ఫిషింగ్‌ హార్బర్‌కు కరోనా బ్రేక్‌

ABN , First Publish Date - 2020-08-08T09:46:15+05:30 IST

రసాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద ప్రతిపాదించిన మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌ పనులకు తాత్కాలికంగా బ్రేక్‌ ..

ఫిషింగ్‌ హార్బర్‌కు కరోనా బ్రేక్‌

నిపుణుల కమిటీ పరిశీలన తరువాతే సర్వే

కరోనాతో కమిటీ రాక పెండింగ్‌


నరసాపురం, ఆగస్టు 7 : నరసాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద ప్రతిపాదించిన మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌ పనులకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. దాదాపు రూ.350 కోట్లు అంచనా వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టు పనుల్ని ముందుగా కేంద్ర నిపుణుల కమిటీ పరిశీలించాల్సి ఉంది. కరోనా కారణంగా కమిటీ రాక రెండుసార్లు రద్దయింది. దీంతో సర్వే, డీపీఆర్‌ రిపోర్టు వంటి కీలక పనులు ముందుకు సాగలేదు. ఈ ఏడాది చివరికైనా టెండర్ల పక్రియ పూర్తవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


రాష్ట్రంలో ఆరు మేజర్‌, రెండు మినీ హార్బర్ల నిర్మాణానికి కేంద్రం గత మార్చిలో ఆమోదం తెలిపింది. దానిలో ఒకటి జిల్లాలో బియ్యపుతిప్ప వద్ద నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా గతంలో మంజూరైన మినీ ఫిషింగ్‌ ల్యాండ్‌ సెంటర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బియ్యపుతిప్ప వద్ద గోదావరి సముద్రంలో కలిసే ప్రదేశం హార్బర్‌ నిర్మాణానికి అనువుగా ఉంటుందని గుర్తించారు. ఆక్వాకు అనుబంధంగా ఉండే కోల్ట్‌ స్టోరేజ్‌ ప్లాంట్‌లు, ఐస్‌ ఫ్యాకర్టీలు, ఆక్వా ఎగుమతి కేంద్రాలు, పెట్రోల్‌ బంక్‌ల ఏర్పాటు కోసం నిర్మాణం జరిగే  పరిసర ప్రాంతాల్లో  సుమారు 400 ఎకరాలను రెవెన్యూ శాఖ గుర్తించింది. హార్బర్‌ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం అనువైనదా? కాదా అన్న విషయాన్ని కేంద్ర నిపుణుల కమిటీ నిర్ధారించాల్సి ఉంది. హార్బర్‌ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా కలిగే ఉపాధి తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలించి కేంద్రానికి నివేదించాల్సి ఉంది. ఈ రిపోర్టుకు కేంద్రం ఓకే అన్న తరువాతే పనులకు సంబంధించిన సర్వే, డీపీఆర్‌ రిపోర్టు వంటి కీలక పనులకు శ్రీకారం పడుతుంది.


అప్పటివరకు టెండర్లను ఆహ్వానించేందుకు అవకాశం ఉండదు. ఈ ఏడాది ఏప్రిల్‌ చివరిలో బియ్యపుతిప్ప ప్రాంతాన్ని కమిటీ పరిశీలించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. తిరిగి జూన్‌ మొదటి వారంలో మరోసారి కమిటీ వస్తుందని సమాచారం వచ్చింది. అప్పుడు కూడా మళ్లీ వాయిదా పడింది. ప్రస్తుతం వైరస్‌ ప్రభావం ఎక్కువుగా ఉండటంతో ఇప్పట్లో కమిటీ పర్యటన ఉండకపోవచ్చన్న అభిప్రాయాన్ని అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు.


కమిటీ పరిశీలించగానే సర్వే..ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే 

ఎంపికచేసిన స్ధలాన్ని నిపుణుల కమిటీ పరిశీలించాల్సి ఉంది. వైరస్‌ కారణంగా రెండు సార్లు వాయిదా పడింది. కమిటీ రప్పించేందుకు ప్రభుత్వం చర్చిస్తున్నది.పరిస్థితులు అనుకూలిస్తే  ఈ ఏడాది చివరినాటికి హార్బర్‌ పనుల్ని ప్రారంభిస్తాం.


Updated Date - 2020-08-08T09:46:15+05:30 IST