ఊరు..కోలేదు..!

ABN , First Publish Date - 2021-06-22T05:14:26+05:30 IST

ఊరు..కోలేదు..!

ఊరు..కోలేదు..!
పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతాలలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్న సిబ్బంది

పల్లెల్లో ఇంకా కరోనా పంజా

అర్బన్‌ కంటే గ్రామాల్లోనే ఎక్కువ కేసులు

విజయవాడ రూరల్‌, నూజివీడు డివిజన్లలో భారీగా..

అర్బన్‌ ప్రాంతాల్లో 10 నుంచి 15 శాతం

గ్రామాల్లో 35 శాతానికి పైగా కేసులు

పాజిటివిటీ రేటు తగ్గినా ఆగని మరణాలు 

పచ్చటి పల్లెలపై కరోనా పంజా విసురుతోంది. మొదటి దశలో గ్రామాలవైపు పెద్దగా చూడని ప్రాణాంతక వైరస్‌ రెండో దశలో మాత్రం ప్రతాపం చూపిస్తోంది. తాజాగా జిల్లావ్యాప్తంగా పాజిటివిటీ రేటు తగ్గుతున్నా.. కొన్ని గ్రామాల్లో లెక్కకుమించి కేసులు నమోదవుతుండటం, మరణాల సంఖ్య కూడా అలాగే ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక ప్రస్తుతం రోజువారీ నమోదవుతున్న కేసుల్లో అధిక భాగం రూరల్‌ ప్రాంతాలవే కావడం కలవర పరుస్తోంది.

విజయవాడ, ఆంధ్రజ్యోతి : మొదటి దశలో నగరాలు, పట్టణాలపై విరుచుకుపడిన కరోనా మహమ్మారి రెండో దశలో పల్లెలపై పగ తీర్చుకుంటోంది. తొలి దశలో అర్బన్‌ ఏరియాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ప్రభావం తక్కువగానే కనిపించింది. కానీ, ఈ ఏడాది మార్చి రెండో వారం నుంచి సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచి నగరాలు, పట్టణాల కంటే పల్లెల్లోనే వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. జిల్లాలో సెకండ్‌ వేవ్‌ మొదలైన మార్చి నెలలో 1,600 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏప్రిల్‌లో 11వేలు, మేలో ఏకంగా 26వేలు నమోదు కాగా, ఈనెలలో ఉధృతి తగ్గింది. ఈ నెలలో ఆదివారం వరకు వెలుగుచూసిన పాజిటివ్‌ కేసులు 10వేలలోపే ఉన్నాయి. మేలో 30 శాతం వరకు ఉన్న పాజిటివిటీ రేటు ఇప్పుడు 5 శాతానికి దిగొచ్చింది. గత నెలలో రోజుకు 1,000 నుంచి 1,500 మధ్యలో నమోదైన పాజిటివ్‌ కేసులు పక్షం రోజులుగా 400 నుంచి 500లోపే నమోదవుతున్నాయి. చాలామంది హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉంటుండగా, పరిస్థితి విషమించిన వారు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాదాపు 90 శాతానికి పైగా బాధితులు త్వరగానే కోలుకుంటుండటంతో డిశ్చార్జిల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో కొవిడ్‌ ఆసుపత్రుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య సగానికి సగం తగ్గింది. గత మేలో కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందే బాధితుల సంఖ్య 12వేల మందికి పైగా ఉంటే, ప్రస్తుతం 5వేలకు తగ్గింది. ఇవన్నీ కాస్త ఊరటనిచ్చే అంశాలే కానీ, ఇప్పుడు గ్రామాల్లో కరోనా కొత్త కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం, అదే క్రమంలో రోజుకు నలుగురైదుగురు మృత్యువాత పడుతుండటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. 

నిబంధనలు పాటించకపోవడం వల్లే.. 

నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కర్ఫ్యూ పకడ్బందీగా అమలవుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో తూతూమంత్రంగానే ఉంటోంది. పైగా కొంతమంది ప్రజలు కొవిడ్‌ నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం కూడా గ్రామాల్లో కరోనా కేసుల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఇక పల్లెల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు ఆశించిన స్థాయిలో జరగట్లేదు. అక్కడక్కడా కొన్ని పీహెచ్‌సీల్లో మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. చాలామందిలో లక్షణాలు బయటపడకపోవడంతో వారంతా మామూలుగానే తిరిగేస్తున్నారు. కొంతమందిలో లక్షణాలు బయటపడినా తమకు కరోనా సోకినట్లు తెలిస్తే ఎక్కడ అంటరానివారుగా చూస్తారోనన్న భయంతో గుట్టుచప్పుడు కాకుండా మెడికల్‌ షాపుల నుంచి మందులు తెచ్చుకుని వాడుతున్నారు. అప్పటికీ కరోనా తగ్గకపోతే ప్రాణభయంతో పట్టణాలు, నగరాలకు వచ్చి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఇంటి దగ్గరే ఉండి వైద్యం పొందే క్రమంలో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కొందరు వైరస్‌ తీవ్రత ముదిరిపోయాక ప్రైవేట్‌ ల్యాబ్‌లు, ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. 

ఆ రెండు డివిజన్లలోనే ఎక్కువ

జిల్లాలోని మొత్తం 981 గ్రామాల్లో మూడొంతులకు పైగా పల్లెలు ఇప్పటికీ కరోనా పడగ నీడలో వణికిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడ రూరల్‌, నూజివీడు డివిజన్లలోని పల్లెలపై కరోనా ప్రతాపం చూపిస్తోంది. ఈ డివిజన్లలో రోజూ 100 నుంచి 150 కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. విజయవాడ అర్బన్‌, గుడివాడ, మచిలీపట్నం డివిజన్లలో 50 నుంచి 100లోపు కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ నమోదవుతున్న మొత్తం కేసుల్లో అర్బన్‌ ప్రాంతాల్లో 10 నుంచి 15 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతానికి పైగా ఉంటున్నాయి. వారం రోజులుగా జిల్లాలో 400 నుంచి 500 మధ్య కొత్త పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, వాటిలో మూడొంతుల కేసులు విజయవాడ రూరల్‌, నూజివీడు డివిజన్లలోవే. ఈ క్రమంలోనే కొవిడ్‌ మరణాలూ సంభవిస్తున్నాయి. 



Updated Date - 2021-06-22T05:14:26+05:30 IST