క్యాష్‌ కరోనా

ABN , First Publish Date - 2021-04-17T05:11:51+05:30 IST

క్యాష్‌ కరోనా

క్యాష్‌ కరోనా

కొవిడ్‌నూ వదలని రాజకీయ నాయకులు

మంత్రి అండతో నగరంలో భారీగా బెట్టింగ్‌లు

మే 2 నుంచి లాక్‌డౌన్‌ అంటూ ప్రచారం

పదో తరగతి పరీక్షలపైనా పైసా వసూల్‌

మొత్తం బెట్టింగ్‌ విలువ రూ.10కోట్లపైనే..

ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ పైశాచికం

ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ పైసా వసూల్‌కు శ్రీకారం చుట్టారు మన రాజకీయ పెద్దలు. ఓవైపు కరోనా సెకండ్‌ వేవ్‌ బీభత్సం సృష్టిస్తుంటే బెట్టింగులకు బరి తెగించారు. మే 2 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పెడతారా, లేదా అని కొందరు, పదో తరగతి పరీక్షలు జరుగుతాయా, లేదా అని మరికొందరు బెట్టింగ్‌లు కడుతున్నారు. జిల్లాకు చెందిన మంత్రి అనుచరులే సూత్రధారులుగా నడుస్తున్న ఈ దందా విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం.

విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఇప్పటివరకు ఐపీఎల్‌ మ్యాచ్‌లపై బెట్టింగులనే చూశాం. ప్రస్తుతం నగరంలో దానికి మించి కరోనా లాక్‌డౌన్‌, టెన్త్‌ ఎగ్జామ్స్‌ బెట్టింగ్‌ దందా సాగుతోంది. వారం పది రోజులుగా కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉంది. కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో పరిస్థితి భయానకంగా మారింది. ఈ వాతావరణాన్ని బెట్టింగ్‌ బుకీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మే 2 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పెడతారని బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ పెడతారని రూపాయి బెట్టింగ్‌ కాస్తే.. రూ.2లు ఇస్తామని చెబుతున్నారు. దీంతో బెట్టింగ్‌ బంగార్రాజులు పోటీలు పడి మరీ బెట్టింగ్‌ కడుతున్నారు. వన్‌టౌన్‌కు చెందిన ఓ వ్యాపారి మే మొదటివారంలో లాక్‌డౌన్‌ ఉంటుందని సుమారు రూ.10 లక్షలు బెట్టింగ్‌ కట్టినట్టు సమాచారం. లాక్‌డౌన్‌ పెడితే ఆ వ్యాపారికి రూ.20 లక్షలు వస్తాయి, లేకుంటే రూ.10 లక్షలు పోతాయి. లాక్‌డౌన్‌పైనే ఒక్క బెజవాడ నగరంలోనే రూ.కోట్లలో బెట్టింగ్‌ జరిగినట్లు సమాచారం. 

‘పది’పైనా పైసలు

పదో తరగతి పరీక్షల రద్దుపైనా జోరుగా బెట్టింగ్‌ నడుస్తోంది. జూన్‌ 7 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే, పరీక్షలు రద్దవుతాయని కొందరు, వాయిదా పడతాయని మరికొందరు బెట్టింగ్‌లు కట్టినట్లు తెలుస్తోంది. రద్దవుతాయని కాసేవారికి రూపాయికి రూ.2 ఇస్తామని, వాయిదా పడుతాయనే వారికి రూపాయికి రూ.5 ఇస్తామని బుకీలు చెబుతున్నారు. దీంతో పదో తరగతి పరీక్షలపైనా రూ.కోట్లలో బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ఐపీఎల్‌ బెట్టింగ్‌లు కాసే వారినే ఈ బెట్టింగ్‌లకూ ప్రోత్సహిస్తున్నారు. 

మంత్రి అనుచరులే సూత్రధారులు

వన్‌టౌన్‌కు చెందిన ఓ హోటల్‌ కేంద్రంగా మంత్రి అనుచరులు కొందరు ఈ బెట్టింగ్‌ దందా నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కరోనా సమయంలో ఆసుపత్రుల్లో బెడ్లు అమ్ముకుని, పీసీడీ (ప్రాపగాండ కమ్‌ డిస్ట్రిబ్యూషన్‌) మందులు విక్రయించి రూ.కోట్లు గడించిన ‘బుజ్జి’బాబే క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఓ కార్పొరేటర్‌ భర్తతో కలిసి బెట్టింగ్‌ దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం. జిల్లా నుంచే కాకుండా గుంటూరు, పశ్చిమ గోదావరి నుంచి కూడా బెట్టింగ్‌ బాబులను ఆకర్షించి వీరు బెట్టింగ్‌ దందాను సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దందా విలువ సుమారు రూ.10కోట్లపైనే ఉండొచ్చని సమాచారం.

Updated Date - 2021-04-17T05:11:51+05:30 IST