కరోనా.. హైరానా

ABN , First Publish Date - 2021-05-11T04:32:58+05:30 IST

కరోనా విలయతాండవం చేస్తోంది. గ్రామాలు, ఆదివాసీ పల్లెలు అనే తేడా లేకుండా విరుచుకుపడుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

కరోనా.. హైరానా
దొంగతోగులో కరోనా పరీక్షలు చేస్తున్న వైద్యులు

ఆదివాసీ పల్లెలు, గ్రామాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న వైరస్‌

ఆసుపాకలో 50 దాటిన కేసులు, ఏడూళ్లబయ్యారంలో ఒకే రోజు 13 మందికి పాజిటివ్‌

శుభకార్యాలే కారణం .. కేసులు పెరగుతున్నా ప్రజల్లో నిర్లక్ష్య ధోరణి

పినపాక/ అశ్వారావుపేట/ గుండాల మే 10: కరోనా విలయతాండవం చేస్తోంది. గ్రామాలు, ఆదివాసీ పల్లెలు అనే తేడా లేకుండా విరుచుకుపడుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

పినపాక మండలంలోని ఏడూళ్లబయ్యారం గ్రామపంచాయతీ పరిధిలో ఒకేరోజు 13 కేసులు నమోదయ్యాయి. పినపాక పిహెచ్‌సీలో సోమవారం 60 మందికి పరీక్షలు నిర్వహించగా 25 మందిలో పాజిటివ్‌ లక్షణాలున్నట్టు వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఇందులో ఒక్క బయ్యారం గ్రామం నుండే 13 కేసులు (పినపాక పీహెచ్‌సీలో 12, కరకగూడెం పీహెచ్‌సీ 1)నమోదయ్యాయి. దీంతో గ్రామంలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏడూళ్లబయ్యారంలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ విధిస్తే తప్ప కరోనా అదుపులోకి వచ్చే పరిస్థితి కనబడటం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఆసుపాకలో 50 కేసులు

ఫఅదో గిరిజన గ్రామం. మొత్తం 300లోపు కుటుంబాలు నివసిస్తుంటాయి. ఈ పల్లెల్లో ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు 50 దాటాయి. తెల్లవారితే ఏ విధమైన వార్తలు వినాలసి వస్తుందోననే ఆందోళనలో ప్రజలు ఉన్నారు.  గత ఏడాది  ఈ గ్రామంలో పట్టుపదని పది మంది కేసులు కూడా నమోదవ్వలేదు. వారం రోజుల నుంచి మాత్రం 52 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. గ్రామానికి చెందిన 19 మంది కూలీలుఉ మామిడికోతల కోసం ఆటోలో పాల్వంచ వెళ్లి వచ్చేవారు వీరందరికి పాజిటివ్‌ వచ్చింది. వీరితో పాటు వారి కుటుంబ సభ్యులకు చాలా మందికి కరోనా వచ్చింది. మరో కుటుంబం ఏపీలో ఓ వివాహానికి వెళ్లి వచ్చింది. ఈ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఇంకో వ్యక్తి పని నిమిత్తం ఏపీకి వెళ్లి నాలుగైదు రోజులపాటు ఉండి వచ్చాడు. ఆ కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్టు చెపుతున్నారు. సోమవారం కూడా మరో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఆయా కుటుంబాలతో కాంటాక్టులో ఉన్నవారికి మరెంత మందికి పాజిటివ్‌ వస్తుందో అనే ఆందోళన గ్రామస్థుల నెలకొంది. ఇప్పటికీ పల్లెల్లో పెద్దగా పట్టించుకోకుండా వందలాది మందితో శుభకార్యాలు చేస్తూనే ఉన్నారు. చాలా మంది కనీస అనుమతులు కూడా తీసుకోవడం లేదు. 

గుండాలలో కరోనా విలయ తాండవం

ఫగుండాల మండలంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనాతో మండలంలో ఇప్పటికే నలుగురు మృత్యువాత పడగా, సోమవారం గుండాల పీహెచ్‌సీలో 15 మందికిపరీక్షలు నిర్వహించగా, 10 మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యుడు రవిచంద్‌ తెలిపారు. గ్రామాల్లో సైతం కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో, ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆళ్లపల్లి మండలంలోని దొంగతోగులో గుండాల పీహెచ్‌సీ వైద్యులు రవిచంద్‌ వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించగా, 10 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మండలంలోని దేవళ్లగూడెంలో 40 మందికి పాజిటివ్‌ రాగా, గుండాలలో 30కి పైగా పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. ప్రజలు ముందుకు వస్తున్నా వైద్యులు సరిపడ లేకపోవడంతో పరీక్షల సంఖ్య తగ్గుతోంది.


Updated Date - 2021-05-11T04:32:58+05:30 IST