితులు

ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి

అంతకంతకూ పెరుగుతున్న కేసులు, మరణాలు

నాడు : కరోనా వచ్చిన ఇంటిపై ప్రత్యేక దృష్టి.. వీధి మొత్తం శానిటైజేషన్‌.. అంబులెన్సులో ఆస్పత్రికి తరలింపు.. 14 రోజులు కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు.. మాస్క్‌ ధరించడంతో పాటు భౌతిక దూరం తప్పక పాటించాలన్న కచ్చితమైన  నిబంధనలు..

నేడు : కరోనా ఏ ఇంట్లో వచ్చిందో తెలియని పరిస్థితి.. బాధితులు పక్కనే తిరుగుతున్నా గుర్తించలేని దుస్థితి.. శానిటైజేషన్‌కు చెల్లుచీటీ.. ఆస్పత్రిలో బెడ్‌ కూడా దొరకని దౌర్భాగ్యస్థితి.. కంటైన్‌మెంట్‌ జోన్లు లేవు.. 14 రోజుల ఆంక్షలు అసలే లేవు.. మాస్క్‌ ధారణ మొక్కుబడిగా సాగుతుంటే.. భౌతిక దూరం మచ్చుకు కూడా కనిపించట్లేదు..

..ఫలితంగా జిల్లాలో రోజురోజుకూ కరోనా తీవ్రత పెరగడమే కాదు.. అందుకనుగుణంగా మరణాల సంఖ్య ఉధృతంగా ఉండి ప్రమాదకర పరిస్థితులకు కారణమవుతోంది. 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో రోజూ దాదాపు 500 కరోనా కేసులు, పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా అధికారులు గతంలో మాదిరిగా కట్టడి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాదిరిగా కంటైన్‌మెంట్‌ జోన్లలో బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసే పరిస్థితి నేడు లేదు. వైరస్‌ బారిన పడుతున్న బాధితులను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లూ లేవు. సీరియస్‌ కండీషన్‌లో ఉన్న బాధితులు వారంతట వారే ప్రభుత్వాసుపత్రులకు వెళ్తున్నా అక్కడ బెడ్స్‌ ఖాళీ లేక వెనుదిరుగుతూ నగరమంతా చుట్టేస్తున్నారు. 

గతంలో మాదిరి చర్యలేవీ?

గతంలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసు నమోదయ్యాక ఐదు రోజుల వరకు ఆ ప్రాంతాన్ని వెరీ యాక్టివ్‌ జోన్‌గా గుర్తించేవారు. ఆరు నుంచి 14 రోజుల వరకు ఆ ప్రాంతాన్ని యాక్టివ్‌, బఫర్‌ జోన్లుగా ప్రకటించి ప్రజల రాకపోకలను నియంత్రించేవారు. ఆ 15 రోజుల్లో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకుంటేనే ఆంక్షలు ఎత్తివేసేవారు. ఇప్పుడు జిల్లావ్యాప్తంగా కరోనా కమ్మేసినా కంటైన్‌మెంట్‌ అనేదే లేదు. గతంలో కంటైన్‌మెంట్‌, బఫర్‌ జోన్లలో తొలుత కిలోమీటర్ల మేర విధించిన ఆంక్షలు ఇప్పుడు పాజిటివ్‌ కేసులు నమోదైన ఇంటికి కూడా వర్తించడం లేదు. మారిన చిత్రంతో అక్కడ కేసులు ఉన్నాయో, లేదో తెలుసుకోవడానికి కనీసం బ్లీచింగ్‌ చల్లించే నాథుడే ఉండట్లేదు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రజలు నిర్లక్యంగా వ్యవహరిస్తున్నారు. పాజిటివ్‌ బాధితులు కొందరు తమ అవసరాలకు, మరికొందరు నిర్లక్ష్యంతో బయట తిరిగేస్తున్నారు. దీంతో వైరస్‌ వ్యాప్తి ఆగట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పరిస్థితి చేయి దాటిపోతుందని అందరూ ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది విజయవాడతో పాటు మచిలీపట్నం, నూజివీడు డివిజన్ల పరిధిలోని పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు మారుమూల పల్లెల్లోనూ పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తుండటం, కుటుంబాలకు కుటుంబాలే కరోనాకు బలైపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.  

స్వీయ రక్షణే శరణ్యం 

స్వీయ రక్షణ  చర్యలతో కరోనా బారినపడకుండా బయటపడొచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. గత ఏడాది వచ్చిన కరోనా కంటే ప్రస్తుత సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉందని, చికిత్స అందించడానికి కూడా సమయం ఇవ్వకుండా ఇన్‌ఫెక్షన్‌ వేగంగా విస్తరిస్తుండటంతో పాజిటివ్‌ బాఽధితులు మూడు రోజుల్లోనే ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని చెబుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు కరోనా మరణాలు విపరీతంగా పెరగడానికి ఇదే కారణంగా పేర్కొంటున్నారు.




Updated Date - 2021-04-22T05:32:03+05:30 IST