నష్టాల‘పాలు’!

ABN , First Publish Date - 2020-08-09T10:24:47+05:30 IST

కరోనా ప్రభావం జిల్లాలో పాడి రైతులను కుదిపేస్తోంది. నష్టాల‘పాలు’ చేస్తోంది.

నష్టాల‘పాలు’!

పాడి రైతులపై కరోనా ప్రభావం

భారీగా తగ్గిన పాల ధరలు

లీటరుపై రూ.10 నుంచి 15 వరకూ తగ్గిన వైనం..

పెరిగిన దాణా ధరలు..


రాప్తాడు ఆగస్టు 8: కరోనా ప్రభావం జిల్లాలో  పాడి రైతులను కుదిపేస్తోంది. నష్టాల‘పాలు’ చేస్తోంది. లాక్‌డౌన్‌తో పాలకు డిమాండ్‌ తగ్గి, ధరలు పడిపోయాయి. దాణా రేటు పెరగటంతో పాడిరైతు కుదేలయ్యాడు. లాక్‌డౌన్‌కు ముందు లీటరు ఆవు పాల ధర నాణ్యతను బట్టి రూ.30 నుంచి 35 వరకూ ఉండేది. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి నెలనెలా తగ్గుముఖం పట్టసాగాయి. ప్రస్తుతం రూ. 20 నుంచి 25 వరకు విక్రయిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పాల ధరలు పడిపోతుండటంతో రైతులు కుదేలవుతున్నారు. ఇలా ధరలు కొనసాగితే వచ్చే ఆదాయమంతా పశువల మేత, దాణాకే సరిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


 హంద్రీనీవా కాలువ, పీఏబీఆర్‌ కుడి కాలువ ద్వారా ప్రతి ఏడాది రాప్తాడు నియోజకవర్గంలో చెరువులకు నీరు చేరుతోంది. దీంతో అనేక గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగాయి. వ్యవసాయం భారమవుతున్న తరుణంలో నియోజకవర్గంలోని చాలా మంది రైతులు పచ్చి గడ్డి పెంచి, పాడి పశువుల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. పాలలో వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. అనంతపురం నగరం సమీప గ్రామాల రైతులు కొంతమంది ఉదయం, సాయంత్రం పాలను నగరానికి తీసుకొచ్చి, టీ దుకాణాలు, హోటళ్లు, ఇళ్లకు అమ్మేవారు. ఇంకొందరు గ్రామాల్లోనే ఏజెంట్ల ద్వారా ప్రైవేటు డెయిరీలకు సరఫరా చేసేవారు. ఆయా డెయిరీల యాజమాన్యాలు పాడి రైతులకు 15 రోజులకు ఒకసారి బిల్లు మొత్తం చెల్లించేవారు. కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌ నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. వసతి గృహాలు, హోటళ్లు, టీ దుకాణాలు తదితరాలు బంద్‌ కావడంతో పాలు కొనేవారు తగ్గారు. దీంతో ప్రైవేటు డెయిరీల యాజమానులు ప్రతి నెలా లీటరు పాలపై రూ.3 నుంచి రూ.4 వరకూ తగ్గిస్తూ వచ్చారు. నాలుగు నెలల కాలంలోనే రూ. 10 నుంచి రూ. 15 వరకు తగ్గించారు. పస్తుతం లీటరు ఆవుపాల ధర రూ.20 నుంచి 25కు చేరింది. గేదె పాలదీ ఇదే పరిస్థితి. గతంలో లీటరు గేదె పాల ధర రూ.50 నుంచి 60 ఉండగా ప్రస్తుతం రూ.40 నుంచి 50 వరకు తగ్గింది.


ఉత్పత్తి పెరిగినా ధరలేదు

ఖరీఫ్‌లో వర్షాలు కురుస్తాయి కావున పచ్చిగడ్డికి కొదువ ఉండదు. పచ్చిగడ్డి మేయడం వలన ఈ సీజన్‌లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ప్రస్తుతం ఉత్పత్తి బాగా ఉన్నప్పటికీ ధరలు తగ్గాయని పాడి రైతులు ఆవేదన చెందుతున్నారు. పాల ఉత్పత్తి పెరగాలంటే పశువులకు తప్పనిసరిగా దాణా వేయాల్సిందే.  వేరుశనగ చెక్క, నూకలు, తౌడు, వడియాలు, బిస్కెట్‌, పిండి తదితర దాణా ఉపయోగిస్తారు. ప్రస్తుతం పాల ధరలు తగ్గినా దాణా ధరలు మాత్రం తగ్గడం లేదని రైతులు వాపోతున్నారు.


శ్రమకు తగిన ఫలితం లభించట్లేదు:జయప్రకాష్‌, రైతు, గంగలకుంట

రోజూ 80 లీటర్ల పాలను ఓ ప్రైవేటు డెయిరీకి సరఫరా చేస్తా. గతంలో లీటరు ధర రూ.35 వరకు ఉండేది. నెలకు రూ.80 వేలకు పైగా వచ్చేది. అందులో దాణా, ఇతర ఖర్చులు పోనూ నెలకు రూ. 40 వేలు వరకు మిగిలేది. ప్రస్తుతం లీటరు పాలకు దర రూ.22 మాత్రమే ఇస్తున్నారు. దీంతో నెల రూ.50 వేలు వరకు వస్తోంది. ఖర్చులు పోను రూ.15 వేలు మాత్రమే మిగులుతోంది. భార్యాభర్తలు ఇద్దరూ రోజంతా కష్టపడి పది పశువులు పోషిస్తున్నా.. తగిన ప్రతిఫలం లభించడం లేదు.  


గిట్టుబాటు ధర కల్పించాలి:శీనయ్య, రైతు, గొందిరెడ్డిపల్లి

ఓ ప్రైవేటు డెయిరీకి రోజూ 40 లీటర్ల పాలు సరఫరా చేస్తున్నా. లాక్‌డౌన్‌కు ముందు లీటరు ఆవు పాలకు రూ.35 ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.22 మాత్రమే ఇస్తున్నారు. దీంతో శ్రమకు తగిన ఆదాయం రావడంలేదు. ప్రభుత్వం స్పందించి, పాలకు గిట్టుబాటు ధర కల్పించాలి. సబ్సిడీ ద్వారా దాణా కూడా పంపిణీ చేయాలి.

Updated Date - 2020-08-09T10:24:47+05:30 IST