కరోనాతో ఎన్ని‘కలవరం’.. కార్పొరేషన్‌ ప్రచారంపై కొవిడ్‌ ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2021-04-23T05:20:40+05:30 IST

ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూసిన కార్పొరేషన్‌ ఎన్నికలు రానేవచ్చాయి. మరో వారం రోజుల్లో పోలింగ్‌ జరగనుంది. ఓటర్లను కలిసేందుకు అభ్యర్థులు సమాయత్తమవుతున్నిరు.

కరోనాతో ఎన్ని‘కలవరం’.. కార్పొరేషన్‌ ప్రచారంపై కొవిడ్‌ ఎఫెక్ట్‌
రాత్రి కర్ఫ్యూపై మైక్‌లో ప్రచారం చేస్తున్న దృశ్యం

ఓటర్లను నేరుగా కలవలేకపోతున్న అభ్యర్థులు

ప్రచారానికీ అంతగా స్పందించని ప్రజలు 

మీడియా, సోషల్‌ మీడియా వేదికగా ఓట్ల అభ్యర్థనలు 

ఖాళీగా దర్శనమిస్తున్న పార్టీల డివిజన్‌ కార్యాలయాలు

ఖమ్మం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూసిన కార్పొరేషన్‌ ఎన్నికలు రానేవచ్చాయి. మరో వారం రోజుల్లో పోలింగ్‌ జరగనుంది. ఓటర్లను కలిసేందుకు అభ్యర్థులు సమాయత్తమవుతున్నిరు. కానీ వారికి కొవిడ్‌ పెద్ద అడ్డంకిగా మారింది. కరోనా రెండోదశ వ్యాప్తి మరింత పెరుగుతుండటం, బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అభ్యర్థులు, నేతలు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు ఇంటింటి ప్రచారం చేసేందుకు జంకుతుండగా.. మరోవైపు ఓటర్లను కలవకపోతే తమకు ఓట్లెలా పడతాయన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. కరోనా కలకలం రేపుతోన్న వేళ జరుగుతున్న ఈ ఎన్నికలు తమకు పెద్ద పరీక్షగా మారాయన్న అభిప్రాయం పలువురు అభ్యర్థులు, నేతల్లో వ్యక్తమవుతోంది. 

ఓటర్లను నేరుగా కలవలేని పరిస్థితి.. 

బరిలో నిలిచే అభ్యర్థులకు అసలు ఎన్నికల సవాలు ఎదురయ్యే కీలకసమయం. గతంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై మళ్లీ బరిలో నిలిచిన వారు గతంలో తాము చేసిన అభివృద్ధిని, కొత్తగా బరిలో ఉన్నవారైతే తాము గెలిస్తే ఎలా అభివృద్ధి చేస్తారో ప్రజలకు వివరించుకునే సమయం. అలాంటి కీలకమైన ప్రచార సమయంలో కరోనా కారణంగా ఓటర్లను నేరుగా కలవలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో తాము ఓటర్లకు దగ్గరకాలేకపోతున్నామని కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అభ్యర్థులు ధైర్యం చేసి డివిజన్లలో ప్రచారానికి వెళితే.. కరోనా వ్యాప్తి భయంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడం లేదని సమాచారం. దీంతో నేతలు, అభ్యర్థులు ప్రధాన రహదారుల్లో రోడ్‌షోలు చేస్తూ పదిమంది కనిపించిన చోట వాహనంపై నుంచే ప్రసంగించి గెలిపిస్తే తామేం చేయబోతున్నామో వివరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో భారీ ర్యాలీలు కనిపించగా.. ఈసారి ఆ కళ తప్పింది. అభ్యర్థులు చాలా తక్కువమందిని తమతో తిప్పుకొంటూ ఓట్లకోసం పాకులాడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 

మీడియాతోనే ముందుకెళ్లాలన్న యోచన..

రెండు రోజులుగా ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నా.. ఓటర్లనుంచి స్పందన అంతగా లేకపోవడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని డివిజన్లలో ఏయే పార్టీలు బరిలో ఉన్నాయో..? ఏ అభ్యర్థులు.. ఎంతమంది పోటీ చేస్తున్నారో కూడా తెలియడం లేదంటే పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉందో అర్థమవుతోంది. దీంతో కొన్ని డివిజన్ల అభ్యర్థులు ఓటర్లను చేరువయ్యేందుకు పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇంటింటికి కరపత్రాలు, డోర్‌పోస్టర్లు వేస్తుండగా.. కొందరు అభ్యర్థులు మీడియాను, మరీ ముఖ్యంగా సోషల్‌మీడియాను వినియోగించుకుంటున్నారు. తమ డివిజన్‌కు సంబంధించిన వాట్సప్‌ గ్రూపులు, ఫేస్‌బుక్‌ పేజీలు, మెసెంజర్లు, టెలిగ్రామ్‌ గ్రూపులు లాంటి వాటిలో తమకు సంబంధించిన ప్రచారాన్ని చేసుకుంటున్నారు. సంక్షిప్త, వీడియో సందేశాలు పంపుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 

ఖాళీగా పార్టీల డివిజన్‌ కార్యాలయాలు..

ప్రచారానికి ఉన్న సమయమే చాలా తక్కువ. అందులోనూ కరోనా వేళ బహిరంగంగా తిరిగే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా మంగళవారం రాత్రి నుంచి నైట్‌కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. ప్రచారాలన్నీ 8 గంటలకు ముగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఉన్న సమయంలోనే ఓటర్లను కలిసేందుకు వెళ్లాలనుకున్నా వేసవి కాలం కావడంతో ఉదయం 10 దాటితేచాలు ఎండలు మండిపోతున్నాయి. దాంతో అభ్యర్ధులు ఉదయం, సాయంత్రం కలిపి నాలుగైదు గంటల వ్యవధిలోనే ప్రచారం నిర్వహించుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో సభ్యులు సమావేశమవడానికి ఏర్పాటు చేసుకున్న డివిజన్‌ కార్యాలయాన్ని ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఏదేమైనా గురువారం అభ్యర్థుల లెక్క తేలగా.. శుక్రవారం నుంచి ప్రచారం ముమ్మరం కానుంది. కానీ ప్రజలను కరోనా తీవ్ర భయబ్రాంతులను చేస్తున్న క్రమంలో ఇక ఈ ఎన్నికలు ఎలా సాగుతాయోనన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది.


Updated Date - 2021-04-23T05:20:40+05:30 IST