కరోనా ఘంటికలు.. రోజు రోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2021-05-08T05:30:00+05:30 IST

కరోనా ఘంటికలు.. రోజు రోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌లు

కరోనా ఘంటికలు..  రోజు రోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌లు
శనివారం ఉదయం ఆరు గంటలకు ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌ ఎదుట క్యూ

ఎన్నికల తర్వాత ఉధృతమైన వైరస్‌ వ్యాప్తి

రాజకీయ శ్రేణుల్లో ప్రబలుతున్న కొవిడ్‌

ఖమ్మం, మే 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా మహ మ్మారి ప్రజలను పొట్టన పెట్టు కుంటోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పడగవిప్పి కాటేస్తోంది.  సెకండ్‌ వేవ్‌లో రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య ఏమాత్రం తగ్గటం లేదు. కరోనా పరీక్షల కోసం ప్రజలు ఆస్పత్రుల వద్ద బారులు తీరుతున్నారు. 

బాధితుల సంఖ్యకు సరిపోని సర్కారు పరీక్షలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా దవాఖానాలు, జిల్లా ఆస్పత్రిలో పరీ క్షల సంఖ్యకు పరిమితులు విధించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా రు. రూ.వేలు ఖర్చు చేసి ప్రైవేటు పరీక్షకేంద్రాలకు వెళ్లి నిర్ధారణ టెస్టులు చేయించుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్య, మధ్య తరగతి అనే వ్యత్యాసం లేకుండా అందరిపైనా కరోనా ప్రభావం చూపుతోంది. 

ఎన్నికల తర్వాత అధికం

వైఎస్‌ షర్మిల సభ తర్వాత తుఫాన్‌లా మెదలైన కరోనా.. కార్పొరేషన్‌ ఎన్నికలతో ఉప్పెనలా మారింది. ఖమ్మం జిల్లాలో 1500 మందికి పరీక్షలు చేస్తుంటే 500 పాజిటివ్‌ కేసులు కేవలం ప్రభుత్వ పీహెచ్‌సీలు, ఆస్ప త్రుల్లో నమోదవుతున్నాయి. అనధికారికంగా ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో నిర్వహిస్తున్న పరీక్షల్లో రోజుకు వెయ్యికి పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 

ఎక్కడ చూసినా వైరస్‌ వైద్యమే

జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో ఉన్న క్లినిక్‌లలో కూడా కరోనా బాధితులు కనిపిస్తున్నారు. అన్ని  స్థాయిల ఆస్పత్రుల్లోనూ కరోనా వైద్యమే కనిపిస్తోంది. పడకలు  అన్ని చోట్ల ఫుల్‌ అయ్యాయి. ఖమ్మం జిల్లాలో బాధితులతో పాటు పొరుగు జిల్లాల బాధితులు కూడా పెద్దఎత్తున జిల్లాకు తరలివస్తున్నారు. 

ప్రైవేటులో దోపిడీ

ఆస్పత్రుల్లో కరోనా వైద్యం కోసం చేరిన బాధితుల నుంచి ప్రైవేటువైద్యులు భారీగా సొమ్ములు గుంజుతు న్నారు. సిటి స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు, రక్తపరీక్ష కేంద్రాలు సైతం కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. ఖమ్మంలో నిత్యం సిటిస్కానింగ్‌ సెంటర్లలో కరోనా పరీక్షలు పగలు రాత్రి నిర్వహిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సిటిస్కానింగ్‌ లేకపోవడంతో ప్రైవేటు సెంటర్లపైనే ఆధార పడాల్సి వస్తోంది. దీంతో స్కానింగ్‌ సెంటర్లకు ప్రైవేటు ఆస్పత్రులకు కాసుల పంట పండుతోంది. 

రాజకీయ నేతల్లో అధికం

జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు ఇటీవల గెలుపొందిన పలువురు కార్పొరేటర్లు, మరికొంత మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్నారు. జిల్లా అధికారులను సైతం కరోనా వదిలిపెట్టడం లేదు. ఖమ్మం డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ నర్సింహారావు శనివారం కరోనాతో మృత్యువాత పడ్డారు. మరికొందరు అధికారులు కూడా కరోనాతో బాధ పడుతూ హోం ఐసోలేషన్‌లో వైద్య చికిత్సలు పొందుతున్నారు. షర్మిల సభ తరుణంలో సభకు హాజరైన జిల్లా పార్టీ నాయకులు, పలువురు పోలీసులు, జర్నలిస్టులు, ఆపార్టీ కార్యకర్తలు నాయకులు కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కోగా , కార్పొరేషన్‌ ఎన్నికల విధుల్లో పాల్గొన్న పొలీసులు, అధికారులు, ఉద్యోగులు సిబ్బంది పలువురు కౌంటింగ్‌కు వెళ్లిన సిబ్బంది కూడా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లు సైతం కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. 

అసత్యప్రచారాలు చేస్తే ఉపేక్షించేది లేదు: కలెక్టర్‌ కర్ణన్‌

ఖమ్మం కలెక్టరేట్‌ : కరోనా బారిన పడి తీవ్ర అస్వ స్థతకు గురైన రోగికి అవసరమైన రెమిడెసివర్‌ ఇంజక్షన్లు ఖమ్మం కలెక్టరేట్‌లో అందిస్తారంటూ వాట్సప్‌ గ్రూపుల్లో, సామాజిక మాధ్యమా ల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని ఇది వాస్తవం కాదని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు. గ్రూపుల్లో ఇలాంటి తప్పుడు వార్తలు వస్తే వాటిని ఇతరులకు పంపించవద్దని కలెక్టర్‌ సూచించారు. 

ప్రైవేట్‌లోనూ పడిగాపులు

ఆర్టీపీసీఆర్‌ పరీక్షల కోసం ఖమ్మంలో తెల్లవారుజాము నుంచే క్యూ

ఖమ్మం సంక్షేమవిభాగం : కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తుండటంతో టెస్టుల కోసం ప్రజలు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు ల్యాబ్‌ల వద్ద బారులు తీరుతున్నారు. ఖమ్మంలోని ల్యాబ్‌ల వద్ద ఉదయం 6గంటలకే పరీక్షల కోసం క్యూలో నిల్చుటుఉన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ర్యాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌, ట్రూనాట్‌ పరీక్షలు అందుబాటులో లేవు. కేవలం మొబైల్‌ వాహనాల ద్వారానే కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దీంతో తెల్లారుజామునుంచే టెస్టులు నిర్వహించే ప్రాంతాలకు కరోనా అనుమానితులు చేరుకుంటున్నారు. ఇలా గంటల కొద్ది ప్రైవేట్‌ ల్యాబ్‌ల వద్ద క్యూ ఉండి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఖమ్మంనగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా ఖమ్మంలో పాజిటివ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ కర్ణన్‌ ప్రత్యేకంగా జోక్యం చేసుకొని ఖమ్మంలో పరీక్షలు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

ఖమ్మం జిల్లాలో శనివారం మొత్తం 1417 పరీక్షలు చేయగా 495మందికి పాజిటివ్‌ వచ్చింది. 

భద్రాద్రి జిల్లా లో మొత్తం 1842 టెస్టులు చేయగా 284మందికి కొవిడ్‌ నిర్ధారణైంది.

Updated Date - 2021-05-08T05:30:00+05:30 IST