కరోనా మృత్యుకేళి

ABN , First Publish Date - 2021-04-23T06:38:21+05:30 IST

జిల్లాలో పేదలకు పెద్దదిక్కుగా ఉన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు.

కరోనా మృత్యుకేళి

స్వర్గపురి శ్మశాన వాటికలో నిత్యం రగులుతున్న చితిమంటలు

కరోనా మహమ్మారి మరింత వికృతరూపం దాల్చి ప్రజల ప్రాణాలను హరిస్తోంది. కంటికి కనబడని వైరస్‌కు బలైపోతున్న మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆసుపత్రులు, శ్మశాన వాటికలు మార్మోగుతున్నాయి. 

ఆంధ్రజ్యోతి-విజయవాడ : జిల్లాలో పేదలకు పెద్దదిక్కుగా ఉన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. సగటున గంటకొకరు మృత్యువాత పడుతున్నారు. వారం రోజులుగా ప్రతిరోజూ మార్చురీకి 25 నుంచి 30 మృతదేహాలను తరలిస్తున్నారు. వీటిలో ఒకటి, రెండు మినహా మిగిలినవన్నీ కరోనా మరణాలే. నిబంధనల ప్రకారం కొవిడ్‌ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడానికి వీల్లేకపోవడంతో సిబ్బందే అంబులెన్స్‌లో తీసుకువెళ్లి కృష్ణలంకలోని విద్యుత్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా చితిమంటలు మండుతున్నా రోజుకు 10 నుంచి 12 శవాలకు మించి దహన సంస్కారాలు నిర్వహించలేకపోతున్నారు. దీంతో ఏరోజు మరణించినవారిని అదేరోజు దహన సంస్కారాలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో మార్చురీలో మృతదేహాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఇవి పాడైపోకుండా భద్రపరిచేందుకు మార్చురీలో 40 ఫ్రీజర్లు ఉన్నా వాటిలో 15 నిరుపయోగంగా ఉన్నాయి. పనిచేస్తున్న 25 ఫ్రీజర్లలో మృతదేహాలను ఉంచగా.. ఇంకా పదుల సంఖ్యలో మృతదేహాలు బయట స్ట్రెచర్లపైనే ఉండిపోతున్నాయి. ఇలా రోజుల తరబడి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించకుండా మార్చురీలోనే ఉంచేస్తున్నారు. తమ ఆప్తుల మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహించుకోలేని దుస్థితిలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ప్రైవేటు శ్మశాన వాటికల్లో డబ్బులు చెల్లించి అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు ముందుకొస్తున్నారు. ఇలా గురువారం 35 కొవిడ్‌ మృతదేహాలను మార్చురీ నుంచి అంత్యక్రియలకు తరలించగలిగారు. ఇంకా 28 మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయి. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరిస్థితి ఇంత భయానకంగా ఉండగా.. ఇక జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో మరణిస్తున్న కొవిడ్‌ మృతదేహాలను ప్రైవేటు శ్మశాన వాటికలకు నేరుగా తీసుకెళ్లి దహన సంస్కారాలు, అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2021-04-23T06:38:21+05:30 IST