కరోనా భయం తొలగించేలా ప్రచారం

ABN , First Publish Date - 2020-08-09T10:07:47+05:30 IST

కరోనా భయంతో ఆర్టీసీ ప్రయాణానికి ప్రజలు వెనుకాడుతున్నారు. రెండు రోజులుగా జిల్లాలో బస్సులు తిరుగతున్నా ఆశించిన మేర ..

కరోనా భయం తొలగించేలా ప్రచారం

ఆర్టీసీ బస్సుల్లో డిపో మేనేజర్ల ప్రయాణం


గుంటూరు, ఆగస్టు 8: కరోనా భయంతో ఆర్టీసీ ప్రయాణానికి ప్రజలు వెనుకాడుతున్నారు. రెండు రోజులుగా జిల్లాలో బస్సులు తిరుగతున్నా ఆశించిన మేర ప్రయాణికులు ముందుకు రావడంలేదు. ప్రయాణికులు లేక కొన్ని రూట్లలో సర్వీసులను కూడా రద్దు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికుల్లో నెలకొన్న భయం పోగొట్టేందుకు ఏకంగా ఆర్టీసీ అధికారులే రంగంలోకి దిగారు. స్వయంగా పలు బస్సుల్లో అధికారులే ప్రయాణిస్తూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం రీజియన్‌ వ్యాప్తంగా 11 మంది డిపో మేనేజర్లు స్వయంగా ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణించారు.


దాదాపు మూడు వారాల తరువాత ప్రారంభించిన ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో తొలి రోజు శుక్రవారం రీజియన్‌ వ్యాప్తంగా బస్సులు 10, 15 మందితోనే రాకపోకలు సాగించాయి. కరోనా దెబ్బకు కుదేలైనా ఆర్టీసీకి అరకొర ప్రయాణికులతో మరింత నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. దీంతో డిపో మేనేజర్లు స్వయంగా రంగంలోకి దిగి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. గుంటూరు-1 డిపో మేనేజర్‌ షర్మిలఅశోక గుంటూరు - విజయవాడ పల్లెవెలుగు సర్వీసులో ప్రయాణించారు. పొన్నూరు, చిలకలూరిపేట, బాపట్ల, తెనాలి, రేపల్లె, మంగళగిరి, సత్తెనపల్లి, నరసరావుపేట, మాచర్ల, వినుకొండ డిపో మేనేజర్లు, ఇతర సూపర్‌వైజర్లు డిపోల పరిధిలోని రూట్లలో స్వయంగా ప్రయాణించి ప్రయాణికుల్లో భయాందోళనలు పొగొట్టే ప్రయత్నం చేశారు. గుంటూరు-1 డీఎం షర్మిలఅశోక మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణం చేసే సమయంలో ప్రయాణికులు శానిటైజర్‌తో పాటు నోటికి మాస్కులు ధరించటం వంటి జాగ్రత్తలు పాటించాలని, ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్‌-19 నిబంధనలు మేరకు ఇప్పటికే బస్సుల్లో సీటింగ్‌ను భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసీ ప్రయాణం సురక్షితమన్నారు.


Updated Date - 2020-08-09T10:07:47+05:30 IST