ఊపిరి పీల్చుకో..

ABN , First Publish Date - 2021-06-12T05:46:18+05:30 IST

ఊపిరి పీల్చుకో..

ఊపిరి  పీల్చుకో..

ఆసుపత్రుల్లో ఖాళీలేని బెడ్లు.. క్యూలో అంబులెన్సుల ఎదురుచూపులు.. ఆక్సిజన్‌ అందక ఊపిరి ఆగిన ప్రాణాలు.. నెలరోజుల కిందట జిల్లాలో పరిస్థితి ఇది. ఒక్క బెడ్‌ దొరికితే చాలు.. ఊపిరి పీల్చుకోవచ్చనుకునే దుర్భర రోజుల నుంచి జిల్లా క్రమంగా బయటపడుతోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో వందల బెడ్స్‌ ఖాళీగా ఉండటం కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతుందనే సంకేతాన్ని ఇస్తోంది. 

ప్రభుత్వ, ప్రైవేట్‌ కొవిడ్‌ ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ 

సగానికి సగం తగ్గిన కరోనా పాజిటివ్‌ శాతం

పెరుగుతున్న డిశ్చార్జులు

జీజీహెచ్‌లో అందుబాటులోనే అన్ని బెడ్లు

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ సగానికి సగం ఖాళీ

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కల్లోలం సృష్టిస్తూ జనజీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి పక్షం రోజులుగా తగ్గుముఖం పట్టింది. మే 25వ తేదీ ముందు వరకు రోజువారీగా పాజిటివ్‌ కేసులు 1,000 నుంచి 1,500 మధ్య నమోదు కాగా, ఇప్పుడు వాటి సంఖ్య 500లోపే ఉంటోంది. కొత్తగా వెలుగుచూసే కరోనా కేసులు గణనీయంగా తగ్గిపోవటంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ కొవిడ్‌ ఆసుపత్రుల్లో సాధారణ పడకలతో పాటు ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్స్‌ కూడా ఖాళీగానే ఉంటున్నాయి. గత నెలలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కొవిడ్‌ ఆసుపత్రులన్నీ పాజిటివ్‌ బాధితులతో కిటకిటలాడిన సంగతి తెలిసిందే. దాదాపు 1,000 పడకల సామర్థ్యంతో జిల్లా ప్రజలకు పెద్దదిక్కుగా ఉన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క ఆక్సిజన్‌ బెడ్‌ కూడా దొరకని స్థితి ఏర్పడింది. ఆసుపత్రి బయట అంబులెన్సులు, ఆటోలు, కార్లలోనే మూడు నాలుగు రోజులు నిరీక్షించిన ఘటనలు, చివరికి ఆక్సిజన్‌ అందక మృతిచెందిన సంఘటనలు చూశాం. ఇప్పుడు అలాంటి పరిస్థితులేమీ లేవు. వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. మరోవైపు డిశ్చార్జులు పెరగడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే శుక్రవారం 112 ఆక్సిజన్‌ బెడ్స్‌, 23 సాధారణ పడకలు ఖాళీగా ఉన్నాయి. దీంతో చికిత్స కోసం జీజీహెచ్‌కు వస్తున్న కరోనా పాజిటివ్‌ బాధితులకు వెంటనే పడకలు కేటాయిస్తూ చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గన్నవరంలోని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో 100 ఆక్సిజన్‌ బెడ్స్‌, మరో 190 సాధారణ పడకలు ఖాళీగానే ఉన్నాయి. ఇబ్రహీంపట్నంలోని నిమ్రా హాస్పిటల్‌లో ఐసీయూ బెడ్స్‌ 17, ఆక్సిజన్‌ బెడ్స్‌ 32, మరో 324 సాధారణ బెడ్స్‌ ఖాళీ అయిపోయాయి. మచిలీపట్నంలోని జిల్లా ఆసుపత్రి, గుడివాడ, నూజివీడుల్లోని ఏరియా ఆసుపత్రులు, అవనిగడ్డ, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, కైకలూరు, గూడూరుల్లోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా సాధారణ బెడ్స్‌తో పాటు ఆక్సిజన్‌ బెడ్స్‌ పదుల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కావాల్సినన్ని బెడ్స్‌ ఖాళీగా ఉండటంతో ప్రైవేట్‌ కొవిడ్‌ ఆసుపత్రులు దాదాపు ఖాళీగానే ఉంటున్నాయి. 

సగం వరకు ప్రైవేట్‌ కొవిడ్‌ ఆసుపత్రుల అనుమతులు రద్దు చేసినా.. 

సెకండ్‌ వేవ్‌లో కరోనా ఉధృతి ఊహించని విధంగా పెరగడంతో పాజిటివ్‌ బాధితుల తాకిడిని తట్టుకోలేక జిల్లావ్యాప్తంగా 80కి పైగా ప్రైవేట్‌ ఆసుపత్రులకు కొవిడ్‌ చికిత్స అందించేందుకు జిల్లా యంత్రాంగం అనుమతులు ఇచ్చింది. పక్షం రోజులుగా జిల్లాలో వైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గడం, రోజువారీ వెలుగుచూస్తున్న కేసులు మూడో వంతుకు పడిపోవడంతో ప్రైవేట్‌ ఆసుపత్రులకు తాకిడి తగ్గిపోయింది. దీంతో జిల్లాలో అనుమతులు పొందిన 37 ప్రైవేట్‌ ఆసుపత్రుల (దాదాపు సగం) అనుమతులను రద్దు చేశారు. అయినా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పడకలు ఖాళీగానే ఉంటున్నాయి. 

కొవిడ్‌ కేర్‌ కేంద్రాలూ ఖాళీనే.. 

స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కరోనా బాధితుల కోసం జిల్లాలో ఆరు కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. గన్నవరం మండలం గూడవల్లిలో రెండు, విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌, జక్కంపూడి కాలనీ, మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ తదితర ప్రాంతాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో 3,036 పడకలు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 100 మంది బాధితులు కూడా లేరు. కొత్త బాధితుల్లో సీరియస్‌గా ఉంటున్నవారు ఆసుపత్రులకు వెళ్తుండగా, మిగిలిన వారంతా హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. దీంతో కరోనా బాధితులు లేక జిల్లాలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్లన్నీ దాదాపు ఖాళీగానే ఉన్నాయి. 





Updated Date - 2021-06-12T05:46:18+05:30 IST