నేటి నుంచి జరిమానాలు

ABN , First Publish Date - 2021-04-18T05:12:31+05:30 IST

నేటి నుంచి జరిమానాలు

నేటి నుంచి జరిమానాలు

మాస్క్‌ ధరించకపోతే కరోనా ఫైన్‌

బహిరంగ ప్రదేశాల్లో రూ.500, మాల్స్‌, థియేటర్లు, ఫంక్షన్‌ హాళ్లలో అయితే రూ.1,000

రెవెన్యూ, పంచాయతీ, పోలీస్‌, మునిసిపల్‌ సిబ్బందికి కలెక్టర్‌ ఆదేశాలు 

మాస్కులు విక్రయించాలని వ్యాపారులకు సూచన

విజయవాడ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : కరోనా సెకండ్‌ వేవ్‌ కోరలు చాస్తున్న సమయాన జిల్లా యంత్రాంగం నిబంధనలను కఠినతరం చేసింది. ఆదివారం నుంచి జిల్లాలో భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాలు, జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌ తప్పక ధరించాలని, లేకుంటే జరిమానా విధించాలని రెవెన్యూ, పంచాయతీ, మునిసిపల్‌, పోలీస్‌ సిబ్బందికి కలెక్టర్‌ ఇంతియాజ్‌ శనివారం ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి రూ.500, జన సామర్థ్యం ఎక్కువగా ఉండే వ్యాపార దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, థియేటర్లు, ఫంక్షన్‌ హాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో అయితే రూ.1,000 జరిమానా విధించాలని సూచించారు. కొవిడ్‌ మార్గదర్శకాలు పాటించకపోతే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌-2005 సెక్షన్‌ 51-60 వరకు పొందుపరిచిన నిబంధనల మేరకు ఐపీసీ సెక్షన్‌ 188, ఇతర చట్టపరమైన అంశాలతో శిక్షించే అధికారం ఉంటుందన్నారు. ఈ మార్గదర్శకాలు ప్రయాణాల్లోనూ వర్తిస్తాయని చెప్పారు. అలాగే, ప్రతి వ్యాపారి తమ దగ్గర మాస్కులను అందుబాటులో ఉంచాలని, ఒక్కో మాస్కును రూ.10కు విక్రయించాలని ఆదేశించారు. కొవిడ్‌ కేసుల దృష్ట్యా జరిమానాలు విధించక తప్పటం లేదని, ప్రజల ఆరోగ్యం కోసం తీసుకుంటున్న ఈ చర్యలకు సహకరించాలని కలెక్టర్‌ కోరారు.

Updated Date - 2021-04-18T05:12:31+05:30 IST