కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2021-04-18T05:29:09+05:30 IST

కరోనా కల్లోలం

కరోనా కల్లోలం
ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు భారీ క్యూ

జిల్లాలో భారీగా పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

మరణాల్లోనూ అదే తీరు

కొత్త ప్రభుత్వాసుపత్రిలో భయానక పరిస్థితులు

అప్రమత్తమైన అధికార యంత్రాంగం

కొవిడ్‌ కట్టడికి యాక్షన్‌ ప్లాన్‌

అధికారులతో కలెక్టర్‌ ఇంతియాజ్‌ అత్యవసర సమావేశం

నేటి నుంచి పకడ్బందీగా చర్యలు

నేడు వ్యాపార సంస్థలు మూసివేత

19 నుంచి 30 వరకు సాయంత్రం 6 గంటల వరకే..

కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు భారీగా పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా అలాగే ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఆదివారం నుంచి మాస్కులేని వారికి భారీగా జరిమానాలు విధించనున్నారు. ఇకపై కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు జిల్లాలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : రాష్ట్రంలో కరోనా అలజడి మొదలైనప్పటికి నుంచి శనివారం నాటికి అన్ని జిల్లాల్లో కలిపి 9,52,560 మంది వైరస్‌ బారిన పడితే, వారిలో 7,388 మంది మరణించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది. మన జిల్లాలో మొత్తం 54,666 మంది వైరస్‌ బారిన పడగా, వారిలో 700 మంది చనిపోయారు. 913 కొవిడ్‌ మరణాలతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా, 700 మరణాలతో మనజిల్లా రెండో స్థానంలో నిలిచింది. మన జిల్లాలో కరోనా మరణాల రేటు రాష్ట్ర సగటు కన్నా రెట్టింపు సంఖ్యలో ఉండటం అధికారులను సైతం కలవరపాటుకు గురిచేస్తోంది. 

అప్రమత్తమైన అధికార యంత్రాంగం

రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటం, మరణాలు కూడా అదే సంఖ్యలో నమోదవుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నివారణా చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆదివారం నుంచి కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలని, మాస్కులు ధరించని వారికి భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించింది. అంతేకాదు.. జిల్లా ఉన్నతాధికారులతో కలెక్టర్‌ ఇంతియాజ్‌ శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. కరోనా యాక్షన్‌ ప్లాన్‌పై దిశానిర్దేశం చేశారు. సెకండ్‌ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉన్నతస్థాయి అధికారులతో నోడల్‌ అధికారులను నియమించారు. పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో సోమవారం నుంచి కరోనా వైద్యసేవలు అందించడానికి ఏర్పాట్లు చేశారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండే వారికి సలహాలు, సూచనలు అందించేందుకు ఎన్టీఆర్‌ డెంటల్‌ ఆసుపత్రిలో ట్రై ఏజ్‌ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు, ల్యాబ్‌, కాంటాక్టు ట్రేసింగ్‌, కంటైన్‌మెంట్‌ జోన్ల నిర్వహణ, ట్రై ఏజ్‌ సెంటర్‌, హోమ్‌ క్వారంటైన్‌, 104 కాల్‌ సెంటర్‌, కొవిడ్‌ హాస్పిటల్స్‌, డెస్క్‌, ఆక్సిజన్‌, మందులు, ఇతర సేవలు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా జిల్లాస్థాయి అధికారులను నియమించారు. అంబులెన్స్‌తో పాటు మృతిచెందిన వారి వివరాలను సేకరించేందుకూ అధికారులను నియమించారు. 

నేడు వ్యాపార సంస్థల బంద్‌

విజయవాడ నగరంలోని అన్ని వ్యాపార సంస్థలను ఆదివారం పూర్తిగా మూసివేయడంతో పాటు ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకూ రోజూ సాయంత్రం 6 గంటలకే దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయాలని విజయవాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు వ్యాపారులకు పిలుపునిచ్చారు. కొవిడ్‌ నివారణకు ప్రతి వ్యాపార సంస్థ యజమాని, సిబ్బంది, కుటుంబ సభ్యులు తప్పక మాస్క్‌ ధరించి, శానిటైజేషన్‌ చేయడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు.

జీజీహెచ్‌లో భయానకం

కొత్త ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి భయానకంగా మారింది. గురువారం ఏడుగురు, శుక్రవారం ఎనిమిది మంది, శనివారం సాయంత్రానికి 14 మంది కరోనాతో మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే, అధికారిక బులెటిన్‌లో మాత్రం రోజుకు ఒకటి లేదా రెండు మరణాలనే చూపుతున్నారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడానికి నిబంధనలు అడ్డు రావడంతో ఆసుపత్రి సిబ్బందే మహాప్రస్థానం వాహనాల్లో కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశాన వాటికకు తరలించి ఎలక్ట్రిక్‌ క్రిమిటోరియంపై అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే, అక్కడ రోజుకు 8 నుంచి 10 మృతదేహాలకే అంత్యక్రియలు నిర్వహించగలుగుతున్నారు. దీంతో ప్రభుత్వాసుపత్రి మార్చురీలో శవాలు పేరుకుపోతున్నాయి. వాటిని భద్రపరచడానికి ఫ్రీజర్లు సరిపోక స్ట్రెచ్చర్లపైనే ఉంచేస్తున్నారు. 




Updated Date - 2021-04-18T05:29:09+05:30 IST